logo

దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?

ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూపరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి.

Updated : 20 May 2024 04:50 IST

మరోసారి అక్రమంగా పరీక్షల నిర్వహణకు కుట్ర
ఎస్వీయూలో విశ్రాంత అధికారుల తప్పటడుగులు
తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే

ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. ఆదాయపరంగా దూరవిద్యా కేంద్రం నుంచి రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఎదిగింది. ఎస్వీయూ అత్యాశ, దూరవిద్యా కేంద్రాన్ని ఉద్దరించేందుకు వచ్చిన కొందరు విశ్రాంత అధ్యాపకులు వర్సిటీ పరువును బజారుకీడ్చేలా గత నాలుగేళ్లుగా వ్యవహరించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనలను బేఖాతరు చేయడంతో దూరవిద్య కేంద్రం ప్రవేశాలపై నిషేధం విధించారు.

పరీక్షల నిర్వహణకు ఒత్తిడి

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు దూరవిద్యా కేంద్రం అధికారులు ఎస్వీయూపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే లోపు ప్రస్తుతం రెండో సంవత్సరం పరీక్షల కోసం ఎదురుచూస్తున్న 12 వేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఫీజులు చెల్లించాలని, జూన్‌ రెండో వారంలో యూజీసీ నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని 26 స్టడీసెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పరీక్షల్లో చూచిరాతలకు అనుకూలంగా ఉండే సిబ్బంది, ఇన్విజిలేటర్ల జాబితాను సిద్ధం చేసి అనుమతి కోసం పరీక్షల విభాగానికి పంపినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే?

1972లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరస్పాండెన్స్‌ పేరుతో ఎస్వీయూలో దూరవిద్యా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1995లో యూజీసీ నిబంధనలు అనుసరించి డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(డీడీఈ)గా అభివృద్ధి చేశారు. డీడీఈ కేంద్రం ద్వారా 20 పీజీ కోర్సులు, ఐదు డిగ్రీ, రెండు డిప్లోమా కోర్సులను అందిస్తున్నారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో(డెబ్‌) నిబంధనలు అనుసరించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకే పరిమితం కావడంతో 2016 నుంచి చిత్తూరు జిల్లాలోని 15 స్టడీసెంటర్లు, క్యాంపస్‌లోని నోడల్‌ కేంద్రం నుంచి మాత్రమే ప్రవేశాలు కల్పించేవారు. తెలుగు రాష్ట్రాల్లో 56 స్టడీసెంటర్లు మూతబడ్డాయి. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎస్వీయూతో పాటు కేవలం చిత్తూరు జిల్లాలోని స్టడీసెంటర్లలో మాత్రమే నిర్వహించారు.

ప్రవేశాలకు అవకాశం కల్పించిన సమయంలో..

ఎస్వీయూ దూరవిద్యా విభాగంలో రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన ప్రవేశాలను పునరుద్ధరించుకునేందుకు యూజీసీ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. నూతనంగా యూజీసీ డెబ్‌ అనుమతించే కోర్సులను ఎస్వీయూ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాదేశిక ప్రాంతంగా నిర్ణయిస్తూ ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గతంలో చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా యూజీసీ డెబ్‌ నిబంధనలకు అనుగుణంగా కోర్సులకు అనుమతి పొందాల్సిన సమయంలో ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రహస్యంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా మరోసారి ప్రవేశాలపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వైకాపా అధికారంలోకి వచ్చాక

2019లో ప్రభుత్వం మారగానే ఎస్వీయూ దూరవిద్యా కేంద్రంపైన కన్నేసిన కొందరు విశ్రాంత అధికారులు ఉచితంగా సేవలందిస్తామంటూ సలహాదారులుగా ప్రవేశించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్టడీసెంటర్ల ద్వారా ప్రవేశాలు కల్పించడమే కాకుండా అక్కడే పరీక్షలు నిర్వహించేలా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ప్రవేశాలు, పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం, ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ఫిర్యాదులు అందడంతో క్షుణ్నంగా పరిశీలించిన యూజీసీ- డెబ్‌ రెండున్నరేళ్ల క్రితం ఎస్వీయూ దూరవిద్యా కేంద్రం ద్వారా ప్రవేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని