logo

రోగులను బయటకు పంపొద్దు

చిత్తూరులోని పెద్దాసుపత్రిలో పెద్ద వైద్యులుంటారని, రోగం నయం అవుతుందనే నమ్మకంతో రోగులు వస్తారని, అలాంటి వారిని సిఫార్సుల పేరుతో ఇతర ఆసుపత్రులకు పంపడం భావ్యం కాదని, స్థానికంగానే అన్ని పరీక్షలు చేసి,

Published : 20 Jun 2024 05:24 IST

ప్రభుత్వాసుపత్రిలో రోగి సహాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగన్మోహన్‌

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరులోని పెద్దాసుపత్రిలో పెద్ద వైద్యులుంటారని, రోగం నయం అవుతుందనే నమ్మకంతో రోగులు వస్తారని, అలాంటి వారిని సిఫార్సుల పేరుతో ఇతర ఆసుపత్రులకు పంపడం భావ్యం కాదని, స్థానికంగానే అన్ని పరీక్షలు చేసి, వైద్య సేవలు అందించి మందులు ఇవ్వాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ వైద్యులకు సూచించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనరు అరుణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట అత్యవసర విభాగాన్ని సందర్శించారు. ఓపీ గదులకు వెళ్లి సేవలపై ఆరాతీశారు. ఓ వృద్ధురాలు తనకు చీటీ రాసిచ్చి బయట తీసుకోవాలని చెప్పారని సమాధానం ఇవ్వగా ఇదేమిటని అక్కడి వైద్యులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రి-అపోలో సమన్వయంతో సేవలు అందుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పలు విభాగాలను పరిశీలించి సూచనలు చేశారు. రోగులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్, ఎక్స్‌-రే, ఇతర యంత్రాలన్నీ పనిచేయాలని, అవన్నీ రోగులకు ఉపయోగపడాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని లోపాలు గుర్తించి ప్రభుత్వ-అపోలో అధికారులకు తెలియజేశామన్నారు. ఆర్‌ఎంవో సంధ్య, అపోలో యూనిట్‌ ఇన్‌ఛార్జి నరేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని