logo

AP PRC: ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం: మంత్రి బొత్స

పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలతో

Updated : 05 Feb 2022 13:50 IST

అమరావతి: పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు వెళ్లనున్న నేపథ్యంలో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంత్రులు సమాలోచనలు చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య నిన్న అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు చర్చలు జరిగాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. భేటీకి ముందు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.

‘‘నిన్న అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం. ఈ మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో సమావేశమవుతాం. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల గురించి ఈ రోజు చర్చిస్తాం. ఐఆర్‌ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చాం. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్లు భారం ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలే. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తాం’’ అని బొత్స అన్నారు.

ఫిట్‌మెంట్‌ 23 శాతంలో మార్పు ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆర్థికశాఖ అధికారులతో భేటీకి వెళ్లే ముందు సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల డిమాండ్ల వల్ల ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై చర్చించాలన్నారు. ఫిట్‌మెంట్‌ 23శాతంలో మార్పు ఉండదని సజ్జల వివరించారు. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌(సీసీఏ) రద్దు చేయొద్దని ఉద్యోగులు అడిగారన్నారు. హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. కనీస హెచ్‌ఆర్‌ఏ 12శాతం ఉండాలని ఉద్యోగులు అడిగారని సజ్జల తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల సవరణలతో రూ.7వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని