logo

రాతమారని.. ప్రభుత్వ బడులు

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల తీరు దారుణంగా ఉంది. ఈ ఏడాది సైతం అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నాడు-నేడు పేరిట ఐదేళ్లు గారిడీ చేయగా చాలా బడులకు తాగునీరు అందుబాటులో లేని దుస్థితి.

Updated : 13 Jun 2024 04:37 IST

ఏళ్లుగా అవే సమస్యలు 
నేటి నుంచి నూతన  విద్యా 
సంవత్సరం ప్రారంభం
గూడూరు, తిరపతి (బైరాగిపెట్టడ), న్యూస్‌టుడే

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల తీరు దారుణంగా ఉంది. ఈ ఏడాది సైతం అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నాడు-నేడు పేరిట ఐదేళ్లు గారిడీ చేయగా చాలా బడులకు తాగునీరు అందుబాటులో లేని దుస్థితి. మరుగుదొడ్లు లేక బాలికలు అవస్థలు పడుతున్నారు. గదుల కొరత, ఉపాధ్యాయ ఖాళీలు, అందుబాటలోని పుస్తకాలు వెరసి సమస్యల నడుమే ఈ ఏడాది బడులు పున:ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం మారడంతో కాస్తయినా వసతులు మెరుగుపడుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. నాడు-నేడు పనులతో చాలా బడులు మొండి గోడలతో దర్శనమిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.

ఉమ్మడి జిల్లాలో 5,020 పాఠశాలల్లో 3.36 లక్షల మంది చదువుతున్నారు. విద్యాకానుక అదనపు లబ్ధి కోసం ఈ సంఖ్య పెంచి చూపినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థులుండగా మౌలిక వసతులు మెరుగుపర్చడంలో ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరించింది. తొలిదశ నాడు-నేడు ప్రాథమిక బడుల్లో ప్రారంభించి చివరిదశలో వీటిని ఎంపిక చేసింది. తిరుపతి జిల్లాలో రూ.780 కోట్లకు సంబంధించి పనులు చేపట్టినా ఆయా బడుల్లో గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మెరుగుపడలేదు. చాలాచోట్ల భవనాలు బూతు బంగ్లాలుగా మారాయి.  

అవసరం లేనిచోట్ల ఉపాధ్యాయులు.. 

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న బడుల్లో ఉపాధ్యాయులను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓజిలి మండలం ముమ్మాయపాళెం ఎస్టీ కాలనీలో విద్యార్థులు 26 మంది, ఇద్దరు ఉపాధ్యాయులు అవసరం కాగా తిరుమలపూడి ఉపాధ్యాయురాలిని సమీప బడికి కాకుండా ఓజిలికి వేయించినట్లు ఆరోపణలున్నాయి. ఇలా చాలాచోట్ల విద్యార్థులకు తగ్గ ఉపాధ్యాయులు లేనట్లు వెల్లడవుతోంది.

ఉన్నత పాఠశాలల్లో ఇలా..

విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండే బడుల్లో వసతులు సమకూరడం లేదు. పెళ్లకూరు మండలంలోని ఆరు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 1,100 మంది విద్యార్థులున్నారు. నెలబల్లి ఉన్నత పాఠశాలలో కొత్త గదులు అందుబాటులోకి రాలేదు. మరుగుదొడ్లదీ ఇదే పరిస్థితి. కిచెన్‌ షెడ్ల నిర్మాణం పూర్తిచేయలేదు. చెంబేడు, రోసనూరు, శిరసనంబేడు, పాలచ్చూరు, తాళ్వాయిపాడు బడుల్లో సగం పనులు కూడా పూర్తి చేయలేదు. రూ.2 కోట్లు వెచ్చించినట్లు చెబుతున్నా వసతులు మృగ్యం.  

స్టూడెంట్‌ కిట్ల పంపిణీకి సన్నద్ధం

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న స్టూడెంట్‌ కిట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థులకు సరిపడా విద్యాసామగ్రి సరఫరాలో జాప్యం నెలకొంది. మొత్తం సామగ్రి చేరుకున్నాక అందజేయనున్నారు. రాతపుస్తకాలు, బూట్లు, బెల్ట్‌లు ఉన్నాయి.  కొన్ని పాఠశాలలకు మధ్యాహ్నభోజనంలో భాగమైన కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేశారు. 


ఆట స్థలాల్లేవు.. ప్రహరీల జాడేది.. 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 11 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 1500 మంది వరకు చదువుతున్నారు. ఇక్కడ బడుల్లో మౌలిక వసతుల సమస్య వేధిస్తోంది. ఆటస్థలాలు బాగు చేయలేదు. బాలికల మరుగుదొడ్లకు నీటి వసతిలేక విద్యార్థులు అవస్థలు వర్ణణాతీతంగా ఉంది. పుత్తూరు మండలంలో 11 పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ బడుల్లో విద్యార్థులు సంఖ్య బాగున్నా వసతుల పట్టింపు లేకుండా ఉంది. ప్రభుత్వం కోట్లు వెచ్చించినా తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో లేని పరిస్థితి. 


జీవో 117 ఉత్తర్వు రద్దుపై ఆశలు

2022 నుంచి ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియలో భాగంగా ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బడిమానేసిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం, ఉన్న వాటిని హేతుబద్ధీకరణలో భాగంగా తొలగించడం, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తొలగించడం వంటి చర్యలతో పెద్దఎత్తున నష్టం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల అజెండాలో భాగంగా 117 జీవోను రద్దుచేసి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని