logo

Resco: రెస్కో.. అవినీతి చూస్కో

త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్‌గా మారింది.

Updated : 15 Jun 2024 10:07 IST

నగదిస్తే ఉద్యోగాలు.. అంటకాగితే పదోన్నతులు 
ఐదేళ్లుగా రెన్యూవల్‌కు నోచని అనుమతి 

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్‌గా మారింది. రెస్కో ఎంచక్కా అవినీతి చేస్కో అనేలా ఐదేళ్ల పాలన సాగిందని అందులోని ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. కీలక నేతలతో అంటకాగితే అర్హత లేకపోయినా అక్కడి జూనియర్‌ అధికారులను అందలమెక్కించారు. నగదిస్తే ఉద్యోగాలు కల్పించారు. ముడుపులు తీసుకుని డబుల్‌ ప్రమోషన్లు ఇచ్చేశారు. ఇలా ఒకటేమి అన్నింటా అక్రమాలే. అసలు ఐదేళ్ల పాటు సంస్థ అనుమతి సైతం రెన్యూవల్‌ కాలేదని తెలిసి స్థానికులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. 

అధికారులకు డబుల్‌ ధమాకా..

రెస్కోలో ఏడీఈగా పని చేస్తున్న ఓ అధికారికి డబుల్‌ ప్రమోషన్‌ కల్పించి ఏకంగా ఎండీగా చేశారు. సీనియర్‌ అధికారిని పక్కన పెట్టి ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది. పదవీ విరమణ పొందిన ఎండీ, మాజీ మంత్రి పెద్దిరెడి అనుచరులు దీనికి ప్రధాన కారమని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జేఏఓగా ఉన్న అధికారి కాంగ్రెస్‌ హయాంలో ఉద్యోగంలో చేరగా, బిల్లుల చెల్లింపులో చేతివాటం చూపాడంటూ తెదేపా ప్రభుత్వ హయాంలో అతన్ని పక్కన పెట్టారు. వైకాపా అధికారం చేపట్టిన వెంటనే అతన్ని విధుల్లోకి తీసుకుని.. కొన్నాళ్లకే డబుల్‌ ప్రమోషన్‌ కల్పించారు. ఇలా తమకు అనుకూలమైన చాలా మంది ఉదోన్నతులు కల్పించి అర్హులకు విస్మరించారనే విమర్శలున్నాయి. ఎస్‌ఆర్‌ (సర్వీస్‌ రిజిష్టరు)లో గతంలో నమోదు చేయాల్సి వివరాలు.. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటూ జేఏఓకు ప్రస్తుత ఎండీ ప్రభాకర్‌ మెమో జారీ చేయడం జరిగింది. 

ఉద్యోగాల కల్పనలో సైతం విమర్శలు..

ఐదేళ్ల వైకాపా పాలనలో అనేక మందికి ఉద్యోగాలు కల్పించారు. ఎలాంటి ప్రకటనలు ఉండవు. పెద్దాయన ఆదేశాలే పరమావధిగా వారి చెప్పిన వారిని చేర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. దాదాపు 30 మందికి పైగా ఇలా చేరినట్లు దీనికి భారీగా నగదు చేతులు మారినట్లు ప్రచారం సాగింది. రెస్కో లైసెన్సు ఐదేళ్లకు పైబడి రెన్యూవల్‌కు నోచుకోలేదు. అయినా పాలకవర్గం మాత్రం అలానే కొనసాగింది. రెస్కో లైసెన్సు రెన్యూవల్‌ కాకపోవడంతో ట్రాన్స్‌కోలో విలీనమవుతున్నట్లు అప్పట్లో అధికారులు రికార్డులు సైతం తీసుకెళ్లారు. ఆతర్వాతే ఈ ఉద్యోగ నియామకాలు జరిగాయి. 

అవినీతి జరిగిందంటే అక్రమ కేసులు..

రెస్కోలో రూ.200 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ తెదేపా నాయకుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సార్వత్రిక ఎన్నికల ముందు పత్రికా సమావేశంలో ఆరోపించారు. రెండు రోజుల తరువాత తనపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ దాడి చేసి, చంపేస్తానంటూ బెదిరించాడని ఓ వైకాపా కార్యకర్త నాటకీయంగా ఆస్పత్రిలో చేరడం, ఎమ్మెల్సీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఆరోపిస్తే అక్రమ కేసులు సైతం బనాయించారు.

నియామకాలపై విచారణ 

కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో)లో అక్రమంగా ఉద్యోగ నియామకాలపై అసిస్టెంట్‌ డీసీవో ఆనంద్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామకాలపై శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామానికి చెందిన నగేష్‌ జిల్లా సహకార శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు అసిస్టెంట్‌ డీసీవో ఆనంద్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ విషయమై గతంలో ఎండీగా పనిచేసిన సుబ్రహ్మణ్యంతో పాటు నగేష్‌కు నోటీసులు జారీ చేశారు. గురువారం ఆయన రెస్కో కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు.  నోటీసులు అందుకున్న సుబ్రహ్మణ్యం స్పందించలేదని విచారణ అధికారి తెలిపారు. 

ఛైర్మన్, సభ్యుల రాజీనామా

రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ కుమార్, ఏడుగురు పాలకవర్గ సభ్యులు రాజీనామా సమర్పించినట్లు ఎండీ ప్రభాకర్‌ శుక్రవారం తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో 13 మందితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయగా, మరో నెలరోజుల పాటు పాలకవర్గానికి పదవీకాలం ఉండగా.. రాష్ట్రంలో వైకాపా ఓటమి చెందడంతో పదవికి రాజీనామా చేసినట్లు అందులో పేర్కొన్నారు.

పారదర్శకంగా జరిగేదెలా? 

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: రెస్కోలో కారుణ్య నియామకాలు, మరో 19 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయమై అందిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్న అసిస్టెంట్‌ డీసీవో ఆనంద్‌  వైకాపా   అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. రెస్కోలో అడ్డదారిన ఉద్యోగాల కల్పనలోనూ ఈయన రెస్కో ఛైర్మన్, ఎండీకి సహకరించిన ఆయన్నే విచారణకు నియమించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. విచారణ పారదర్శకంగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు