logo

Chittoor: సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్‌ చేయమన్నారు

దారి సమస్య పరిష్కరించాలని ఓ మహిళ పురపాలక కమిషనర్‌కు విన్నవిస్తే రాత్రి 9.00 గంటల తర్వాత ఫోన్‌ చేయాలని చెప్పిన సంఘటన కుప్పంలో చోటుచేసుకుంది.

Published : 07 Jul 2024 06:28 IST

కుప్పం కమిషనర్‌పై ఓ మహిళ ఆరోపణ.. నిరసన
మూడు నెలల క్రితం జరిగిన ఘటన వెలుగులోకి

ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: దారి సమస్య పరిష్కరించాలని ఓ మహిళ పురపాలక కమిషనర్‌కు విన్నవిస్తే రాత్రి 9.00 గంటల తర్వాత ఫోన్‌ చేయాలని చెప్పిన సంఘటన కుప్పంలో చోటుచేసుకుంది. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తే అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని ఎన్నికలకు ముందునాటి సీఐ భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట ప్లకార్డులతో శనివారం వినాయకపురానికి చెందిన హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కథనం మేరకు.. కుప్పం పట్టణం కొత్తపేటలోని ఇంటి వద్ద కొన్నేళ్లుగా దారి సమస్య ఉంది. రోడ్డు వసతి కల్పించాలని పురపాలిక కమిషనర్‌కు వినతి చేశారు. దీంతో కమిషనర్‌ రాత్రి 9.00 గంటలకు ఫోన్‌ చేయాలని, ఎంత మంది పిల్లలని, నీకు వయసు 40 ఉంటుందా..? బెంగళూరులో జయనగర్‌ తెలుసా అంటూ.. వ్యక్తిగత వివరాలు తీసుకుంటూ కమిషనర్‌ అసభ్య సంభాషణకు తెర తీసిన ఆడియోను ఆమె విడుదల చేశారు. దీనిపై ఎన్నికలకు ముందు అప్పటి అర్బన్‌ సీఐకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని బెదిరించారు. సమస్య కోసం వస్తే.. రాత్రి 9.00 గంటల దాటాక ఫోన్‌ చేయమనడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలా మరో మహిళ ఇబ్బంది పడకూడదనే నిరసన తెలపాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మహిళకు నచ్చజెప్పి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని అర్బన్‌ సీఐ జీటీ నాయుడు హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు.

విచారణ చేపట్టండి: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌

సమస్య పరిష్కారానికి వచ్చిన మహిళతో కుప్పం పురపాలిక కమిషనర్‌ అసభ్య సంభాషణ, ఆమె ఆరోపణలపై తక్షణమే విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కలెక్టర్‌ను కోరారు. మహిళలను వేధించే వారు ఏ స్థాయి వారైనా కఠినంగా వ్యవహరించాలని కోరినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

నాకు కూతురు లాంటిది: కమిషనర్‌

మూడు నెలల క్రితం ఎన్నికల సమయంలో రోజూ కార్యాలయానికి వచ్చి సమస్య పరిష్కరించాలని మహిళ ఫిర్యాదు చేసేది. సమస్య పరిష్కరించకుంటే కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతానని బెదిరించేదని పురపాలిక కమిషనర్‌ నాగేశ్వరరావు తెలిపారు. తరచూ ఫోన్‌ చేస్తుండటంతో ఉదయం ఎన్నికల హడావుడిలో ఉంటామని.. ఏ సమయంలోనైనా ఫోన్‌ చేయొచ్చని చెప్పానే తప్ప, మరొకటి లేదని, తనకు కూతురు లాంటిదని ఆయన చెప్పారు. స్థానిక పురపాలిక కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆమె ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని