logo

కళ్లు మూసుకుని మూల్యాంకనం...!

ఎస్వీ విశ్వవిద్యాలయం బీఏ ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల డిగ్రీ పరీక్ష గత ఏడాది నవంబరులో నిర్వహించింది. వీటి ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఇందులో రెండో సెమిస్టర్‌ చదువుతున్న ఎన్‌.సి.ఎస్‌.ఎం.ప్రసాద్‌కు కాంట్రాక్ట్స్‌-2 పేపరులో 16 మార్కులు మాత్రమే వచ్చాయి.

Published : 18 Jun 2024 01:43 IST

పట్టించుకోని ఎస్వీ పరీక్షల విభాగం 
నష్టపోతున్న విద్యార్థులు 

ఎస్వీ విశ్వవిద్యాలయం బీఏ ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల డిగ్రీ పరీక్ష గత ఏడాది నవంబరులో నిర్వహించింది. వీటి ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఇందులో రెండో సెమిస్టర్‌ చదువుతున్న ఎన్‌.సి.ఎస్‌.ఎం.ప్రసాద్‌కు కాంట్రాక్ట్స్‌-2 పేపరులో 16 మార్కులు మాత్రమే వచ్చాయి. ప్రతి సబ్జెక్టులో 60 మార్కులకుపైగా రాగా.. ఈ సబ్జెక్టులో తక్కువ రావడంతో ఆయన ఆర్టీఐ ద్వారా తాను రాసిన జవాబుపత్రాన్ని తీసుకున్నారు. అందులో ప్రశ్నలన్నింటికీ జవాబు రాసినా తక్కువ మార్కులు వేసినట్లు గుర్తించారు. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు.

ఈనాడు-తిరుపతి: ఎస్వీ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగం పూర్తిగా అవినీతి కూపంలో మునిగిపోయింది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన తర్వాత సరిగ్గా మూల్యాంకనం చేయకపోవడంతోపాటు సరైన సమయంలో ఫలితాలు విడుదల చేయని దుస్థితిలో ఉంది. ప్రతి పేపరు మూల్యాంకనాన్ని నిపుణులైన అధ్యాపకులు స్థానంలో కనీస అవగాహన లేని వ్యక్తులు, అప్పుడప్పుడే ఒప్పంద ఉద్యోగులుగా చేరిన వారితో చేయిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్ష పేపర్లను మూల్యాంకనం చేసిన సమయంలో ప్రతి జవాబు పక్కన కచ్చితంగా పెన్సిల్‌తో ఎన్ని మార్కులు వచ్చాయనేది ప్రస్తావించాలి. విద్యార్థి ప్రసాద్‌ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆయన రాసిన కొన్ని జవాబులకు అసలు మార్కులు వేయకపోవడం గమనార్హం. పరీక్ష పత్రంలో పార్ట్‌-ఎలో మొత్తం తొమ్మిది ప్రశ్నల్లో ఆరింటికి జవాబులు రాయాలి. ఒక్కో జవాబుకు మూడు మార్కులు నిర్ణయించారు. ప్రసాద్‌ ఆరు ప్రశ్నలకు జవాబులు రాయగా నాలుగు ప్రశ్నలకు రెండు మార్కులు చొప్పున వేశారు. మరో రెండు జవాబులకు మార్కులు వేయలేదు. సరైన జవాబు రాయకుంటే ‘0‘ మార్కులుగా పేర్కొనాలి. మూల్యాంకనం చేసిన అధ్యాపకులు అది కూడా చేయలేదు. పార్ట్‌-బిలో రెండు ప్రశ్నలకు సమాధానం రాయాలి. అందులో ఒక్కోదానికి 15 మార్కులు కాగా.. రెండు జవాబులకు ఒక్కోదానికి రెండు మార్కుల చొప్పన వేశారు. పార్ట్‌-సిలోనూ రెండు ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఇందులో ఒక్కో జవాబుకు 16 మార్కులు. ఇందులో రెండు ప్రశ్నలకు జవాబులు రాస్తే ఒక్కోదానికి రెండు మార్కుల చొప్పున వేశారు. జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించకుండానే తోచిన విధంగా మార్కులు వేసుకుంటూ వెళ్లారు. 

అధికారుల వింత వాదన..

పేపరు మూల్యాంకనం సమయంలో జవాబు పక్కన వారు రాసిన దానికి అనుగుణంగా పెన్సిల్‌తో మార్కులు కేటాయిస్తారు. చివరికి అన్నింటినీ లెక్కించి మొత్తం ఎన్ని వచ్చాయనేది చూస్తారు. అయితే ఇక్కడ మాత్రం జవాబుల పక్కన ఎటువంటి మార్కులు వేయలేదు. దీనిపై పరీక్ష విభాగం వాదన వింతగా ఉంది. పీజీ కోర్సులకు సంబంధించిన ఇద్దరు మూల్యాంకనం చేస్తారని అందువల్ల జవాబుల పక్కన మార్కులు వేయరని చెబుతున్నారు. అయితే ఇక్కడ బీఏ కోర్సుకు సంబంధించిన పరీక్ష మూల్యాంకనం జరిగింది. అప్పుడు జవాబు పక్కన మార్కులు ఎందుకు వేయరన్న ప్రశ్నకు మాత్రం వర్సిటీ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. ఇది ఒకరిద్దరి సమస్య కాదు. ఏటా వేలాది మంది విద్యార్థులు ఇదే విధంగా నష్టపోతున్నారనే ఆరోపణలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని