logo

విలీనంతో సరిపెట్టారు

వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు.

Published : 15 Jun 2024 01:52 IST

పురపాలక పెత్తనం.. మండలాల పర్యవేక్షణ
అటు ఇటు వెళ్లలేక ప్రజలు సతమతం 

సూళ్లూరుపేటలో విలీనమైన కసారెడ్డిపాళెంలో రోడ్డు దుస్థితి 
సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు. ఆనాటి నుంచి అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. పురపాలక పెత్తనం వచ్చినప్పటికీ పర్యవేక్షణ మాత్రం ఇంకా మండల పరిషత్తు పరిధిలోనే ఉంటోంది. చివరకు వృద్ధులు పింఛన్లు పొందేందుకు పంచాయతీ పరిధిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో విలీనం పేరుతో ఆ ప్రాంత ప్రజలకు కొత్త కష్టాలు ఏర్పడ్డాయి. దాంతోపాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.   
జిల్లాలోని పురపాలక సంఘాలతోపాటు నగరపాలక సంస్థలోనూ 2020లో సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు అప్పట్లో కోర్టులను ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులతో 2021లో కొన్నిచోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. దాంతో సంబంధిత పురపాలక సంఘాల్లో ఎన్నికలు సైతం నిర్వహించలేదు. అయినప్పటికీ ఆయా గ్రామాలు మాత్రం పురపాలక పరిధిలోనే కొనసాగుతున్నాయి. విలీన గ్రామాల్లో పురపాలక పరిధిలో గ్రీవెన్సులను పరిష్కరిస్తున్నారు. కానీ మరికొన్ని సమస్యలకు మాత్రం సంబంధిత పంచాయతీ పరిధిలోని సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రజలు అక్కడకు ఇక్కడకు తిరగలేక అవస్థలు పడుతున్నారు. అలాగే విలీనమైన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. డ్రెయిన్లు, రోడ్ల వసతి కల్పించలేదు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. 

జీతాలూ మండల పరిషత్‌ నుంచే

పురపాలకల్లో విలీనమైన గ్రామాల్లో ఇంకా మండల పరిషత్తు పర్యవేక్షణ జరుగుతోంది. వాలంటీర్లకు మండల పరిషత్‌లోని సచివాలయాల నుంచే జీతాలు అందిస్తున్నారు. సచివాలయ సిబ్బందికి మండల పరిషత్‌ ఆధ్వర్యానే జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ పెత్తనం పురపాలికుల చేతిలో ఉన్నప్పటికీ పర్యవేక్షణ, జీతభత్యాలు, తదితర అంతా మండల పరిషత్‌ పరిధిలోనే ఉంటున్నాయి. ప్రజలకు సమస్యలుంటే వారు నేరుగా పంచాయతీ పరిధిలోని సచివాలయం వద్దకు వెళ్లాలి వస్తోంది. 

రుజువులు ఇవిగో.. 

  • సూళ్లూరుపేట పురపాలక సంఘంలో డేగలపాళెం, కసారెడ్డిపాళెం, ఆర్యభట్టనగర్, విక్రమ్‌సారాభాయ్‌నగర్, నూకలపాలెం గ్రామాలను విలీనం చేశారు. వీటికి సచివాలయం కేసీఎన్‌గుంట, ఇలుపూరు పంచాయతీల్లో ఉన్నాయి. అక్కడ వారే సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు. మొన్న పింఛన్లు సైతం అక్కడకెళ్లి తీసుకున్నారు. 
  • నాయుడుపేట పురపాలక పరిధిలో జువ్వలపాళెం, విన్నమాల గ్రామాల్లోని సచివాలయాలు మండల పరిషత్‌ పర్యవేక్షణలో ఉన్నాయి. గ్రీవెన్సు మాత్రం పురపాలికులు చూస్తున్నారు. 
  • గూడూరు పరిధిలోని నెల్లటూరు, చెన్నూరు, దివిపాళెం, చిల్లకూరు పార్టు, పోటుపాళెం గ్రామాల్లో సచివాలయ పర్యవేక్షణ మండలంలోనే ఉంది.  
  •  శ్రీకాళహస్తి, వెంకటగిరి పురపాలికల్లోనూ ఇదే పరిస్థితి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని