logo

సిరి సంత.. సేంద్రియం చెంత

మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం

Published : 15 Jun 2024 01:44 IST

65 రకాల చిరుధాన్యాలతో

మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం. రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికలు, ఊదర్లు తదతర చిరుధాన్యాల నుంచి ఆహార పదార్థాలు, వివిధ రకాల పొడులు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాం. రసాయన రహితంగా పండించి వాటి ఉత్పత్తులు విక్రయిస్తుండటంతో మంచి ఆదరణ లభిస్తోంది.
- సునంద, మిత్ర చిరుధాన్యాల విక్రయ కేంద్రం


మంగళగిరి చీరలంటే మహిళలకు ఇష్టం

మంగళగిరి చీరలకు ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో మహిళలు కొనుగోళ్లకు ఏమాత్రం ఆలోచించరు. ఫ్యాషన్‌ వైపు సమాజం నడుస్తున్న తరుణంలో ఇప్పటికీ చేనేత చీరలకు ఏమాత్రం అదరణ తగ్గలేదు. చూడచక్కని రంగులు, ఆకర్షనీయంగా ఉండే అంచులు, సహజత్వంతో కట్టిపడేసేలా ఆకర్షనీయంగా ఉండే చీరలు, ఇతర వస్త్రాలకు గిరాకీ ఉంది. ఇప్పుడిప్పుడే చేనేత వస్త్రాల వైపు మొగ్గు చూపుతుండటంతో వ్యాపారంపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. 
- మధుబాబు, చేనేత ఉత్పత్తుల దుకాణదారు


ఉత్పత్తులకు నగరవాసుల ఆదరణ

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి మహతి ఆడిటోరియం సేంద్రీయ ఉత్పత్తులతో కళకళలాడుతోంది. తిరుపడి సిరి సంత పేరుతో నిర్వహిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులతోపాటు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు జోరందుకున్నాయి. నాబార్డు, కనెక్ట్‌ 2 ఫార్మర్, ఎస్‌ఎఫ్‌ఏసీ(స్మాల్‌ ఫార్మర్‌ అగ్రి కన్సార్టియం), ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఏర్పాటు చేసిన మేళాలో రెండోరోజైన శుక్రవారం ఉద్యాన పంటలు, అంటుకట్టు విధానాలు, ప్రకృతి వ్యవసాయం, పిల్లలకు ఆయుర్వేదం, కంపోస్టింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేళాలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సేంద్రియ రైతుల ఉత్పత్తులు ప్రత్యేకత చాటుతున్నాయి. నేటితో ముగియనున్న మేళా మంచి ఆదరణ చూరగొంది.


అలంకరణ, ఆరోగ్యం కోసం..

నారతో తయారు చేసే బొమ్మలు, మ్యాట్‌లు, ఇతర తాళ్లు మా ప్రత్యేకత. సహజంగా ఇది ప్రకృతి విధానంలో సాగయ్యే నారతో తయారు చేస్తుంటారు. సాధారణ ఆధునిక డోర్‌ మ్యాట్‌ వినియోగించే వారికి, నారతో తయారు చేసే డోర్‌ మ్యాట్‌ ఉపయోగంలో చాలా తేడా ఉంటుంది. చిన్నపిల్లలకు ఇచ్చే ప్లాస్టిక్‌ ఆట బొమ్మలు రసాయనాలతో నిండి ఉండగా.. నారతో తయారు చేసిన ఆటబొమ్మలు సహజసిద్ధంగా ఉంటూ పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి హాని లేకుండా ఉంటాయి. దేవుడి బొమ్మలతో పాటు అనేక నార ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం. నార ఉత్పత్తుల విలువను గుర్తించి ఆదరిస్తున్నారు.    

 - పద్మావతి, సురేష్, రాజమహేంద్రవరం 


అరుదైన ఉత్పత్తులు మా ప్రత్యేకం

లఖడాంగ్‌ పసుపు, అఖండ వెల్లుల్లి, ఎద్దుగానుగ నూనె, శ్వేత సంజీవిని బియ్యం, హిమాలయ మిరప వంటి అనేక ఉత్పత్తులు మా ప్రత్యేకం. దేశవాళీ పప్పులు, ధాన్యాలను విక్రయించడంలో మాకు మంచి అనుభవం ఉంది. సహజ పద్ధతుల్లో పండించిన వంట కోసం వినియోగించే పొడులు, వేరుసెనగ గింజలు, పురాతన ఉల్లి, బియ్యంలో అనేక దేశవాళీ రకాలు విక్రయిస్తున్నాం. ఉత్పత్తుల గురించి తెలుసుకుని వెంటనే కొనుగోలు చేస్తున్నారు. 
-మౌనిక, గూడూరు


ఏనుగుతొండం బెండకాయలు

తమిళనాడు సేలం నుంచి వచ్చిన రైతు మృదంగానందం అంతరించిపోతున్న నాటు విత్తనాలను ప్రదర్శనలో ఉంచారు. ఇక్కడి ఏనుగుతొండం బెండకాయలు ప్రధానకర్షణగా నిలిచాయి. అడుగు నుంచి ఒకటిన్నర అడుగు పొడవు పెరుగుతాయని రైతు తెలిపారు. సాధారణంగా మార్కెట్‌లో చూస్తున్న బెండకాయలకు ఈ నాటు విత్తనం బెండకాయలకు పొడవులో చాలా వ్యత్యాసం ఉండటంతో ప్రజలు, రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. విద్యార్థులు, స్థానికులు నాటు విత్తనాలు, అంతరించిపోతున్న వివిధ రకాల విత్తనాలకు సంబంధించి అడిగి తెలుసుకుంటున్నారు.
-ఈనాడు, తిరుపతి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని