logo

హెచ్చెల్సీ నీటి ప్రవాహానికి ఆటంకం

Published : 21 Jun 2024 06:28 IST

సత్వర మరమ్మతులకు రూ.1.22 కోట్లు అవసరం
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), బొమ్మనహాళ్, న్యూస్‌టుడే

బొమ్మనహాళ్‌ మండలం హరేసముద్రం బ్రాంచి కాలువ తూము దుస్థితి ఇలా..

అనంత జిల్లా జీవనాడి తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (టీబీ-హెచ్చెల్సీ) గండ్లు, రంధ్రాలతో అధ్వానంగా మారింది. యాభైఏళ్ల క్రితం నిర్మించిన కాలువ గట్లు, వంతెనలు, యూటీ.. ఇలా అన్నీ శిథిలావస్థకు చేరాయి. గడిచిన ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో కాలువ నిర్వహణ అటకెక్కింది. కనీస మరమ్మతులు, నిర్వహణకు పైసా కూడా ఇవ్వలేదు. చిన్నచిన్న మరమ్మతులు సైతం చేయలేని దయనీయ దుస్థితి నెలకొంది. జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా చివరి ఆయకట్టుకు నీరు చేరలేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా... హెచ్చెల్సీ ద్వారా సకాలంలో జలాలను తెచ్చుకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా.. రాష్ట్రంలో తెదేపా కూటమి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే... రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 8న హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డి, తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాఫీగా నీటి ప్రవాహానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణ మరమ్మతులకు నిధులు ఎన్ని కావాలో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపారు.

ఐదు పనులే కీలకం

హెచ్చెల్సీ యంత్రాంగం మరమ్మతులకు సంబంధించి ఐదు రకాల పనులను గుర్తించింది. పనులు ఆగమేఘాలపై చేసేందుకు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇందుకు మొత్తం రూ.1.22 కోట్లు అవుతుందని ప్రణాళిక రూపొందించారు. ఇదివరకే ప్రధాన కాలువ దారుణ స్థితికి చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల కాలువ దెబ్బతింది. 181.100 కి.మీ. వద్ద గట్టు కోతకు గురైంది. 119.682 కి.మీ. వద్ద ఉన్న యూటీకి రంధ్రాలు పడ్డాయి. 140.408 కి.మీ. వద్ద 6బీ-6బీఐఆర్‌ ఓటీ పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. 144-145 కి.మీ.దాకా కాలువ గట్టుపై పాడైన రహదారిని పునరుద్ధరించాల్సి ఉంది. కణేకల్లు చెరువు స్లూయిస్‌-2ను సత్వరమే మరమ్మతు చేయాలి.

84 కి.మీపై నీలినీడలు

హెచ్చెల్సీ ప్రధాన కాలువ మొత్తం 84 కి.మీ. ఉంది. టీబీ జలాశయం నుంచి మొదలై 105 కి.మీ. దాకా కర్ణాటకలోనే కొనసాగుతుంది. అనంత జిల్లా సరిహద్దు నుంచి మొదలయ్యే 105 కి.మీ. ఉరవకొండ మండలం మోపిడి దాకా 189 కి.మీ. పొడవు ఉంది. మొత్తం 84 కి.మీ. జిల్లాలో ప్రధాన కాలువ కొనసాగుతుంది. ఇదంతా శిథిలావస్థలో ఉంది. 2600 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ ఉన్నా... ఏనాడూ 2వేల క్యూసెక్కులకు మించి తెచ్చుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఆధునికీకరించాల్సి ఉంది. ప్రస్తుతం నీటి సీజన్‌ మొదలు కావడంతో ఆధునికీకరణ పనులు చేయడం అసాధ్యం. తక్షణమే గుర్తించిన పనులకు మరమ్మతు చేపట్టాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

హెచ్చెల్సీ 119.638 కి.మీ. వద్ద యూటీకి రంధ్రాలు పడ్డాయి. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు శిథిలావస్థలో ఉన్న యూటీ దెబ్బతింది. సత్వరమే మరమ్మతు చేయాల్సి ఉంది. లేదంటే నీటి ప్రవాహం సాఫీగా సాగదు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని