logo

రామాపురానికి రెక్కలు..!

కుప్పం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపడుతుండటం.. పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. నియోజకవర్గంలో విమానాశ్రయం స్థాపన కచ్చితంగా సాకారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 12 Jun 2024 05:35 IST

కుప్పంలో ‘కార్గో విమానాశ్రయం’ సాకారంపై ఆశలు
సాగు, తాగునీటి కష్టాలకు హంద్రీ-నీవాతో చెక్‌
పెండింగ్‌ పనులు పరుగులు పెడతాయని ప్రజల ఆకాంక్షలు
న్యూస్‌టుడే, కుప్పం

కుప్పం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపడుతుండటం.. పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. నియోజకవర్గంలో విమానాశ్రయం స్థాపన కచ్చితంగా సాకారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న తరహా విమానాశ్రయం ఏర్పాటు ద్వారా వ్యవసాయ, వాణిజ్య రంగాల అభివృద్ధి ఊపందుకోవడం తథ్యం.

‘హంద్రీ- నీవా’తో రైతులకు భరోసా

తెదేపా పాలనలో ప్రారంభించిన హంద్రీ- నీవా కాల్వలో చంద్రబాబు చొరవ తీసుకొని కృష్ణా జలాలు కుప్పానికి తీసుకురావడంపై స్థానిక రైతులు కొండంత ఆశ పెట్టుకున్నారు. తెదేపా పాలనలో 87 శాతం కాలువ తవ్వకాన్ని చేపట్టగా..పెండింగ్‌ పనుల్ని పూర్తి చేశామని ఢంకా భజాయించిన వైకాపా ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను మోసగించిన నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం హయాంలో కుప్పం సస్యశ్యామలమవుతుందని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. వర్షాధార, బోరుబావులపై ఆధారపడ్డ రైతులకు శాశ్వత సాగునీటి వసతి సాకారం అవుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు చెరువుల అనుసంధానం చేయడంతో భూగర్భ జలాలు పెంపొంది.. ఆ ప్రాంతంలోని రైతులకు సాగునీరుతో పాటు, తాగునీటి కష్టాలు ఇక ఉండవు.  

2019లో చంద్రబాబు శంకుస్థాపన

ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న కుప్పంలో ఉద్యాన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ వసతి కల్పించాలని తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. శాంతిపురం- రామకుప్పం మండలాల సరిహద్దులోని రామాపురం వద్ద ‘కార్గో విమానాశ్రయం’ స్థాపనకు కార్యాచరణ రూపొందించారు. రెండు మండలాల్లోని కిలాకిపోడు, కడిసినకుప్పం, మణీంద్రం సమీపంలో దాదాపు 434 ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం సేకరించింది. భూ నిర్వాసితులకు పరిహారాన్ని కూడా అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 జనవరిలో కార్గో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా విస్మరించింది.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు సాకారం దిశగా

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు కూడా చంద్రబాబు హయాంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి తదనుగుణంగా భూసేకరణ చేపట్టారు. కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్లు, శీతల గిడ్డంగుల నిర్మాణంతో అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోని ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్న లక్ష్యంతో ఐదేళ్ల కిందట చంద్రబాబు ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విమానాశ్రయం స్థాపనకు శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన అనంతరం.. ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు ఆగిపోయాయి. తెదేపా అధికారంలోకి రావడంతో ఎయిర్‌పోర్టు కలలకు రెక్కలు తొడగడం ఖాయమని అన్నదాతలు అంటున్నారు.

తెదేపా అధికారాన్ని చేపట్టడంతో ఆశల చిగురింత

తాజా ఎన్నికల్లో గొప్ప విజయాన్ని అందుకున్న తెదేపా అధికారాన్ని చేపట్టడం.. చంద్రబాబు నాలుగోదఫా సీఎం పదవిని అలంకరించడంతో.. ఆయన హామీ మేరకు కార్గో విమానాశ్రయంపై ఆశలు చిగురిస్తున్నాయని స్థానిక రైతులు అంటున్నారు. దీనికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి యువ ఎంపీ రామ్మోహన్‌ పదవీ బాధ్యతలు చేపట్టడం కలిసోచ్చే అంశం. కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలతో పాటు పశ్చిమ ప్రాంతంలో పండించే కూరగాయలు, పూలు, పండ్లు తదితర పచ్చి సరుకు మార్కెటింగ్‌ కోసం మంచి అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను రైతులే కార్గో విమానాల్లో దేశ, విదేశాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లి గిట్టుబాటు ధరలకు విక్రయించుకునే సౌకర్యం ఒణగూరనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.       

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని