logo

పరిశ్రమించేందుకు మరో అవకాశం

పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్‌ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్‌-1 పనులు గడవు పెంచారు.

Published : 15 Jun 2024 02:10 IST

 

 

వీసీఐసీ పనుల్లో మళ్లీ కదలిక

చిత్తూరు నోడ్‌ రూ.536 కోట్ల ప్రాజెక్టుల్లో పుంజుకోనున్న వేగం

యువతకు మెరుగు కానున్న ఉపాధి అవకాశాలు

నాయుడుపేట పారిశ్రామిక వాడలో ఆగిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ 
చిత్తూరు కలెక్టరేట్, గూడూరు, న్యూస్‌టుడే: పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్‌ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్‌-1 పనులు గడవు పెంచారు. వీటి గడువులు జూన్‌ ఆఖరు కాగా డిసెంబర్‌ వరకు పెంచడానికి ఏడీబీ అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరు నెలలు పెంచడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ పనులను ఏపీఐఐసీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. నాయుడుపేట క్లస్టర్‌లో ఐదేళ్లుగా పనులు ఆగిపోయాయి.

జిల్లాలోని నాయుడుపేట క్లస్టర్, ఏర్పేడు-శ్రీకాళహస్తి నోడ్‌లు వీసీఐసీ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో నాయుడుపేట క్లస్టర్‌లో ఇప్పటికే రూ.140 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో 70 శాతం పూర్తి కాగా ఆగిన పనులు మళ్లీ ప్రారంభించారు. రెండు రోజులుగా లీకేజీలు గుర్తిస్తున్నారు. వీధి దీపాలు, ఇతర వస్తు సామగ్రి దొంగతనాలు గురైనట్లు గుత్త సంస్థ గుర్తించింది. వైకాపా సర్కార్‌ ఆపేయడం.. రోడ్లు ధ్వంసం కాగా మళ్లీ చేపట్టే అవకాశముంది. గతేడాది టెండర్లు పూర్తి చేసిన చిత్తూరు దక్షిణ నోడ్‌ పనులు మరింత వేగంగా చేసే అవకాశముంది.  

రహదారుల అనుసంధానం

నాయుడుపేట క్లస్టర్‌ బాహ్య రహదారి నిర్మాణం 8.70 కి.మీ, ఏర్పేడు-శ్రీకాళహస్తి నోడ్‌లోని రౌతు సూరమాల క్లస్టర్‌ సౌత్‌ బ్లాక్‌కి 9.46 కి.మీ మేర రహదారి ఏర్పాటు కానుంది. దీన్ని జాతీయ రహదారి 71 చెంబేడు క్రాస్‌ నుంచి పల్లమాల వరకు నిర్మిస్తారు. రెండు రహదారులు తెదేపా హయాంలో మంజూరు కాగా వైకాపా ప్రభుత్వ హయాంలో పనులు ఆపేశారు.

ట్రెంచ్‌-2లో శ్రీకాళహస్తి-చిత్తూరు ఇండస్ట్రీయల్‌ నోడ్‌కు వసతులు 

చిత్తూరు దక్షిణ ఇండస్ట్రీయల్‌ క్లస్టర్‌లో 1,121 హెక్టార్లలో ఏర్పాటయ్యే స్టార్టప్‌ ఏరియాలో మౌలిక వసతులు సమకూరనున్నాయి. తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ మండలాల్లోని రౌతుసూరమాల, గౌడమాల, కొత్తపాలెం, ఆలత్తూరు, బీఎస్‌ పురం గ్రామాల్లో ఇప్పటికే సేకరించిన భూముల్లో పనులు ఊపందుకోనున్నాయి. వాటర్‌ ట్రీట్‌మెంట్, వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్లు.. చిత్తూరు దక్షిణ నోడ్‌లో 6.45 ఎంఎల్‌డీ వ్యర్థ నీరు విడుదలయ్యే అవకాశం కాగా వీటిని ట్రీట్‌ చేయడానికి ఇక్కడ ఎస్‌టీపీ, సీఈటీపీలు ఏర్పాటు కానున్నాయి. తాగునీటి అవసరాలకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు, లాజిస్టిక్, వాణిజ్య, గృహ ప్రాంతాలు తీర్చిదిద్దనున్నారు.

నీటి ప్రాజెక్టులకు మోక్షం

దక్షిణ ప్రాంతాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుల పనులకు మళ్లీ మోక్షం రానుంది. ఈ పనులు ఏడీబీ సాయంతో రూ.678 కోట్లతో తెదేపా హయాంలో మొదలు పెట్టారు. కండలేరు నుంచి 227.65 కి.మీ గొట్టపు మార్గం నిర్మించాల్సి ఉంది. ఇందులో 100 కి.మీ. ప్రారంభించారు. ఆరు చోట్ల స్టోరేజ్‌ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. ఇంటేక్‌ వెల్‌ రాపూరు వద్ద నిర్మించాలి. ఈ పనులు చేపట్టిన గుత్త సంస్థలకు బిల్లులు రాని కారణంగా పనులు ఆపేశారు. ఇవన్నీ పూర్తయితే 4.55 టీఎంసీల నీరు తీసుకుని పరిశ్రమలకు వినియోగించే అవకాశముంది.త్తివరం, 

నాయుడుపేట  క్లస్టర్లలో..

ట్రెంచ్‌-1 పనుల్లో భాగంగా ఆగిన వాటిల్లో అత్తివరం ఎలివేటెడ్‌ స్టోరేజ్‌ రిజర్వాయర్లు 500 కేఎల్‌ సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఆగిన 9.20 కి.మీ స్ట్రామ్‌ వాటర్‌ ట్రైన్లు, ఇక్కడే అంతర్గత రహదారులు విస్తరించనున్నారు. నాయుడుపేట క్లస్టర్‌లోని రోడ్లు, డ్రైన్లు, వీధీ దీపాలు, సబ్‌ స్టేషన్లు, ఎస్టీపీలు తదితర పనులు పూర్తి చేయనున్నారు.

విద్యుత్తు నెట్‌వర్క్‌

ఇక్కడ పరిశ్రమ, నివాస సముదాయాల్లో అవసరమైన సబ్‌స్టేషన్‌ నెట్‌వర్క్‌తోపాటు తాగునీరు, ఫైర్‌స్టేషన్, పార్కింగ్‌ వంటి అనేక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. గ్రీన్‌ బెల్ట్‌తోపాటు నివాస సముదాయాల్లో ఏటీఎం, మందుల దుకాణాలు, విశ్రాంతి గదులు, ఫుడ్‌ బేవరేజేస్, దేవాలయాలు తదితర వాటిని సమకూర్చడానికి సుమారు ఇక్కడ 56.25 ఎకరాలు కేటాయించారు. అంతర్గత రహదారులు విస్తరించనున్నారు.


పనులు పూర్తి చేయిస్తాం

చిత్తూరు నోడ్‌ పనుల్లో వేగం పెంచే అవకాశముంది. ఆయా పనుల్లో పురోగతి చూపించి పరిశ్రమలకు భూములు కేటాయించే ఏర్పాట్లు చేపడతాం.    

- చంద్రశేఖర్, జోనల్‌ మేనేజర్, తిరుపతి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని