logo

లంచం ఇస్తే.. పరిహారం పెంచుతారట!

సొంత భూమితో తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. ఏ పరిస్థితుల్లోనైనా అటువంటి నేలను అమ్ముకోవాలంటే తల్లడిల్లుతారు.

Updated : 18 Jun 2024 03:02 IST

బావులు, బోర్లు ఒకరివైతే మరొకరివని ప్రతిపాదనలు  
చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో భూసేకరణ సిబ్బంది బాగోతం 

ఈనాడు, చిత్తూరు:  సొంత భూమితో తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. ఏ పరిస్థితుల్లోనైనా అటువంటి నేలను అమ్ముకోవాలంటే తల్లడిల్లుతారు. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన సందర్భంలో నలుగురికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కొంత కష్టమైనా భూమిని వదులుకోవడానికి సిద్ధపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సాధ్యమైనంత మేర న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పరిహారం విషయంలో ఉదారంగానూ వ్యవహరించాలి. చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఒకరు అడుగడుగునా రైతాంగాన్ని, ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా లంచాలు ఇస్తే అదనపు పరిహారానికి ప్రతిపాదనలు పంపి డబ్బులు జమ అయ్యేలా చొరవ తీసుకుంటున్నారు.

చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ రహదారి జిల్లాలో యాదమరి, చిత్తూరు, గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, నగరి, విజయపురం, నిండ్ర, పిచ్చాటూరు మండలాల మీదుగా తమిళనాడుకు వెళుతోంది. రూ.3,197 కోట్ల వ్యయంతో ప్రస్తుతం నిర్మాణం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే సరకు రవాణా వేగమవుతుంది. తమిళనాడులోని ఎన్నూరు నౌకాశ్రయంతో నేరుగా అనుసంధానమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భూసేకరణ వేగవంతం చేయాలని రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చింది. ఆర్డీవో కార్యాలయంలో భూ సేకరణ విభాగంలో పనిచేస్తోన్న సిబ్బంది ఒకరు దీన్నే అక్రమ సంపాదనకు అవకాశంగా మలచుకున్నారు.

రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు తీసుకుని  

భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం వస్తే సదరు సిబ్బంది గంటల తరబడి బయటే నిలబెట్టేవారు. బోర్లు, బావులు, చెట్లను అధిక సంఖ్యలో చూపి తనకు లంచాలు ఇచ్చే వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేవారు. ప్రధానంగా చిత్తూరు నగరపాలక సంస్థ, మండలం పరిధిలోనే ఈ విధంగా అవకతవకలకు పాల్పడ్డారు. అధిక పరిహారానికి ప్రతిపాదనలు పంపి.. అందులో కొంత శాతాన్ని వాటాగా తీసుకున్నారు. ఈ విధంగా పలువురి వద్ద రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు.

కాదూ.. కూడదంటే డబ్బులు రావంతే

పరిహారానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపాలన్నా ఆ బాధ్యతలు చూస్తున్న సిబ్బందికి నగదు ముట్టజెప్పాల్సిందే. లేదంటే వాటికి మోక్షం కలగకుండా చూసేవారు. చిత్తూరు నగరంలోని ఎల్‌బీపురానికి చెందిన నరసమ్మ ఇదే విధంగా పరిహారం కోసం విన్నవించారు. ఒకానొక సందర్భంలో విసుగు చెంది నిర్మాణ పనులకు అడ్డుచెప్పారు. కేవలం ఆ ఉద్యోగికి డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఇప్పటికీ పరిహారం జమ కాలేదు. ఇలా భూములు కోల్పోయిన బాధితులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. 

ఈమె పేరు సోని. భర్త పేరు శ్రీనివాసులు నాయుడు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎల్‌బీపురంలో నివసిస్తున్నారు. ఎల్‌బీపురం రెవెన్యూలో మూడు ఎకరాలు, నరిగపల్లిలో కొంత భూమి ఉంది. చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణానికి వీరి భూమి సేకరించారు. మొత్తం రూ.80 లక్షల పరిహారం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు  రూ.40 లక్షలు అందింది. పొలంలో ఒక బావి కూడా ఉంది. చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో భూసేకరణ వ్యవహారాలు చూస్తున్న సిబ్బంది లంచం అడిగినా ఇవ్వలేదని బావి వేరొకరిదని ప్రతిపాదనలు పంపారు. సుమారు రూ.20 లక్షలు పరిహారం  నొక్కేశారు. ఇందులో రూ.5 లక్షలు సిబ్బందికి లంచంగా సమర్పించుకున్నారు. ఈ బాగోతంపై ప్రశ్నించారని ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాల్సిన శ్రీనివాసులు నాయుడిపై కేసు కట్టించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని