logo

మనోడేనా.. అయితే ఓకే..!

జిల్లాలో నాటి మంత్రి పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డి సాగించిన దందాలు అన్నీఇన్నీకావు.. అత్యంత ప్రాధాన్యం కలిగిన పోస్టును ఓ చిరుద్యోగికి కట్టబెట్టించి ఆపై ఏళ్ల తరబడి ఆయన అక్కడ తన పెత్తనం కొనసాగించారు..

Updated : 18 Jun 2024 05:10 IST

పెద్దిరెడ్డి పేరు చెప్పి పోస్టింగ్‌
పంచాయతీ కార్యదర్శికి జిల్లా బాధ్యత
డీపీఆర్సీపై పూర్వ సీఈవో పెత్తనం

జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం

జిల్లాలో నాటి మంత్రి పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డి సాగించిన దందాలు అన్నీఇన్నీకావు.. అత్యంత ప్రాధాన్యం కలిగిన పోస్టును ఓ చిరుద్యోగికి కట్టబెట్టించి ఆపై ఏళ్ల తరబడి ఆయన అక్కడ తన పెత్తనం కొనసాగించారు.. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రానికి ఎంపీడీవో స్థాయి నుంచి డీఎల్‌డీవో స్థాయి అధికారి(గెజిటెడ్‌ హోదాలో) పనిచేయాల్సి ఉన్నా నిబంధనలు తుంగలో తొక్కి తన అనుంగు అనుచరుడైన పంచాయతీ కార్యదర్శికి ఆ పదవి ఇప్పించారు.. అది తప్పని తెలిసినా ఎవరూ నోరు మెదిపే ధైర్యం లేదు.. కారణం ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు పెడతారో.. ఎక్కడ తమను దూరప్రాంతాలకు బదిలీ చేస్తారో.. అనవసరంగా సస్పెండ్‌ చేస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది యావత్‌ జడ్పీ, దాని అనుబంధ యంత్రాంగం. 

న్యూస్‌టుడే, చిత్తూరు జడ్పీ  

నిబంధనలా.. మాకా..?

జడ్పీకి అనుబంధంగా ఉన్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం(డీపీఆర్‌సీ) ద్వారా జిల్లాలో కొత్తగా ఎంపికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తారు. దీనికి గెజిటెడ్‌ హోదా కలిగిన అధికారి గానీ, ఎంపీడీవో.. ఆపై స్థాయి అధికారి బాధ్యతలు చేపట్టాలి. అర్హత లేకున్నా నాటి మంత్రి పెద్దిరెడ్డి పేరు చెప్పి ఆ సమయంలో జడ్పీ ఏవోగా ఉన్న ప్రభాకరరెడ్డి.. తన అనుచరుడైన నగరి మండలం మాంగాడు గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శిగా ఉన్న షణ్ముగంను జిల్లా కోఆర్డినేటర్‌గా రప్పించుకున్నారు. దీంతో ఆయన 2020 జనవరి 21న బాధ్యతలు చేపట్టారు. అదేమిటని అడిగితే తమకేం తెలీదని, కమిషనరేట్‌ ఉత్తర్వులని చెప్పి నాటి ఉన్నతాధికారులు తప్పుకొన్నారు. దీనిపై కమిషనరేట్‌కి ఫిర్యాదులు వెళ్లడంతో రెండేళ్ల తరవాత (2022లో) షణ్ముగంను తప్పించి ఎంపీడీవో దేవేంద్రబాబును నియమించారు. ఆయన నాలుగు నెలలే పనిచేసి మళ్లీ ఎంపీడీవోగా వెళ్లిపోయారు. అప్పటికే సీఈవోగా వచ్చిన ప్రభాకరరెడ్డి.. సీనియర్లను కాదని మళ్లీ షణ్ముగాన్ని కోఆర్డినేటర్‌ స్థానంలో కూర్చొబెట్టారు.

అన్నీ తానై..

జడ్పీ కార్యాలయ సమావేశాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణలో కో-ఆర్డినేటర్‌దే కీలకపాత్ర. గ్రామ పంచాయతీల తీర్మానాలు, పారిశుద్ధ్య పనులు, గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు ఇలా అన్నింటినీ పర్యవేక్షించే బాధ్యత ఆయనదే. ఆపై వాటికి నిధులు ఇచ్చేది మాత్రం సీఈవో(డీపీఆర్సీ ఛైర్మన్‌)నే. మండలాల నుంచి వివరాలు అందజేయని అధికారులపై.. కో-ఆర్డినేటర్‌ తనదైన శైలిలో విరుచుకుపడేవారని పలువురు గెజిటెడ్‌ అధికారులు గతంలో ఫిర్యాదు చేసినా జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ నోరు మెదిపేవారు కాదు. చిన్న ఉద్యోగి తమపై పెత్తనం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకున్నా బయటపడేవారు కాదు. కారణం.. అతడు ప్రభాకరరెడ్డి అనుచరుడు కావడం.. ఆయనకు పెద్దిరెడ్డి అండ ఉండటమే.

జీతాల విడుదలలో జాప్యం..

డీపీఆర్సీలో పొరుగు సేవల కింద పనిచేసే తమకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని ఎన్నికలకు ముందు కలెక్టర్‌ సహా పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి(నాటి ఎంపీ బంధువు)ని ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు లేకపోలేదు. వేతనాల బిల్లులు పంపడంలో కోఆర్డినేటర్‌ కావాలనే తీవ్ర జాప్యం చేసేవాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెదేపా నేతలు షణ్ముగం పనితీరు, వ్యవహార శైలిపై పీఆర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ షన్మోహన్‌.. ఆయనపై రహస్య విచారణ నిర్వహించి కమిషనరేట్‌కు నివేదించినట్లు తెలిసింది. అర్హత లేకున్నా జిల్లా కో-ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారని, పూర్వ సీఈవోనే ఆయన్ను ఇక్కడ నియమించారనేది వాస్తవమని కలెక్టర్‌ తన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని