logo

NH 44: అనంత ప్రగతికి ౧౨ వరుసల రహదారి

అనంత ప్రగతి పరుగులు పెట్టనుంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ముందడుగు వేశాయి.

Updated : 11 Jul 2024 07:29 IST

ఉమ్మడి జిల్లాలో ఎన్ని కిలోమీటర్లు: 180 
ప్రారంభం... ముగింపు: గుత్తి మండలం ఊబిచర్ల నుంచి చిలమత్తూరులోని కొడికొండ వరకు..  

జాతీయ రహదారి-44 విస్తరణతో పారిశ్రామీకరణకు ఊతం

ఈనాడు డిజిటల్, అనంతపురం: అనంత ప్రగతి పరుగులు పెట్టనుంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ముందడుగు వేశాయి. జాతీయ రహదారి-44ను విస్తరించాలని నిర్ణయించారు. నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు వేగంగా రూపొందిస్తున్నారు. అన్ని కుదిరితే త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ ఏడాదే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడంతో పాటు రెండో మెట్రో నగరాల మధ్య పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 

 లాజిస్టిక్‌ హబ్‌లకు అవకాశం

హైదరాబాద్, బెంగళూరు మధ్య సరకు రవాణా కేంద్రాల అవసరం పెరిగింది. రెండు నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగింది. సరకు రవాణా చేసే భారీ వాహనాలు నగరాల్లో ప్రవేశించాలంటే కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో నగర శివార్లలోనే దింపేసి అక్కడి నుంచి చిన్న వాహనాల ద్వారా తరలిస్తారు. దీనికోసం పెద్దఎత్తున లాజిస్టిక్‌ హబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో లాజిస్టిక్‌ హబ్‌కు కనీసం 50 నుంచి 60 ఎకరాల భూమి అవసరం.ఇప్పటికే అనంతపురం పరిధిలో 150 ఎకరాల్లో లాజిస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై గత వైకాపా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. గుంతకల్లు, శింగనమల, అనంతపురం, రాప్తాడు, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల మీదుగా ఎన్‌హెచ్‌-44 వెళ్తోంది. రోడ్డును విస్తరిస్తే చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధర పెరగనుంది. ఆయా నియోజకవర్గాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం కానుంది. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా గతంలోనే తెదేపా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ కంపెనీలు నెలకొల్పాలని సంకల్పించింది. ఈ ఐదేళ్లలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. 

  • కర్ణాటకలోని రామనగర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం కలిపి ఎన్‌హెచ్‌-67, బళ్లారి నుంచి ఏపీ మీదుగా తమిళనాడును కలిపి ఎన్‌హెచ్‌-42, కర్ణాటక నుంచి నంద్యాల మీదుగా విజయవాడను కలిపే ఎన్‌హెచ్‌-544డీ, ఎఫ్‌ వంటి రహదారులు ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్తూ ఎన్‌హెచ్‌-44తో అనుసంధానం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు రహదారుల విస్తరణ పనులను మొదలుపెట్టారు. 

 పోయినవి వెనక్కి..! 

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కియాను తీసుకొచ్చింది. సుమారు 13 వేల కోట్ల పెట్టుబడితో పెనుకొండ సమీపంలో పరిశ్రమ ఏర్పాటైంది. 100కు పైగా అనుబంధ సంస్థలతో అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో 18 వరకు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఐదేళ్ల జగన్‌ పాలనలో కక్షసాధింపు చర్యలతో పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలివెళ్లాయి. తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో గతంలో ఒప్పందం చేసుకున్నవి తిరిగి వచ్చి.. కార్యలాపాలు చేపడతాయన్న ఆశాభావం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది

పెట్టుబడులకు దోహదం

ఇప్పటికే జాతీయ రహదారి వెంబడి పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కియాతో పాటు పలు అనుబంధ సంస్థలు వచ్చాయి. పాలసముద్రం వద్ద నాసిన్‌ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. చిలమత్తూరు పరిధిలో పలు గార్మెంట్స్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీతో వేలాది మందికి ఉద్యోగాలు లభించాయి. జాతీయ రహదారిని 12 వరుసలకు విస్తరిస్తే మరిన్ని భారీ పరిశ్రమలు వచ్చేందుకు వీలు కలుగుతుంది. వినుకొండ, హిందూపురం, రాప్తాడు పరిధిలో ఏపీఐఐసీకు చెందిన వేలాది ఎకరాలు ఉన్నాయి. 2019కు ముందే పలు సెజ్‌ల కోసం భూసేకణ పూర్తిచేసి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తీర్చిదిద్దారు. జాతీయ రహదారితో సెజ్‌లను అనుసంధానం చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సహికులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిలమత్తూరు పరిధిలోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములు 8 వేల ఎకరాలకు పైగా ఖాళీగా ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని