logo

శేషాచలానికి.. పెద్దపులి రానంటోందా?

భీతిగొలిపే ఆకారం.. పదునైన పంజాతో ఎంతపెద్ద జంతువునైనా క్షణాల్లో మట్టికరిపించే వన్యమృగం పెద్దపులి.. వందేళ్ల కిందట శేషాచలం అడవులను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పెద్దపులి మళ్లీ తన స్థావరంలోకి రానని మొండికేస్తోందా?

Updated : 28 May 2024 06:32 IST

ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్న అటవీశాఖ
ప్రకటించి ఏడాదవుతున్నా పురోగతి శూన్యం

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే : భీతిగొలిపే ఆకారం.. పదునైన పంజాతో ఎంతపెద్ద జంతువునైనా క్షణాల్లో మట్టికరిపించే వన్యమృగం పెద్దపులి.. వందేళ్ల కిందట శేషాచలం అడవులను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పెద్దపులి మళ్లీ తన స్థావరంలోకి రానని మొండికేస్తోందా? నల్లమల అడవుల నుంచి శేషాచలం వైపునకు తిరిగి చూడనంటోందా? మూడేళ్ల కిందట చామల అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్లిపోయిందా.. అంటే అటవీశాఖ తాజాగా జంతుగణన గణాంకాలు అవుననే చెబుతున్నాయి. శేషాచలం అడవులు తన స్థావరానికి అనువుగా లేవని తిరిగి వెళ్లిపోయిందా? లేక అటవీశాఖ అధికారులు నల్లమల నుంచి శేషాచలంలోకి రప్పించేందుకు ప్రత్యేక కారిడార్‌ పనులు అవసరమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అడుగులు పడని ప్రత్యేక కారిడార్‌

దేశంలోనే పెద్ద పులులకు ప్రధాన ఆవాస కేంద్రంగా నల్లమల అడవులున్నాయి. నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌టీఆర్‌) పరిధిలోని రక్షిత అడవిలో గడిచిన నాలుగేళ్లలో పెద్దపులులు తమ సంతతిని గణనీయంగా పెంచుకున్నాయని, వాటిని శేషాచలం అడవుల్లోకి రప్పించేందుకు ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని గతేడాది జూన్‌లో పులుల దినోత్సవం రోజున రాష్ట్ర అటవీ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు అటవీశాఖ అధికారులు ఘనంగా ప్రకటించారు. అయితే సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ఇప్పటివరకు ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడలేదు.

మరింత వెసులుబాటు

పెద్దపులి సంచారాన్ని అధునాతన కెమెరాలు, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించి నిర్ధారించినట్లు అధికారులు ప్రకటించారు. 60 శాతం వృద్ధిరేటుగల పెద్దపులి సంతతిని ఒకే ప్రాంతంలోనే ఉంచడంతో వాటి సంతానోత్పత్తి విషయంలో జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, అందుకే వాటి పరిధిని పెంపొందించి నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వైపు మళ్లించగలిగితే వాటి సంతతి ఆరోగ్యంగా ఉండడంతోపాటు మనుగడకు భరోసా కల్పించవచ్చని చెప్పుకొచ్చారు. అలానే వాటి సంతతి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ కారణంగానే నల్లమల అడవుల నుంచి బద్వేలు మీదుగా శేషాచలం అడవుల వరకు ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేస్తామని, తద్వారా శేషాచలం అడవుల్లోకి పెద్దపులుల సంచారాన్ని పూర్తిస్థాయిలో ఉండేలా చూస్తామని ప్రకటించారు. అయితే అది కార్యరూపం దాల్చినట్లు కనిపించలేదు.

కెన్నెత్‌ ఆండర్సన్‌ రచనలు ఆధారం

బ్రిటిష్‌ పాలనా సమయంలో పెద్దపులులు పెద్ద సంఖ్యలో సంచరించేవి. బ్రిటిష్‌ సంతతికి చెందిన రచయిత కెన్నెత్‌ అండర్సన్‌ స్వతహాగా వేటగాడు కావడంతో 1920లో సాగించిన దక్షిణభారతదేశ యాత్రలో శేషాచలం అడవుల గురించి, అందులోని వన్యప్రాణుల గురించి ‘మ్యాన్‌ ఈటర్స్‌ అండ్‌ జింగిల్‌ కిల్లర్స్‌’ పుస్తకంలో ప్రస్తావించారు. అప్పట్లో రేణిగుంట మండలంలోని మామండూరు పరిధిలో పెద్దపులి మనుషులను వేటాడి తినేదనే తన రచనలో పొందుపరిచారు. తాను స్వయంగా వేటాడిన పెద్దపులితో ఫొటో తీయించుకుని తన రచననల్లో ప్రచురించారు. తదనంతర కాలంలో శేషాచలం నుంచి పెద్దపులి ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

గణనీయంగా పెరుగుతున్న సంతతి

2018 గణాంకాల ప్రకారం నల్లమల అడవుల్లో 47, 2022లో నిర్వహించిన గణనలో వాటి సంఖ్య 75 చేరుకున్నట్టు అటవీ అధికారులు వెల్లడించారు. 3,727.82 చదరపు కి.మీ. విస్తరించి దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్‌)లోనే ఇప్పుడు పెద్దపులులు నివాసం ఉంటున్నాయి. నల్లమలను దాటుకుని శేషాచలం అడవుల్లోకి వచ్చిపోతున్నట్లు 2019లో నిర్వహించిన సర్వేలో తేలిందని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని