logo

Kuppam: కుప్పంలో వైకాపాకు వంతపాడిన..సీఐలు, ఎస్సైలపై వేటు

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాకు వంతపాడిన ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలను ఒకేసారి వీఆర్‌కు పంపిస్తూ అనంతపురం డీఐజీ షేముషి బాజ్‌పేయ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 24 Jun 2024 07:59 IST

వీఆర్‌కు పంపిన అనంతపురం డీఐజీ
సీఎం పర్యటనకు ఒక్కరోజు ముందు చర్యలు

రమణ , ఈశ్వరరెడ్డి

ఈనాడు, చిత్తూరు- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాకు వంతపాడిన ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలను ఒకేసారి వీఆర్‌కు పంపిస్తూ అనంతపురం డీఐజీ షేముషి బాజ్‌పేయ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌కు వెళ్లిన వారిలో కుప్పం అర్బన్‌ సీఐ ఎన్‌వీ రమణ, రూరల్‌ సీఐ పి.ఈశ్వరరెడ్డి, రామకుప్పం ఎస్సై కేబీ శివకుమార్, రాళ్లబూదుగూరు ఎస్సై వి.సుమన్, కుప్పం అర్బన్‌ ఎస్సై బీవీ సుబ్బారెడ్డి, గుడుపల్లె ఎస్సై లక్ష్మీకాంత్‌ ఉన్నారు. ఇదే సమయంలో గుడుపల్లె ఏఎస్సై మోహన్, రామకుప్పం హెడ్‌కానిస్టేబుల్‌ మురళిపైనా జిల్లా ఎస్పీ వేటువేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోహన్‌ కుప్పం సర్కిల్‌ పరిధిలోనే విధులు నిర్వహించారు. గుడుపల్లె మండలం చీకటిపల్లికి చెందిన వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ అనుచరుడు రామ్మూర్తికి గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగితే స్థానికులపైనే కేసు నమోదుచేసి వివాదాస్పదమయ్యారు. సీఐలు, ఎస్సైలు సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల్లోనూ వైకాపా నాయకులపై విపరీతమైన స్వామిభక్తిని ప్రదర్శించారు. తెదేపా శ్రేణులను అడుగడుగునా ఇబ్బంది పెట్టి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని అనేక ప్రయత్నాలు చేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక వైకాపా అభ్యర్థి భరత్‌ ఆదేశాలను మాత్రమే పాటించి ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు వచ్చినా ఏమాత్రం తగ్గలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఆరుగురు అధికారులు మూల్యం చెల్లించుకున్నారు. సీఎం కుప్పం పర్యటనకు ఒక్కరోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కుప్పం అర్బన్‌ సీఐగా ఉన్న రమణ.. తెదేపా శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలిపినా ఓర్చుకోలేకపోయారు. వైకాపా విషయంలో మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారు. గ్రామీణ సర్కిల్‌ సీఐ ఈశ్వరరెడ్డి వైకాపా నాయకుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. ఎన్నికల్లోనూ ఆ పార్టీకి శాయశక్తులా సహకరించారు. రాళ్లబూదుగూరు ఎస్సై సుమన్‌ ఆది నుంచి వైకాపాకు అనుకూలంగా ఉన్నారు. గ్రామాల్లో క్రియాశీలకంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కుప్పం అర్బన్‌ ఎస్సైగా ఉన్న సుబ్బారెడ్డీ ఇదేతీరుగా వ్యవహరించారు.

సుబ్బారెడ్డి , సుమన్‌

పెద్దిరెడ్డికి వీరభక్తుడు లక్ష్మీకాంత్‌

లక్ష్మీకాంత్‌

గుడుపల్లె ఎస్సైగా ఉన్న లక్ష్మీకాంత్‌ గతంలో సోమల ఎస్సైగా వ్యవహరించారు. పెద్దిరెడ్డి వీరభక్తుడిగా ఉన్నారు. సోమల మండలం ఆవులపల్లె జలాశయ నిర్మాణం వ్యతిరేకించిన రైతులపైనా జులుం ప్రదర్శించారు. గుడుపల్లెలోనూ ఆయన తన వైఖరి మార్చుకోలేదు.

దళితులు, గిరిజనులపై ఉక్కుపాదం  

శివకుమార్‌

రామకుప్పం ఎస్సై శివకుమార్‌ తెదేపా శ్రేణులంటే ఒంటి కాలిపై లేచేవారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగారు. తెలుగుదేశం కార్యకర్తలతోపాటు దళితులు, గిరిజనులపై ఉక్కుపాదం మోపారు. సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుని తరచూ చేయి చేసుకుని వార్తల్లో నిలిచారు. గట్టిగా ప్రశ్నిస్తే నాటు తుపాకులు ఉన్నాయని, సారా తయారు చేస్తూ పట్టుబడ్డారని కేసులు నమోదు చేయడం ఆయనకే చెల్లింది. చంద్రబాబు నామినేషన్‌ కార్యక్రమానికి ఆయన తరఫున భువనేశ్వరి హాజరైతే ఆమె పర్యటనకు వెళ్లారని కావలిమడుగుకు చెందిన నలుగురిపై విరుచుకుపడ్డారు. ఆయన అరాచకాలపై తెలుగుదేశం నాయకులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగితే జులుం ప్రదర్శించారు. గతంలో కుప్పంలో పనిచేసినప్పుడూ ఇదేవిధంగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని