logo

కబ్జాకాండ

వైకాపా నేతల కబ్జాకాండ రేణిగుంట మండలంలో ఒక్కోటిగా వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు డీకేటీ భూములను సైతం కబ్జా చేసి.. ప్లాట్లు వేసి రూ.10 కోట్ల వరకు సంపాదించుకున్నారు.

Published : 18 Jun 2024 01:14 IST

డీకేటీ పట్టాలు ఆక్రమించి విక్రయిస్తున్న వైకాపా నేతలు
రేణిగుంట మండలంలో వెలుగులోకి..

రేణిగుంట, న్యూస్‌టుడే: వైకాపా నేతల కబ్జాకాండ రేణిగుంట మండలంలో ఒక్కోటిగా వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు డీకేటీ భూములను సైతం కబ్జా చేసి.. ప్లాట్లు వేసి రూ.10 కోట్ల వరకు సంపాదించుకున్నారు. బాధితులు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తామని భయపెట్టారు. వీరికి అధికారులు సాయం చేయడం విమర్శలకు తావిస్తోంది.
రేణిగుంట మండలం కుర్రకాలువ రెవెన్యూలో భారీగా కబ్జాలు చోటు చేసుకున్నాయి. ఈ గ్రామ లెక్క దాఖలాల్లో సర్వే నంబర్‌ 210లో 1, 2గా విభజించారు. అందులో 210-1ఏలో 2.82 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూమి, 210-1బీలో 1.98 ఎకరాలు మేతబీడు పోరంబోకు, 210-2ఏలో 3 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూమి, 210-2బీలో గోపాల్‌శెట్టికి 1.05 ఎకరాల్లో డీకేటీ పట్టా మంజూరు చేశారు. ఇందులో 210-1ఏలో కొంత భాగం, 210-2ఏ, బీలో ఉన్న మొత్తం 4.05 ఎకరాల భూమిని ఏడు నెలల కిందట వైకాపా నాయకులు కబ్జా చేశారు. ఇందులో ఓ సర్పంచి,  మాజీ సర్పంచి కుటుంబ సభ్యుడు, మరో ఇద్దరు నేతలు ఆ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్రయించారు. 

కబ్జా చేసిన ప్రదేశంలో నిర్మించిన గదులు 

అధికారుల సహకారం

జీపాళెం పంచాయతీ అధికారులు ప్రతి ప్లాట్‌కు ఎన్‌వోసీలు ఇవ్వడంతో విద్యుత్‌ అధికారులు వెంటనే కనెక్షన్లు మంజూరు చేశారు. సుమారు 100 ప్లాట్లు వేసి ఒక్కో దాన్ని రూ.10 లక్షల చొప్పున విక్రయించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ కబ్జాలపై తహసీల్దార్‌ నాగేశ్వరరావును వివరణ కోరగా.. ఈ అంశం తన దృష్టికి రాలేదని, విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని