logo

అధికారుల్లో చలనం కరవు

వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాలువల్లో ఉన్నాయని ‘ఈ నెల 1న ప్రజలకు ఏమైంతే మనకేంటి’’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.

Published : 13 Jun 2024 02:24 IST

అతిసారంతో జిల్లాలో నలుగురు మృత్యువాత

వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాలువల్లో ఉన్నాయని ‘ఈ నెల 1న ప్రజలకు ఏమైంతే మనకేంటి’’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. అయితే జిల్లాలోని అధికారుల్లో చలనం మాత్రం లేదు. జిల్లా వ్యాప్తంగా ఏదో ఓ ప్రాంతంలో అతిసారం, వాంతులు చేసుకోవడం ఆస్పత్రిలో చేరి చికిత్స  పొందుతున్నారు. గత నెలన్నరలో జిల్లాలో అతిసారంతో నలుగురు మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. 

పుత్తూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ, గ్రామాల్లోను చాపకింద నీరులా అతిసారం వ్యాప్తి చెందుతోంది. నెలన్నర క్రితం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో మునెమ్మ అతిసారంతో మృత్యువాత పడింది. పుత్తూరు మున్సిపాలిటీలోని నందిమంగళంలో 15 రోజులుగా అతిసారతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ ఇద్దరు మృత్యువాత పడ్డారు. నందిమంగళం గ్రామంలో జాతర సందర్భంగా కలుషిత ఆహారం వల్ల గ్రామానికి చెందిన 15 మంది ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందారని, అంతా సర్దుబాటు అయిందని మొదట్లో గ్రామస్థులు పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల అనంతరం నందిమంగళం దళితవాడలో అతిసారం ముసురుకుంది. దీంతో అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, తాగునీటి పైపులైన్లు మార్చడం, తాగునీటి సరఫరా చేపట్టి అదుపులోకి తెచ్చారు. పలమనేరు మండలం టి.ఒడ్డూరులో కలుషిత ఆహారం వల్ల 34 మంది ఆస్పత్రి పాలయ్యారు. బైరెడ్డిపల్లి మండలం కొత్తయిండ్లు గ్రామంలో మరో ఆరుగురు అతిసారంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కలుషిత నీటి కారణంగానే అతిసారం సోకిందని అధికారులు గుర్తించి చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. 

ముందుగా చర్యలు తీసుకుని ఉంటే..: ఏటా నైరుతి రుతుపవనాల సమయంలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుంటాయి. తూర్పు మండలాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తుంటాయి. ఈ ఏడాది ముందస్తుగానే వాతావరణ శాఖ నైరుతిలో ఆశించిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు మేల్కొని ఉంటే ఈ ఉపద్రవం జరిగేది కాదని ప్రజలు వాపోతున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు సైతం చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందంలా శిబిరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారు.  అతిసార బాధితులను అటు నగరి ఏరియా ఆస్పత్రికి, ఇటు తిరుపతికి పంపుతుండటం గమనార్హం.  పుత్తూరు నగరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు మున్సిపాలిటీలు, చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ  సమస్యలు గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 

గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నా.. : గత ప్రభుత్వం  గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిందిజ శానిటరీ సెక్రటరీలు పారిశుద్ధ్య పనులతో పాటు ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలి. అయితే ఆ దిశగా మాత్రం చర్యలు శూన్యం. 


నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..

-మూర్తి, ఆర్డీ, మున్సిపల్‌శాఖ, అనంతపురం 

మున్సిపాలిటీల్లో తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాలువల్లో ఉంటే వెంటనే మార్చాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఏ ప్రాంతంలో అయినా కలుషిత తాగునీటి వల్ల ఇబ్బందులు ఉంటే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, మెరుగైన వైద్యం అందించాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని