logo

గడువు ముగిసినా ఘోషే

ఐదేళ్ల వైకాపా పాలన ప్రజలకు నరకం చవిచూపింది. మౌలిక సదుపాయాల కల్పనను ఏమాత్రం ప్రాధాన్య అంశంగా తీసుకోలేదు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మరమ్మతులను గాలికి వదిలేశారు. జిల్లాలోని రహదారులకు మహర్దశ పట్టిస్తామని అప్పట్లో గొప్పలు చెప్పినా నిర్మాణాలు మాత్రం ముందుకు సాగలేదు.

Published : 18 Jun 2024 01:24 IST

ఎన్‌డీబీ రహదారి పనుల్లో ఇదీ దుస్థితి 

అసంపూర్తిగా ఉన్న దేవదొడ్డి- లక్కనపల్లి రోడ్డు  

ఈనాడు, చిత్తూరు: ఐదేళ్ల వైకాపా పాలన ప్రజలకు నరకం చవిచూపింది. మౌలిక సదుపాయాల కల్పనను ఏమాత్రం ప్రాధాన్య అంశంగా తీసుకోలేదు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మరమ్మతులను గాలికి వదిలేశారు. జిల్లాలోని రహదారులకు మహర్దశ పట్టిస్తామని అప్పట్లో గొప్పలు చెప్పినా నిర్మాణాలు మాత్రం ముందుకు సాగలేదు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టిన రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనం. ఈ రహదారులకు నిధుల కొరత లేకున్నా పనులు మాత్రం పూర్తి కాలేదు. అప్పటి వైకాపా ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయనందునే ఈ దుస్థితి తలెత్తింది. ఫలితంగా గ్రామీణ ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ మండల అనుసంధానం, గ్రామీణ అనుసంధానం మెరుగుదల ప్రాజెక్టు (ఏపీఎంసీఆర్‌సీఐపీ)కింద జిల్లాలో ఒకే వరుసగా ఉన్న నాలుగు రహదారులను రెండు వరుసలుగా విస్తరించేందుకు 2020లో ఎన్‌డీబీ రుణం మంజూరు చేసింది. ఇందులో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగతా 70 శాతం ఎన్‌డీబీ నుంచి కేటాయిస్తారు. గుత్తేదారులకు బిల్లుల సమస్య ఎదురుకాకుండా ప్రత్యేక ఖాతా నుంచి చెల్లిస్తామని జగన్‌ ప్రభుత్వం అప్పట్లో స్పష్టం చేసింది.

పెద్దిరెడ్డి కుటుంబ సంస్థే గుత్తేదారు  

ఎన్‌డీబీ నిధులతో బైరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి- లక్కనపల్లి వయా తీర్థం మొత్తం రూ.21.45 కోట్లతో 9.05 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించడంతోపాటు రెండు వంతెనలు నిర్మించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పూతలపట్టు- ఐరాల వయా కొండేపల్లి రోడ్డును రూ.7.12 కోట్లతో, పూతలపట్టు- రామాపురం వయా కొండేపల్లి రహదారి రూ.13 కోట్లతో, చౌడేపల్లె- వలసపల్లి రోడ్డు వయా బోయకొండ వరకు రూ.53.10 కోట్లతో అభివృద్ధి చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రతిపాదనలు పంపగా ఉన్నతాధికారులు ఆమోదించారు. ఈ క్రమంలో కొందరు గుత్తేదారులకు అనుకూలంగా టెండర్ల నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2020 సెప్టెంబరులో రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలవగా వైకాపాకు పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సంస్థకే కాంట్రాక్టు వచ్చింది. 2021 మార్చిలో 24 నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన 2023 మార్చి నాటికి రహదారులు అందుబాటులోకి రావాల్సి ఉన్నా పనులు మాత్రం జరగలేదు.  

లక్కనపల్లి- రామాపురం క్రాస్‌ పూర్తవ్వక..  

జగన్‌ ప్రభుత్వం తన వాటా కింద 30 శాతం నిధులు సక్రమంగా ఇవ్వకపోవడమే రహదారుల దుస్థితికి కారణం. జిల్లాలోని నాలుగు రోడ్లలో చౌడేపల్లె- వలసపల్లి, పూతలపట్టు- రామాపురం రోడ్లు పూర్తయ్యాయి. పూతలపట్టు- ఐరాల వయా కొండేపల్లి రహదారి అందుబాటులోకి వచ్చినా మధ్యలో విద్యుత్తు స్తంభాలున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైరెడ్డిపల్లె మండలంలోని దేవదొడ్డి- లక్కనపల్లి వయా తీర్థం రహదారిలో కొంతవరకే పనులు జరిగాయి. దేవదొడ్డి- దాసార్లపల్లి వరకు మాత్రమే పూర్తయింది. లక్కనపల్లి- రామాపురం క్రాస్‌ వరకు పనులే మొదలుపెట్టలేదు. ఇది పూర్తయితే 25 గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పుతాయి. కర్ణాటక సరిహద్దుకూ త్వరగా చేరుకోవచ్చు. దాదాపు ఏడాది క్రితమే గడువు ముగియగా పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా మిగిలిన నిర్మాణాలు చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని