logo

నరకడమే తప్ప.. నాటింది లేదు

వాస్తవానికి జరిగింది వేరు. ఉన్న మొక్కలు ఆలనాపాలనా కరవై కనుమరుగయ్యాయి. పైపెచ్చు నగరాల్లో తెదేపా హయాంలో నాటిన మొక్కలను సీˆఎం హోదాలో ఆయన పర్యటించిన ప్రతిసారీ అడ్డదిడ్డంగా నరికేసి, నామరూపాలు లేకుండా చేసేశారు. తిరుపతిలో డబుల్‌ డెక్కర్‌ బస్సు రాకపోకల కోసమంటూ వేల చెట్ల కొమ్మలు నరికివేసి పచ్చదనం ఆనవాళ్లు లేకుండా చేశారు.

Updated : 12 Jun 2024 05:38 IST

ఐదేళ్లుగా అటకెక్కిన వన మహోత్సవాలు
నిధులు కరవైన సామాజిక అటవీ విభాగాలు

‘రాష్ట్రంలో పచ్చదనం వెల్లివిరియాలి.. అడవులు, జనబాహుళ్యాలు కళకళలాడాలి.. ప్రతి జిల్లాలో అందరూ చేతులు కలిపి లక్షల మొక్కలు నాటడమే కాదు, వృక్షాలుగా ఎదిగేలా చేసుకుందాం.. చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా సాగించాలి.. జగనన్న పచ్చతోరణం పథకంతో రాష్ట్రాన్ని హరితమయం చేద్దాం..

ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల కిందట అన్న మాటలు.

వాస్తవానికి జరిగింది వేరు. ఉన్న మొక్కలు ఆలనాపాలనా కరవై కనుమరుగయ్యాయి. పైపెచ్చు నగరాల్లో తెదేపా హయాంలో నాటిన మొక్కలను సీఎం హోదాలో ఆయన పర్యటించిన ప్రతిసారీ అడ్డదిడ్డంగా నరికేసి, నామరూపాలు లేకుండా చేసేశారు. తిరుపతిలో డబుల్‌ డెక్కర్‌ బస్సు రాకపోకల కోసమంటూ వేల చెట్ల కొమ్మలు నరికివేసి పచ్చదనం ఆనవాళ్లు లేకుండా చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏటా జరగాల్సిన వన మహోత్సవాలు అటకెక్కాయి.

జీవకోన (తిరుపతి), న్యూస్‌టుడే: భూభాగంలో అడవులు 33 శాతం ఉండాలి. మన రాష్ట్రంలో 23 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో అటవీ సంరక్షణతోపాటు కొత్తగా సామాజిక, నగర వనాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం అటవీశాఖ, పట్టణాభివృద్ధి, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుపతి వంటి నగరాల్లో తితిదే అదనపు తోడ్పాటునందిస్తోంది. నర్సరీలను ఏర్పాటుచేసి అటవీశాఖ అండతో పార్కులు, వనాలను తీర్చిదిద్ది పర్యవేక్షించేది. గ్రామీణ, పట్టణ, నగరాల పరిధిలో మొక్కలు నాటే బాధ్యతలను సామాజిక అటవీ(వన) విభాగాలు నిర్వర్తించేవి.

తిరుపతిలో అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీ

ఐదు కోట్ల మొక్కలన్నారు..

2019లో వైకాపా అధికారంలోకి వచ్చినా కరోనా నేపథ్యంలో సంవత్సరంపాటు ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. 2021 ఆగస్టులో అప్పటి సీఎం చేతుల మీదుగా జగనన్న పచ్చతోరణం-వనమహోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి జిల్లాలో లక్ష మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖను ఆదేశించడం మినహా అడుగులు పడలేదు. సామాజిక అటవీ విభాగాలకు ఆర్థికంగా జవసత్వాలు లేకుండా చేశారు. కనీసం నర్సరీల నిర్వహణకు నిధులు కేటాయించకుండా పక్కన పెట్టారు. ఆ కారణంగా వనమహోత్సవాల మాట అటుంచితే, నర్సరీల్లో మొక్కల పెంపకం కూడా అటకెక్కింది. దీంతో అటవీశాఖ మొక్కబడిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఎనిమిదింటికి రెండే

జిల్లాలో సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో ఎనిమిది నర్సరీలు ఉండేవి. తిరుపతిలో 4, నాయుడుపేటలో 4 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టేవారు. నిధుల లేమి కారణంగా నాయుడుపేటలోని నాలుగింటిలో మూడు మూతపడగా, తిరుపతిలో తొండవాడ, తిమ్మినాయుడుపాలెం, కల్యాణీడ్యాం పరిధిలోని నర్సరీలు పూర్తిగా మూతపడిపోయాయి. నగరంలో ఒకటి మాత్రమే నిర్వహణలో ఉండగా అందులోనూ పెద్దగా మొక్కలు పెంచడం లేదు.

తిరుపతిలో ఏర్పాటు చేసిన సామాజిక వన విభాగం

మొక్కుబడిగా మారిన బయోట్రిమ్‌

గడిచిన ఐదేళ్లలో సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగా నర్సరీలు ఏర్పాటు కాకున్నా, ఉన్న నర్సరీలే నిధుల లేమితో మూతపడే దుస్థితి వచ్చింది. 2022 ఏప్రిల్‌లో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పడినా సామాజిక అటవీ విభాగాన్ని ఏడాదిపాటు ఏర్పాటు చేయలేదు. 2023 చివరలో తిరుపతి కేంద్రంగా బయోట్రిమ్‌ ప్రాంగణంలో సామాజిక అటవీశాఖ విభాగాన్ని ఏర్పాటు చేసినా అది నామమాత్రంగా మారింది. కనీసం అధికారులు పనిచేయడానికి సరైన భవనం, వసతులు లేవు. నిధుల లేమితో ఆ శాఖ అధికారుల చేతిలో పనే లేకుండా పోయింది.


పెద్దగా కార్యకలాపాలు లేవు..

తిరుపతి జిల్లా కేంద్రంగా సామాజిక అటవీ విభాగం ఏడాది కిందట ఏర్పడింది. జిల్లా పరిధిలో ఎనిమిది నర్సరీలున్నా వాటిలో చాలావరకు మూతపడ్డాయి. నిధుల సమస్య నెలకొని మొక్కల పెంపకం, వనమహోత్సవాల నిర్వహణపై ప్రభావం పడింది. కొత్త ప్రభుత్వంలో నిధులు వచ్చేలా చూసి నర్సరీలను బలోపేతం చేసి, వనమహోత్సవాలు నిర్వహిస్తాం.

ధర్మరాజులు, డీఎఫ్‌వో, సామాజిక అటవీ విభాగం, తిరుపతి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని