logo

అన్నదాత దరిచేరని విజ్ఞానం

అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది.

Published : 15 Jun 2024 02:21 IST

కొన్నేళ్లుగా దూరం

దృష్టి పెట్టని అధికారులు

చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందలో పొలంబడి సమావేశం 

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది. ఒకప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారడంతో రైతులు అధిక దిగుబడులు సాధించేవారు.. కొన్నేళ్లుగా ఇది సక్రమంగా అమలు చేయకపోవడంతో కర్షకులకు ఫలాలు చేరలేదు.. వ్యవసాయ శాఖ సైతం తూతూమంత్రంగా నిర్వహిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కానున్న నేపథ్యంలో పొలంబడులు అవసరం ఉన్నందున ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.

శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి..

రైతులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది వ్యవసాయ విజ్ఞానం చేరవేయాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలు, మెలకువలు తెలియజేయాలి. క్షేత్రస్థాయిలో రైతులు అనుసరిస్తున్న సంప్రదాయ శాస్త్రీయ పద్ధతుల మధ్య తేడా చూడాలి. సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారకాలు, పంటలకు ఆశించే కీటకాల నివారణకు అవసరమైన మందుల మోతాదులు వివరించాలి. విత్తనాల ఎంపిక నుంచి పంట చేతికి వచ్చే వరకు దశల వారీగా ఏం చేయాలో రైతులకు తెలియజేయాలి.

నిర్వహించడం ఎలా..?

పొలంబడి నిర్వహణకు 25 ఎకరాల క్షేత్రాన్ని ఎంపిక చేస్తారు. 30 మంది రైతులను సభ్యులుగా గుర్తిస్తారు. ఒక ఎకరాన్ని ప్రధాన క్షేత్రంగా గుర్తిస్తారు. అర ఎకరా చొప్పున మరో రెండు క్షేత్రాలను ప్లాట్లుగా విభజిస్తారు. వీటిని శాస్త్రీయ, ప్రయోగాత్మక క్షేత్రాలుగా మార్పుచేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మూడు ప్లాట్లలో పంటలు పండించి వాటిలో తేడాలు రైతులు గుర్తించేలా ప్రణాళిక అమలు చేస్తారు.


ఆదేశాలొస్తే అమలు చేస్తాం..

ఖరీఫ్‌లో పొలంబడుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిస్తే అమలు చేస్తాం. సదరు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. పొలంబడుల నిర్వహణ రైతులకు ఎంతో ఉపయుక్తం. 
- మురళీకృష్ణ, జేడీఏ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని