logo

నెరవేరని ప్రభుత్వ ఆశయం

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు.

Published : 16 Jun 2024 02:07 IST

ఒక్క టీఎంసీ కంటే తక్కువే మళ్లింపు
కాలువల సామర్థ్యం మించని వైనం   

పుంగనూరు సమీపంలో హంద్రీ నీవా కాలువ

పుంగనూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. 2019లో హంద్రీనీవా కాలువకు నీటిని మళ్లించడానికి కాలువ విస్తరిస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల హామీ నెరవేరలేదు. 2008లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,80,450 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ కోసం జిల్లాలో రూ.2.906.41 కోట్ల అంచనాలతో ఆకృతి రూపొందించారు. తర్వాత పెరిగిన ధరలతో అంచనాలు రూ.3వేల కోట్లకు చేరాయి. 2018లో నాటి తెదేపా ప్రభుత్వం 700 కిలోమీటర్ల నుంచి జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చింది. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ మినహా మిగిలిన ఉప కాలువలు అపంపూర్తిగానే మిగిలిపోయాయి. ఐతే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు మూడు సార్లు కృష్ణాజలాలు తీసుకొచ్చారు. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 10టీఎంసీల నీటిని కేటాయిస్తే ఇప్పటి వరకు తీసుకొచ్చిన సందర్భాల్లో ఒక టీఎంసీ కంటే తక్కువే. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ కాలువ సామర్థ్యం 386 క్యూసెక్కులు కాగా 300లే మళ్లించారు. ఆ నీరు సైతం వివిధ కారణాలతో పూర్తిస్థాయిలో రాలేదు.

ఈ దఫా అనంతపురం జిల్లా జీడిపల్లె రిజర్వాయర్‌లో 400క్యూసెక్యుల నీటిని నింపి 300 క్యూసెక్కుల నీటిని పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌కు మళ్లించారు. కాలువ నిర్వహణ చేపడుతూ నీటిని తరలించారు. కేబీసీ కాలువ పొడవు 123.6కి.మీ. తెదేపా ప్రభుత్వంలో 121కి.మీ. కాలువ పనులు పూర్తి చేయగా ఈ ప్రభుత్వంలో మిగిలిన పనులు పూర్తి చేశారు. కుప్పంలో 110 చెరువులకు నీటిని మళ్లించి 6,300 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయాలనేది రైతన్నల కోరిక. చెరువులకు మళ్లిస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు, తాగునీరు సమస్యలు తీరుతాయని ఆశించిన రైతన్నల కోరిక నెరవేరలేదు. ఎన్నికల స్టంట్‌గా కుప్పంకు నీటిని మళ్లించడం తప్ప పూర్తి స్థాయిలో రాలేదు. దీంతో కాలువలో ముళ్లపొదలు పెరగడం, కాలువల కట్టలు బలహీనపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఓవర్‌ ఫ్లోతో కూడా పలు చోట్ల వృథా కావడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలకు జీవనాడి అయిన హంద్రీనీవా కాలువకు నిరంతరాయంగా నీటిని మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని