logo

పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..

స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్‌ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది..

Published : 15 Jun 2024 02:04 IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఐచర్‌ వాహనం 

ముగ్గురు స్నేహితుల దుర్మరణం

ప్రమాదాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ మణికంఠ 

స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్‌ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది.. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

చిత్తూరు(నేరవార్తలు): చిత్తూరు నగరం చెర్లోపల్లి సమీప తేనబండ మలుపు వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. బంగారుపాళ్యం మండలంలోని మహాసముద్రం గ్రామానికి చెందిన ఉమాపతి కుమారుడు మంజునాథ్‌(17), శ్రీనివాసులు కుమారుడు పవన్‌ కల్యాణ్‌(17).. నగరంలోని పీసీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అదే గ్రామానికి చెందిన రామచంద్ర కుమారుడు చరణ్‌(14) నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తమ స్నేహితుడి పుట్టినరోజు కావడంతో ముగ్గురు తమ గ్రామం నుంచి ఒకే ద్విచక్ర వాహనంపై కేకు కోసం చిత్తూరు నగరంలోని సంతపేటకు వచ్చి తిరుగుపయనమయ్యారు. చెర్లోపల్లి సమీప తేనబండ మలుపు వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లారు. తిరుపతి వెళ్తున్న ఐచర్‌ వాహనం వేగంగా ఎదురుగా దూసుకొచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో వారు చెల్లాచెదురుగా పడి దుర్మరణం చెందగా వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్పీ మణికంఠ, చిత్తూరు తాలూకా ఎస్సై ఉమామహేశ్వరరెడ్డి వచ్చి ప్రమాద వివరాలు సేకరించారు. హైవే మీదుగా ట్రాఫిక్‌ సమస్య లేకుండా వాహనాలు దారి మళ్లించారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. 
మిన్నంటిన రోదనలు..  స్నేహితుడి కోసం వెళ్లి ముగ్గురూ.. మృతి చెందడంతో మృతుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో రాత్రి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలపై పడి బోరున విలపించారు. వారి రోదనలు మిన్నంటాయి. సాయంత్రం వరకు ఆనందంగా గడిపిన ముగ్గురు ఒక్కసారిగా తమ కళ్లెదుట విగతజీవులుగా పడిఉండటంతో కుటుంబీకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని