logo

కలెక్టర్‌ ఆదేశాలా.. అయితే..?

బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో సోమవారం తోతాపురి టన్ను ధర రూ.22 వేలే. దీంతో ఒక్కసారిగా రైతులు డీలాపడ్డారు. ఇదేం ధరలని వాపోయారు.

Published : 18 Jun 2024 01:39 IST

తోతాపురి టన్ను రూ.22 వేలే
ధర తగ్గడంతో కోత నిలిపేసిన రైతులు 

  • బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో సోమవారం తోతాపురి టన్ను ధర రూ.22 వేలే. దీంతో ఒక్కసారిగా రైతులు డీలాపడ్డారు. ఇదేం ధరలని వాపోయారు.
  • జిల్లాలో తోతాపురి మామిడి కాయల ధర టన్ను రూ.30 వేలకు తగ్గడానికి వీల్లేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే.

    - ఇదీ మూడ్రోజుల క్రితం తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన ఉమ్మడి ఆదేశం.

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: తోతాపురి మామిడి కాయల ధర బహిరంగ మార్కెట్‌లో పతనమైంది. వారం రోజుల్లో టన్ను రూ.27 వేల నుంచి రూ.22 వేలకు తగ్గింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి సైతం దక్కదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో తోతాపురి కాయల ధరల పతనమై ఇటీవల ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఈ సమస్యపై.. చంద్రగిరి ఎమ్మెల్యే నాని.. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో టన్నుకు రూ.30 వేలు చెల్లించాలని తిరుపతి కలెక్టరుకు విన్నవించారు. స్పందించిన కలెక్టర్లు తోతాపురి టన్ను రూ.30 వేలకు కోనుగోలు చేయాలని ర్యాంపు, పండ్ల గుజ్జు పరిశ్రమల నిర్వాహకులను ఆదేశించారు. ఈ క్రమంలో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే బంగారుపాళ్యంలో సోమవారం టన్ను రూ.22 వేల ధరనే వ్యాపారులు కొనసాగించారు. ఈ సమాచారం ఇతర రైతులకు తెలియడంతో కాయల రాక నిలిచిపోయింది. పట్టుమని పది టన్నుల కాయలైనా యార్డుకు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు బక్రీద్‌ కావడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు వెళ్లిపోవడంతో ధర మరింత పతనమైంది. కాయలు లేక యార్డులోని మండీలన్నీ బోసిపోయాయి. మరోవైపున ధర తగ్గిపోవడంతో నష్టాలు చవిచూడలేక ఏకంగా రైతులు మామిడి తోపుల్లో కోత నిలిపేయడం గమనార్హం. స్వయంగా కలెక్టర్లు ఆదేశించినా ధర గిట్టుబాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా యార్డులకు వచ్చి ఒక్కసారి పరిశీలించి వ్యాపారులను ఆదేశిస్తే తప్ప.. గిట్టుబాటు ధర వచ్చేలా లేదని మామిడి రైతులు పేర్కొంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని