logo

వైద్యశాఖలో..సమూల మార్పులు.. సంస్కరణలు

వైద్య ఆరోగ్యశాఖలో సమూల మార్పులు.. సంస్కరణలు తీసుకొస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొదటగా తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Published : 18 Jun 2024 01:13 IST

రుయాలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆకస్మిక తనిఖీ

మందులు ఇచ్చే విభాగం వద్ద రోగుల సహాయకులతో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ 

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్యశాఖలో సమూల మార్పులు.. సంస్కరణలు తీసుకొస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొదటగా తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అత్యవసర విభాగానికి వెళ్లి రోగులతో మాట్లాడారు. వైద్యులు, పీజీలు, టెక్నీషియన్ల వివరాలు ఆరాతీశారు. ఓపీ కేంద్రంలో మందుల కోసం వరుసలో నిలబడిన రోగులతో మాట్లాడారు. అన్ని రకాల మందులు ఉన్నాయా? లేదా? సిబ్బంది ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు. ఓ రోగి గుండె వైద్యసేవలు రోజూ ఉండేలా చూడాలని కోరారు. రేడియాలజీ విభాగాన్ని మెరుగుపరచాలని సూచించారు. చివరగా ఎంఎం వార్డులో రోగులకు అందుతున్న సేవల గురించి ఆరాతీశారు. రోగుల సహాయకులు తాగునీటితోపాటు వాష్‌రూమ్‌లో నీటి సరఫరా మెరుగుపరచాలని కోరారు. ఎంఎస్‌ ఛాంబర్‌లో వైద్యులు, సిబ్బందితో మంత్రి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రాయలసీమకే తలమానికమైన రుయా ప్రభుత్వ ఆస్పత్రి ప్రతిష్టను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాత టెక్నాలజీకి చెందిన ఎక్స్‌రే మిషన్లు, ఆర్టిలరీ గ్యాస్‌ మిషన్లతో సర్జరీలు, వైద్యం కొంత ఆలస్యం అవుతోంది. ప్రస్తుత ఆర్థికస్థితిని బట్టి అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తాం. రోగులు ఎక్కువ సమయం క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటాం. గుండె వైద్య విభాగంతోపాటు అన్ని సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు మెరుగుపరుస్తాం’ అని మంత్రి వెల్లడించారు. 

‘ఐదేళ్లలో వైద్యశాఖలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వైద్యసేవల కోసం విడుదల చేసిన నిధులు దారి మళ్లించారు. ఏరకంగా నిధులు వినియోగించారో పూర్తిగా పరిశీలిస్తాం. 75 శాతం ఆరోగ్యశ్రీ రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రొసీజర్‌ ప్రకారం కాకుండా లబ్ధి పొందేందుకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పూర్తిస్థాయిలో ఆడిట్‌ జరిపి తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. అంబులెన్స్‌ మాఫియా, నిధుల దుర్వినియోగాన్ని కట్టడి చేస్తాం. రాష్ట్రంలో అతిసారం మరణాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. క్యాన్సర్‌ వ్యాధిని ఆరోగ్యశ్రీ ఆదాయ వనరుగా మార్చుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవు’ అని మంత్రి  హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని