logo

జన్మభూమి కోసం

ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా జన్మభూమిపై మమకారాన్ని చాటారు.. ఒక్క ఓటే కదాని ఊరుకోక, తమకెందు కులే అని బాధ్యతారాహిత్యంగా ఉండలేక వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్ల బాట పట్టారు.

Published : 13 Jun 2024 02:12 IST

తరలిన ప్రవాసులు
కూటమి విజయంలో కీలకం
న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ), పెనుమూరు, పుత్తూరు, ఐరాల

ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా జన్మభూమిపై మమకారాన్ని చాటారు.. ఒక్క ఓటే కదాని ఊరుకోక, తమకెందు కులే అని బాధ్యతారాహిత్యంగా ఉండలేక వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్ల బాట పట్టారు.. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు స్వదేశంపై మమకారంతో ప్రజాస్వామ్య పరిరక్షణలో తామెప్పుడూ భాగస్వాములైౖ ఉంటామని మరోమారు నిరూపించుకున్నారు.. ఉద్యోగ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు మేము సైతం అని సెలవు పెట్టి సొంతూళ్ల బాట పట్టారు. ఇలా 

ముందుగానే రాక..

చిత్తూరు నియోజకవర్గంలో 300 మందికి పైగా ప్రవాస భారతీయులు, బెంగళూరు, చెన్నై సహా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది గత నెల 13న సొంత గ్రామాలు, పట్టణాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడిన సునీల్‌ పాంట్ర ఎన్‌.ఆర్‌.ఐ టి.డి.పి విభాగంలో సభ్యుడిగా ఉంటూ, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే స్వదేశానికి వచ్చారు. డల్లాస్‌ నుంచి హేమంత్‌ కూకట్ల ఎన్నికల కోసం చిత్తూరుకు వచ్చారు. చిత్తూరు నగరానికి చెందిన రవితేజ ముత్తు యు.ఎస్‌.ఎ లోని ఫిలిడెల్ఫియాలో ఉంటున్నారు. సాధారణ ఎన్నికల కోసం స్వదేశానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. శేషాపురానికి చెందిన చరణ్‌ గుడివాడ ఓటేసేందుకు స్వగ్రామానికి వచ్చారు.

సెటిలర్లలో చైతన్యం..

గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన సెటిలర్లు, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు ఎవరికి వారు కదలివచ్చారు. విదేశాల్లో స్థిరపడిన వారు కేవలం ఎన్నికల కోసం రూ.లక్షలు వెచ్చించి స్వగ్రామాలకు వచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడంతో ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై కసి రగిలింది. కొందరైతే ఎన్నికలకు వారం ముందుగానే వారి గ్రామాలకు చేరుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం గతం కంటే పెరిగింది. ఇది తెదేపా విజయానికి ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు. 

ఓటింగ్‌లో ఎన్‌ఆర్‌ఐలు..

నగరి నియోజకవర్గానికి సమీపానే చెన్నై మహా నగరం ఉంది. పారిశ్రామికంగా వృద్ధి లేకపోవడంతో ఇక్కడి యువత అధికంగా చెన్నై తదితర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన యువత చెన్నైతో పాటు, బెంగుళూరు, హైదరాబాద్‌ తదితర మహా నగరాలతో పాటు ఉన్నత చదువుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌ వెళ్లి ఎంఎస్‌ పూర్తిచేసి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వడమాలపేట మండలం కల్లూరు, పుత్తూరు మండలం రామసముద్రం, పుత్తూరు మున్సిపాలిటీలోని దుబాయ్‌లో స్థిరపడిన పలువురు యువకులు పోలింగ్‌ రోజున ఓటు వేయడానికి రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వస్థలాలకు తరలివచ్చారు. వీరంతా తెదేపా వీర విధేయులే. ఈ ప్రాంతం వారు నాలుగు వేల మందికి పైగా వేర్వేరుచోట్ల స్థిరపడ్డారు. వారంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓట్లు వేయడం విశేషం.


ఖండాంతరాలు దాటి.. 

పూతలపట్టు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కొందరు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. అలాంటి వారు సైతం లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి తన ఇష్టమైన నాయకుడికి ఓట్లు వేశారు. మరోపక్క నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారులు, స్థిరాస్థి వ్యాపారులు సింహభాగం ఉన్నారు. ప్రధానంగా బెంగూళూరులో వేలాది మంది తెలుగు ప్రజలు జీవిస్తున్నారు. వీరందరూ అక్కడి నుంచి రెండ్రోజుల ముందే స్వగ్రామాలకు చేరుకున్నారు. పోలింగ్‌ వేళ క్యూలైన్లలో గంటల కొద్ది వేచి ఉండి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో 87.66 శాతం ఓట్లు నమోదయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని