logo

వైకాపా నేతల కనుసన్నల్లో చౌకబియ్యం టోకరా

స్టాక్‌ పాయింట్లు, ఎండీయూ వాహనాల్లో బియ్యం తగ్గించి సరఫరా చేస్తున్నారు. వీటిని తిరిగి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఓ సైక్లింగ్‌గా సాగుతోంది. ఇందులోనూ వైకాపా నేతలు ముందుండి వ్యవహరించారు.

Updated : 18 Jun 2024 05:19 IST

జిల్లాలో ఏటా 3,404 టన్నులు మాయం

స్టాక్‌ పాయింట్లు, ఎండీయూ వాహనాల్లో బియ్యం తగ్గించి సరఫరా చేస్తున్నారు. వీటిని తిరిగి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఓ సైక్లింగ్‌గా సాగుతోంది. ఇందులోనూ 
వైకాపా నేతలు ముందుండి వ్యవహరించారు. కొందరు ప్రజాప్రతినిధులకు ఇక్కడి నుంచి ముడుపులు వెళుతున్నట్లు సమాచారం. ఎక్కడికక్కడ గోదాములు, దుకాణాలు, లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని తిరిగి విక్రయించే ముఠాలు ఏర్పడి ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేశాయి.

గూడూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఏటా 1,13,471.74 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. సుమారు 22.69 లక్షల బస్తాలు రవాణా చేస్తారు. బస్తా 50 కిలోలు కాగా 2 నుంచి 3 కిలోలు బియ్యం తగ్గుతోంది. ఇలా ఏటా 3,400 టన్నుల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. ఇందులో వైకాపా నాయకులు, కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌లో కాటాపెట్టి దుకాణాదారులకు ఇవ్వాల్సి ఉంది. కాని అలా చేయడంలేదు.

రూ.11.91 కోట్ల మేర సరకు పక్కదారి 

బియ్యం పంపిణీలో పారదర్శకత లోపించింది. స్టాక్‌ పాయింట్‌లో తగ్గిందని డీలర్లు, డీలర్లు తగ్గించారని వాహనదారులు ఇలా కిలోకి 100-150 గ్రామలు బియ్యం తగ్గించి అందిస్త్తున్నారు. ఎండీయూలు వచ్చిన తర్వాత వాహనదారుల్లో మొత్తం వైకాపా సానుభూతిపరులు చేరగా వారి కనుసన్నల్లో లీకేజీలు జరిగాయి. ప్రభుత్వం కిలోకి రూ.35 మేర వెచ్చిస్తోంది. దీంతో సుమారు రూ.11.91 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న మాట. సూళ్లూరుపేట, తడ, పెళ్లకూరు, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున చౌక బియ్యం నిల్వలు చేస్తున్నారు. తడలో పట్టుబడ్డ బియ్యం లారీలు ఎక్కువగా వైకాపాకు చెందిన వారివే కావడం గమనార్హం.

నాణ్యత పరీక్షలు పట్టని యంత్రాంగం 

బియ్యం నాణ్యత పసిగట్టే ప్రక్రియ కేంద్రం తీసుకొచ్చింది. ఇందుకు రాష్ట్రంలో పైలట్‌గా 2022లో చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రం మొత్తంగా అమలు చేయాల్సి ఉన్నా జాడ లేకుండా చేశారు. ఒక్కో లాట్‌లోని బియ్యం తీసుకుని వాటిని నాణ్యత పరిశీలనకు కొన్ని రసాయనాలు కలిపితే వాటి రంగు నిమిషాల్లో మారుతోంది. గ్రీన్, లైట్‌ గ్రీన్‌ అయితే కొత్త సరకుగా ఇతర రంగులు వస్తే పాత స్టాకుగా గుర్తించే వీలుంది. ఇలా పాత స్టాకు తిరస్కరించడం ద్వారా మిల్లుల నుంచే స్టాకు తీసుకునే అవకాశం అడ్డుకట్ట వేయవచ్చు.

  • తిరుపతి పట్టణంలో 98 చౌకదుకాణాల ద్వారా 53 వేల కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. గ్రామీణంలో 23 దుకాణాలు 26 వేలమందికి ఇక్కడే సుమారుగా 80 వేల కుటుంబాలు బియ్యం తీసుకుంటుండగా స్టాకు పాయింట్‌ నుంచే లీకేజీ ఉంటోందని చౌకదుకాణదారులు చెబుతున్న మాట.
  • గూడూరు మండలంలో 6,715 టన్నుల బియ్యం ఏటా సరఫరా అవుతోంది. ఇందులో పెద్దఎత్తున లీకేజీలు సాగుతున్నా పట్టించుకునే ధైర్యం చేయడంలేదు. గూడూరు స్టాకు పాయింట్‌లోనే లీకేజీలు సాగుతున్నట్లు ఆరోపణలున్నా కేసులు కట్టని పరిస్థితి. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు కిలోకి 100-150 గ్రామలు తగ్గించి అందజేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే వారికి మళ్లీ బియ్యం ఇవ్వని పరిస్థితులున్నాయి. పట్టణంలో ఓ దుకాణం ప్రజాప్రతినిధి తనిఖీలో బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
  • బియ్యం లీకేజీలు, నాణ్యతపై సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ‘న్యూస్‌టుడే’ ప్రశ్నించగా తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని