logo

చెయ్యని దాడికి... చెరశాలలో ఆ నలుగురు

మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి అమాయకుల ఆక్రందనలు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన ఎవరికీ పట్టడం లేదని.. కొందరు పోలీసు అధికారుల ఉద్దేశపూర్వక తప్పిదాలపై నెలరోజులుగా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 12 Jun 2024 05:36 IST

అక్రమ కేసులు పట్టించుకోని సిట్‌  
సీఐలపై చర్యల దిశగా అడుగులు శూన్యం
న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం)

మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి అమాయకుల ఆక్రందనలు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన ఎవరికీ పట్టడం లేదని.. కొందరు పోలీసు అధికారుల ఉద్దేశపూర్వక తప్పిదాలపై నెలరోజులుగా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నానిపై దాడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. డీజీపీని తక్షణ నివేదిక కోరిన క్రమంలో స్థానిక పోలీసు అధికారులు హడావుడి అరెస్టులు చేశారన్న ఆరోపణలున్నాయి.

ఆరోజు ఏం జరిగిందంటే..

దాడికి పాల్పడే సమయంలో పులివర్తి నాని గన్‌మెన్‌ ధరణి జరిపిన కాల్పుల్లో గాయపడ్డ రామాపురం సుధాకర్‌రెడ్డి స్థానంలో.. తిరుమలలో చిన్నపాటి గొడవకు సంబంధించిన కేసులో నిందితుడైన ఎ.సుధాకర్‌రెడ్డితోపాటు మరికొందరిని అక్కడి సీఐ సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. ఎస్వీయూ సీఐ మురళీమోహన్‌కు అప్పగించాక నానిపై హత్యాయత్నం కేసులో వారిని అరెస్టు చూపారు. ఘటన సమయంలో వారు తిరుమలలోనే ఉన్నట్లు వారి బంధువులు మొరపెట్టుకున్నా ఎవరూ ఆలకించలేదు.

మెప్పు కోసం.. 37 మందిపై కేసులు

నానిపై హత్యాయత్నం జరిగిన 14 రోజుల తర్వాత ఓ వైకాపా కార్యకర్త ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే 37 మంది తిరుపతి, చంద్రగిరికి చెందిన ప్రముఖ తెదేపా నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో ఎలాంటి వీడియో ఆధారాలుగానీ.. మారణాయుధాలుగానీ స్వాధీనం చేసుకోకపోయినా కేసులు పెట్టారు. ఇదంతా ఎవరో మెప్పు కోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

మీడియాతో మాట్లాడుతున్న బాధిత కుటుంబ సభ్యులు (పాతచిత్రం)

వైర్‌లెస్‌ సెట్లో ఎస్పీ ఆదేశాల మేరకేనా?

పులివర్తి నానిపై దాడి ఘటనకు సంబంధించి వీడియో ఆధారాలతో 13 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించిన తొమ్మిది మందిని మాత్రమే అరెస్టు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేసేశామని డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం ముందు సమాధానం చెప్పేందుకే హడావుడి అరెస్టులు చేశారనే ప్రచారం ఉంది. అప్పటి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ వైర్లెస్‌ సెట్‌లో స్వయంగా ఆదేశించడంతోనే అదేరోజు తిరుమలలో డబ్బుల కోసం గొడవపడిన కేసులో అదుపులోకి తీసుకున్న తిరుమల బాలాజీనగర్‌కు చెందిన ఎ.సుధాకర్‌రెడ్డి, పి.హరికృష్ణ, పసుపులేటి రాము, గోగుల కోటయ్యలను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

సిట్‌ నివేదికలో ప్రస్తావన ఏదీ?

దాడి ఘటనతో తమ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని సిట్‌ ముందు బాధితులు పేర్కొన్నా.. ఆ దిశగా విచారణ జరగలేదు. సిట్‌ బృందం ఘటనా స్థలాలను పరిశీలించి.. కేసులో పొందుపరిచిన సెక్షన్లను సరిచూసి.. ఇరువర్గాల వాదనలను విని ఆమేరకు నివేదిక సమర్పించింది. దాడి ఘటనలో ఇంకెందరు నిందితులు ఉన్నారనే విషయాలుగానీ.. ఆ నలుగురి ఆవేదననుగానీ పరిశీలించలేదు. దాడి ఘటన వీడియోల్లో ఆ నలుగురు లేకుంటే ఛార్జ్‌షీట్‌ వేసేటప్పుడు తొలగిస్తామని పోలీసులు చెబుతున్నారు తప్పితే జరిగిన తప్పిదాలకు బాధ్యలెవరన్న కోణం పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. చెయ్యని తప్పునకు జైల్లో మగ్గడమే కాకుండా న్యాయం కోసం ఎదురు చూడాలా? అని మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పోలీసు అధికారులేమో న్యాయస్థానానికి వెళ్లకుంటే ఛార్జిషీట్‌ సమయంలో ఏదోలా సాయం చేయగలమని, వెళ్తే తామేమీ చేయలేమని చెబుతున్నట్లు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని