logo

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగవంతే!

ప్రజలకు తక్కువ సమయంలో అవినీతి రహితంగా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ మాటలకు చేతలకు ఎక్కడా సంబంధమే లేదు. ఎటువంటి పరికరాలు, సదుపాయాలు కల్పించకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పడం జగన్‌ సర్కార్‌కు మాత్రమే సాధ్యమైంది.

Updated : 18 Jun 2024 05:08 IST

సదుపాయాలు కల్పించకుండా ఎలా సాధ్యమంటున్న సిబ్బంది 
అవినీతి రహిత, తక్కువ సమయంలో సేవలంటూ ఊదరగొట్టిన గత ప్రభుత్వం  

ఈనాడు, చిత్తూరు: ప్రజలకు తక్కువ సమయంలో అవినీతి రహితంగా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ మాటలకు చేతలకు ఎక్కడా సంబంధమే లేదు. ఎటువంటి పరికరాలు, సదుపాయాలు కల్పించకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పడం జగన్‌ సర్కార్‌కు మాత్రమే సాధ్యమైంది. ఫలితంగానే ఇది ఆరంభ శూరత్వంగా మిగిలింది. రెండున్నరేళ్లలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 200 కూడా దాటలేదు. ఈ సంఖ్యను అధికంగా చూపేందుకు జగనన్న కాలనీల్లోని స్థలాలకూ రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. 

వైకాపా అధికారంలోకి వచ్చాక వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పేరిట రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతులతో సంబంధం లేకుండానే వారి అభ్యంతరాలు పరిష్కరించకుండానే తూతూమంత్రంగా సర్వే మొదలుపెట్టారు. ఫలితంగా యజమానుల పేర్లు, విస్తీర్ణం, ఆధార్‌ నంబర్లలో తప్పులు దొర్లాయి. ఈ వ్యవహారం గ్రామాల్లో గొడవలకూ దారి తీసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో కూడా ముద్రించారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పైగా వేగంగా చేయాలని క్షేత్రస్థాయిలోని అధికారులు, ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. రీ సర్వే ప్రక్రియ కొలిక్కి రాకుండానే ఆఘమేఘాలపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ ఊదరగొట్టింది. 

జగనన్న కాలనీల్లోని స్థలాలు చేసి..  

గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడంలేదని విమర్శలొచ్చాయి. దీంతో జగనన్న కాలనీల్లో ఇంటి పట్టాలు పొందిన వ్యక్తులకు స్థలాల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని ఎన్నికల నియమావళికి 10- 15 రోజుల ముందు హడావుడి చేశారు. దాదాపు నాలుగేళ్ల కిందట ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్‌ జరపడమేంటని అప్పట్లో లబ్ధిదారులు నిలదీసినా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు వచ్చినందున అమలు చేస్తున్నామని సచివాలయ ఉద్యోగులు సమాధానం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువ జరగడానికి ప్రధాన కారణం అవసరమైన వెబ్‌ కెమెరాలు, డ్యూయల్‌ స్కానర్లు తదితర పరికరాలు లేకపోవడమే. కొన్నిచోట్ల మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అంతర్జాల సమస్య ఉంది. దీంతో సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ ద్వారా కంప్యూటర్లతో పనులు చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఇలా గత ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగానే తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.

రెండున్నరేళ్లలో 110 మాత్రమే  

సమగ్ర భూసర్వే పూర్తయిన గుడిపాల మండలం రామభద్రాపురం, గంగాధరనెల్లూరు మండలం అగరమంగళం సచివాలయాల్లో 2022 జనవరిలో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. అదే ఏడాది నవంబరులో మరో 67 సచివాలయాల్లోనూ సేవలు ప్రారంభించారు. రెండున్నరేళ్లలో ఇప్పటివరకు వీటన్నింటిలో కలిపి కేవలం 110 రిజిస్ట్రేషన్లే జరిగాయంటే అప్పటి ప్రభుత్వానికి ఈ అంశంపై ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించిందో ఇట్టే అర్థమవుతోంది. అత్యధికంగా రామభద్రాపురంలో 22, గుడుపల్లె మండలం గుండ్లసాగరంలో ఎనిమిది, అగరమంగళంలో అయిదు రిజిస్ట్రేషన్లు చేశారు. 60 సచివాలయాల్లో తూతూమంత్రంగా ఒకొక్కటే జరిగింది. ప్రతిచోట కచ్చితంగా ఒక్క రిజిస్ట్రేషన్‌ అయినా చేయాలని ఆదేశించడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సింహభాగం పూర్తి చేసి ఇక్కడ ఈ-కేవైసీ చేసిన ఉదంతాలు కోకొల్లలు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని