logo

భూహక్కు.. సమస్యల చిక్కు

చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్‌పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు.

Updated : 15 Jun 2024 05:53 IST

ఎల్‌పీ రికార్డుల సవరణల పేరిట గుంజుడు 
మ్యుటేషన్లకు భారీ ముడుపులు
బ్యాంకుల్లో రుణాలకు తిరకాసు

నాయుడుపేట మండలం చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్‌పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు. పెళ్లకూరు మండలం తాళ్వాయపాడులో నల్లబోతుల నాగరత్నం చనిపోయి 12 ఏళ్లయినా ఇంకా ఆయన పేరుతో 1.20 ఎకరాల భూమి చూపిస్తున్నారు. 


ఓజిలి మండలం తిరుమలపూడి రెవెన్యూలో 300 మందికి పైగా రైతులుంటే ఒక్కటంటే ఒక్క రికార్డు సక్రమంగా నమోదు కాలేదు. జాయింట్‌ ఎల్‌పీ నంబర్ల కేటాయింపు.. తల్లిదండ్రుల పేరిట భూ రికార్డులు, గతంలో విభజన జరిగినా తిరిగి యథాతథంగా నమోదు చేయడం గ్రహపాటుగా మారింది. దీనికి మండలానికి చెందిన భూసర్వే ఉపతహసీల్దార్‌ పెద్దఎత్తున ముడుపులు వసూలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.


పెళ్లకూరు మండలం తాళ్వాయపాడు రెవెన్యూలో ల్యాండ్‌ పార్సిల్‌ 104లో 2.07 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. ఇందులో రైతులు నెల్లూరుపల్లి సుబ్బరత్నం, పుట్టా రాఘవయ్య, రామ్మూర్తి, చినపోలయ్య, చిన వీరయ్యల పేరుతో పట్టా, అనుభవదారులుగా ఉంచారు. ఇలా అందరికి అనుభవ విస్తీర్ణం 2.07 ఎకరాలు నమోదు చేశారు. సర్వే నంబర్లు, అనుభవ విస్తీర్ణం, ఖాతా నంబర్లు వేర్వేరుగా ఉన్నా కొత్తగా తెచ్చిన ఎల్‌పీ నంబర్లతో రైతులు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


హద్దురాళ్లేసిన తాళ్వాయపాడు చెరువు 

చిత్తూరు (జిల్లా పంచాయతీ), గూడూరు, న్యూస్‌టుడే: భూసర్వే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ముసుగులో రైతుల రికార్డులు తారుమారయ్యాయి. రీసర్వే సమయంలో అధికారులు చేపట్టిన తప్పిదాలు వారి మెడకు ఉరితాళ్లుగా మారాయి. ఉన్న విస్తీర్ణంలో తేడాలు, భూమి స్వభావంలో మార్పులు, చనిపోయిన వారి పేర్లతో రికార్డులు వెరసి రైతులు మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెట్టించే వరకు వ్యవహారం నడిచింది. తప్పుల్లేకుండా రికార్డులు సరిచేయాల్సిన యంత్రాంగం ముప్పుతిప్పలు పెడుతోంది.  రికార్డులు ఒకరివి కాగా భూమిలో మరొకరు ఉన్న పరిస్థితులను చక్కదిద్దలేదు. దీంతో నకిలీ రికార్డులు తీసుకుని రుణాలు పొందే అవకాశం కలిగింది. 

ఉమ్మడి జిల్లాలో సుమారుగా 7.24 లక్షల మంది రైతులకు చెందిన 5.52 లక్షల హెక్టార్లు మేరకు భూములున్నాయి. ఎక్కువ మంది సన్న చిన్న రైతులు కాగా వారి రికార్డులు తప్పుల తడకలుగా మార్చేశారు. ఆ పుస్తకాలు పట్టుకుని రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమాధానం కరవు. అటు బ్యాంకుల దగ్గరకు వెళితే వారి వద్ద ఉన్న రికార్డులకు ప్రస్తుత రికార్డులకు పొంతన లేదు. దీంతో రుణాలు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.

ఊరూవాడా రెవెన్యూ సమస్యలు

భూ సర్వే పూర్తయ్యాక హక్కు పత్రాల్లో తప్పులు దొర్లిన రైతులను రెవెన్యూ అధికారులు ఎల్‌పీ రికార్డుల సవరణకు దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చి తర్వాత ముప్పుతిప్పలు పెడుతున్నారు.  ఇందుకు రూ.వేలకు వేలు గుంజుతున్నారు.

ఒక పార్సిల్‌లో అనేక మంది

ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్ల పేరుతో వచ్చిన భూహక్కు పత్రాలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒకే నంబరులో పలువురు రైతుల వివరాలు పొందుపరుస్తున్నారు. ఒక పార్సిల్‌లో అనేక మంది రైతులకు భూమి ఉన్నట్లు చూపిస్తున్నారు. భూసర్వేలో ఐదంచెల తనిఖీ చేపట్టాలి. ఇవన్నీ పట్టని యంత్రాంగం కొందరి కనుసన్నల్లో రికార్డులు తయారు చేశారు. వారికి చెందని భూమిలో రాళ్లు వేశారు.

పరస్పరం తేల్చుకోవాలంటూ..

యాదమరి మండలం, భూమిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో వైకాపా పాలనలో ఇటీవల భూ రీసర్వే చేశారు. 167/1సి సర్వే నెంబరులో 3.47 ఎకరాల భూమి ఉమ్మడిగా ఉంది. సబ్‌ డివిజన్‌ కాలేదు. గత కొన్నేళ్లుగా ఎవరికి వారు నలుగురు అన్నదమ్ములు భూమి పంచుకుని సాగు చేసుకుంటున్నారు. రీసర్వేలో వెంకటేశులుకు చెందిన భూమి 23 సెంట్లు త్యాగరాజులు భూమిలో ఉన్నట్లు.. సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది చెప్పారు. అయితే ఎవరికి రావాల్సిన భూమిని వారికి కచ్చితంగా సర్వే చేసి ఇవ్వకపోగా, మీరుమీరు తేల్చుకుని వస్తే భూమి వివరాలు ఆన్‌లైన్‌ చేస్తామని లేకుంటే లేదని స్పష్టం చేశారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా, వారి మధ్య విభేదాలు తలెత్తి గొడవలకు దారి తీసింది. సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు