logo

విలువల పుస్తకం.. బతుకు సంతకం

బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు

Published : 16 Jun 2024 02:31 IST

బతుకు బండిని లాగే శ్రామికుడు
అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు
సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు
కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు
జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు

నడిపించెను వేలుపట్టి.. ప్రోత్సహించెను వెన్నుతట్టి..
దుఃఖసాగరాన్ని వడగట్టి... అమృతాన్ని పంచిపెట్టి..
ఆవేదనలను ఎదలో అదిమిపెట్టి..
కన్నీటిని రెప్పల మాటున దాచిపెట్టి..
కొత్త బట్టలు మాకు పెట్టి.. ముతక దుస్తులు నీవు కట్టి..

నాన్నా.. నీకెవ్వరు సాటి..!

తనలోనే అమ్మను దాచుకున్నాడు..
ఆమె కూడా కనిపెట్టలేనంతలా..
కొడుకు చొక్కాలో తనను చూసుకుని..
కళ్లకు కోపాన్ని పులుముకున్నాడు
ఆ పసికళ్లు పసిగట్టలేనంతలా..
తన ఆకలి చంపుకొని.. బిడ్డ తేన్పులతో కడుపు నింపుకొన్నాడు
ఖాళీ కంచం కూడా గుర్తించలేనంతలా..
కుమారుడి చెప్పుల్లో తన పాదాలను చూసుకున్నాడు
కమిలిన పాదాలతో ప్రాయాన్ని దాటేశాడు..
కాలం కూడా గమనించలేనంతలా..
భార్యకు బంగారు నగలు కొనిపెట్టి
బంగారు అంచు పంచెతో సరిపెట్టుకున్నాడు
పెదవంచుకైనా తెలియనంతలా..
రేయింబవళ్లు కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు
సూర్యుడిలా.. చంద్రుడిలా

తమ నడక, నడత.. అన్నీ నీవే నాన్నా అంటూ తండ్రితో ఉన్న అనుబంధాన్ని ‘తండ్రుల దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు.

న్యూస్‌టుడే బృందం


నాన్నే స్ఫూర్తి.. ఆయనే దీప్తి : డాక్టర్‌ విజయశ్రీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే

తండ్రి సుబ్రహ్మణ్మంతో నెలవల విజయశ్రీ

‘నా జీవితంలో విషయం ఏదైనా సరే ముందు ఆయనతో పంచుకునేదాన్ని. ఆయనే నాకు గైడ్, నా హీరో మా నాన్న. ఆయన స్ఫూర్తితోనే డాక్టర్‌ చదువు అయినా.. డాక్టర్‌గా సేవలైనా.. ఇలా వృత్తిలో నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో ఆయన చూపిన బాటలోనే ఎమ్మెల్యేగా ఎంపికై గెలిచా. చదువుకునే సమయం నుంచే ప్రజా సమస్యల గురించి నాన్న దగ్గరే కళ్లారా చూశా. పనిలో ఆయన తపన.. చేసే సేవలు గుర్తించా. ఎంపీగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. ఆయన బాటలోనే నేనూ ముందుకెళ్లి ప్రజల మన్ననలు పొందుతా’       


వ్యవసాయం చేస్తూ చదివించారు

- ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే

మా తండ్రి ఆరణి కృష్ణయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మేం ముగ్గురం అన్నదమ్ములం, ఒక సోదరి. అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులను చేశారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన చిరునవ్వుతోనే అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. అందరూ బాగుండాలని ఆయన కోరుకునేవారు. ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని ఆయన చెప్పేవారు. అదే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాను. ఆయన నేర్పిన క్రమశిక్షణతోనే వ్యాపారం, రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నాను.


సేవాగుణం, శ్రమ జీవనం నేర్చుకున్నా

గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే

మా తండ్రి గురజాల చెన్నకేశవులునాయుడి నుంచి సేవాగుణం, కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నా. నాన్న సూచనల మేరకు వ్యాపార వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నా. మనతో పాటు అందరూ బాగుండాలనే ఆయన ఆశయం మేరకు జీజేఎం చారిటబుల్‌ ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు చేశాం. నాన్న ఆశయం మేరకు ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా.


ఎలా బతకాలో నేర్పారు

డాక్టర్‌ కలికిరి మురళీమోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే

ఎలా బతకాలో సమాజం నుంచి నేర్చుకున్నా.. మూగ ప్రేమ నాన్నది. నాతో చనువుగా మాట్లాడరు. కానీ నన్ను గమనిస్తూ పెంచారు. నా ప్రతి గెలుపులో.. మలుపులో వెన్నంటి ఉన్నారు.  చిన్నతనం నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నో సినిమాలకు కలిసి వెళ్లాం. స్మార్ట్‌గా బట్టలు కుట్టించడం మొదలు మా ఊరి నుంచి పాకాల వరకు తీసుకెళ్లి పెద్ద క్షౌరశాల (సెలూన్‌)లో క్రాఫ్‌ చేయించే దాకా... మారుమూల గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా మా రాజులా.. రారాజులా పెంచాలని అనుక్షణం తపించారు. అది సాధ్యం కాకపోయినా తనను ఆపలేదు. మావాడు ఏదో సాధిస్తాడనే బలమైన నమ్మకం ఆయనది నాన్న పేరు అన్నయ్య.


ఒకే మాట మీద నిలబడ్డారు

- బొజ్జల సుధీర్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నాకు తండ్రి మాత్రమే కాదు ఆయన స్నేహితుడు, గురువు, దైవం. నా తండ్రే నాకు హీరో.  నిరుపేదల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. శ్రీకాళహస్తి పేరు చెబితే గుర్తుకు వచ్చేది గోపాలకృష్ణారెడ్డి. రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన కుటుంబాన్ని దూరం పెట్టినా పేదల కోసం పాటుపడేవారు. ఆయన ఆశీస్సులతోనే నేను విజయం సాధించాను. ఎక్కడ ఉన్నా నమ్మకం, ఓపిక, క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పేవారు. ఆయన బతికినంత కాలం చంద్రబాబుతోనే ఉన్నారు. అదే స్ఫూర్తితో నేను సైతం ఆయన నేర్పిన క్రమశిక్షణకు అనుగుణంగా పార్టీ, ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తాను.


మోసం చేయకూడదని చెప్పారు  

- పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే

ఎదుటి వ్యక్తులను మోసం చేయకూడదని మా తండ్రి నాగరాజనాయుడు నేర్పించారు. కష్టం ఉన్నా సుఖం ఉన్నా నమ్మిన వారితో ఉండాలని ఎల్లప్పుడూ ఆయన చెప్పేవారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తులకు భోజనం పెట్టి పంపించాలని చెబుతుంటారు. బంధువులు, ప్రజలను బాగా చూసుకోవాలి చెప్పేవారు. కుటుంబ సభ్యులు, తోడబుట్టిన వాళ్లను కష్టపడకుండా చూసుకోవాలని, ఎప్పుడు విడవకుండా బాగా చూసుకోవాలని నాతో అనేవారు. ఆయన నాకు చెప్పిన ప్రతి మాటను పాటిస్తూ ముందుకు వెళుతున్నాను. నన్ను నమ్ముకున్న ప్రజలకు సేవ చేసి వారికి ఎటువంటి కష్టం రాకుండా ఉండేలా అండగా నిలుస్తున్నాను.


ఆర్థిక స్తోమత లేకున్నా..

- కోనేటి ఆదిమూలం, సత్యవేడు ఎమ్మెల్యే

నా తండ్రి కోనేటి ఏలుమలై ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగానే ఉన్నా నన్ను కష్టపడి చదివించారు. నేను 8వ తరగతిలో ఉన్న సమయంలో మంచి చదువు రావాలన్న ఉద్దేశంతో ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో ఉంచారు. డిగ్రీ తర్వాత స్టేట్‌బ్యాంకు, ఆర్టీసీ, అటవీశాఖల్లో ఉద్యోగాలు వచ్చినా నేను ప్రజాసేవ చేస్తానంటే ప్రోత్సహించారు. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగేందుకు ఆయన వెన్నంటి అండగా నిలిచారు. నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి ఆయన మరణించడం నన్ను కలచివేసింది. విద్య ద్వారానే దళితులకు గుర్తింపు అని నన్ను చదివించారు. ఆయన స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను. గతంలో మా గ్రామంలో రౌడీయిజం ఉండేది అయితే నా తండ్రి నేర్పిన క్రమశిక్షణతో వారందరినీ మార్చగలిగాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని