logo

విచారణ తొక్కిపెట్టేసి..

జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది..

Published : 20 May 2024 02:25 IST

జడ్పీ పూర్వ అధికారి నిర్వాకం
లోకాయుక్త ఆగ్రహంతో పునఃప్రారంభం
న్యూస్‌టుడే, చిత్తూరు జడ్పీ,(మిట్టూరు)

జడ్పీ కార్యాలయం

జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. పైగా తన(పూర్వ అధికారి)పైనే విచారణ చేపడతారా? అంటూ ఏకంగా విచారణాధికారిపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో సదరు జిల్లా అధికారి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.. తనకున్న ‘పెద్ద’ పలుకుబడితో కేడర్‌ను సైతం మరిచిపోయి జిల్లా అధికారులపై ఆయన పెత్తనం చేసిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.. అసలు ఈ వ్యవహారం తనకు అండగా ఉన్నారని చెప్పుకొంటున్న అధికార పార్టీ కీలక మంత్రివర్యులకు తెలియకపోవచ్చని.. ఆయన పేరు చెప్పి అందరిపై ఓరకంగా జులుం చేస్తున్నారనే చర్చ జిల్లా అధికార వర్గాల్లో నడుస్తోంది.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా బీఆర్‌జీఎఫ్‌ నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ 2014వరకు కొనసాగింది. ఆపై ఈ నిధులను ప్రభుత్వం నిలిపేసింది. జిల్లా పరిషత్తుకు సంబంధించి 2014కు ముందు బీఆర్‌జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో కోట్లాది రూపాయలు వచ్చాయి. వీటిని బ్యాంకులో డిపాజిట్‌ చేయడంతో దానిపై వచ్చిన వడ్డీని వినియోగించే విషయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా సదరు నిధులు తనకు అనుకూలంగా ఉన్న బ్యాంకులో జమ చేయించడం సహా వచ్చిన వడ్డీ దుర్వినియోగం చేశారంటూ అప్పటి ప్లానింగ్‌-2 సూపరింటెండెంట్‌పై జడ్పీ పూర్వ ఉద్యోగులే లోకాయుక్తకు కొన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. వడ్డీ కింద వచ్చిన కోట్లాది రూపాయలను తన అనుకూలురకు ఇవ్వడం సహా సొంతానికి వాడుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై గతేడాది లోకాయుక్త విచారణకు ఆదేశించింది. జిల్లా ఆడిట్‌ అధికారిని విచారణాధికారిగా నియమించడంతో ఆయన రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న పూర్వ అధికారి(ప్రస్తుతం మైనార్టీ కార్పొరేషన్‌లో ఉన్నారు) ఏకంగా విచారణ జరగకుండా తనకున్న పలుకుబడితో అడ్డుకున్నారు. ‘నాపైనే విచారణ చేస్తారా.. వెళ్లి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడు.. ఆయన అన్నీ చెబుతారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణాధికారి బిత్తరపోయినట్లు తెలిసింది. చిన్న కేడర్‌(ఎంపీడీవో)లో ఉన్న అధికారి.. విచారణాధికారినైన తనను ఇలా మాట్లాడటం, దీనికితోడు జిల్లా యంత్రాంగంలో పలువురు పూర్వ అధికారికే వత్తాసు పలకడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో విచారణ నిలిచిపోయింది. ‘పెద్ద’మంత్రి పేరు చెప్పి విచారణ సైతం నిలిపివేయించుకుని పూర్వ అధికారి.. దర్జాగా బయట తిరుగుతుండటంతో కొందరు జిల్లా అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండునెలల నుంచి లోకాయుక్త దీనిపై వెంటనే నివేదించాలని జిల్లా అధికారులను మరోసారి ఆదేశించడంతో చేసేదేమీలేక విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

మరోవైపున పోలింగ్‌ ముగిసిన మరుసటిరోజు విచారణాధికారి తన బృందంతో.. జడ్పీ కార్యాలయానికి వెళ్లి తమకందిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా అవసరమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నాటి దస్త్రాలు కావడంతో రెండుమూడ్రోజులు పట్టింది. ఇప్పటికే తీసుకున్న వాటిని ఒక విడత పరిశీలించిన విచారణాధికారులు కొందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేసేందుకు సన్నద్ధమయ్యారు. నేటినుంచి విచారణ పూర్తిస్థాయిలో మొదలు కానుండటంతో జడ్పీ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. అప్పట్లో పూర్వ అధికారికి ఈ విషయంలో సహకరించిన వారందరినీ విచారించనున్నారు. ఆయన మాట విన్నందుకు తమపై ఏం చర్యలు ఉంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని