logo

నా ఇష్టం.. ఎవరికీ చెప్పను

ఆయనొక చిన్నస్థాయి అధికారి.. పనిచేసేది మాత్రం జిల్లా కో-ఆర్డినేటర్‌గా.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి పలుకుబడితో ఏళ్లతరబడి స్థాయికి మించిన పోస్టులో కొనసాగుతున్న ఆయన నేడు..

Published : 20 Jun 2024 05:30 IST

డీపీఆర్‌సీ తరలింపునకు యత్నం
వివాదాస్పదంగా కోఆర్డినేటర్‌ తీరు 
న్యూస్‌టుడే, చిత్తూరు జడ్పీ

జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం

యనొక చిన్నస్థాయి అధికారి.. పనిచేసేది మాత్రం జిల్లా కో-ఆర్డినేటర్‌గా.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి పలుకుబడితో ఏళ్లతరబడి స్థాయికి మించిన పోస్టులో కొనసాగుతున్న ఆయన నేడు ఉన్నతాధికారులను సంప్రదించకుండా తనదైన శైలిలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.. జడ్పీ అనుబంధ జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని నేరుగా కలెక్టరేట్‌లోని ఓ భవనానికి తరలించాలనే పన్నాగంతో లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు విన్నవించగా అందుకు ఆయన విముఖత వ్యక్తం చేయడం గమనార్హం.. పైఅధికారులను కనీసం సంప్రదించకుండా కో-ఆర్డినేటర్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై కలెక్టర్‌ ఆగ్రహించారు.

ఉన్నతాధికారులకు చెప్పకుండా..

జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని (డీపీఆర్‌సీ) కలెక్టరేట్‌కు గానీ.. జిల్లా పంచాయతీ కార్యాలయంలోకి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు కలెక్టర్‌ షన్మోహన్‌కు.. డీపీఆర్సీ కో-ఆర్డినేటర్‌ షణ్ముగం లేఖ అందజేశారని సమాచారం. వాస్తవంగా జడ్పీలోనే ఈ కార్యాలయం ఉండాలి. డీపీఆర్సీ నుంచి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు గానీ, దస్త్రాలపై సంతకం ఆ కేంద్ర ప్రిన్సిపల్‌ అయిన జడ్పీ సీఈవో సంతకం తప్పనిసరి. కో-ప్రిన్సిపల్‌గా డీపీవో వ్యవహరిస్తారు. చెక్కులపై సీఈవో సంతకంతోనే ఆ నిధులు విడుదల చేస్తారు. డీపీఆర్సీ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్నచోట నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే ప్రతి చిన్న విషయానికి సంప్రదించేందుకు అక్కడ పనిచేసే సిబ్బంది జిల్లా పరిషత్తు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఫలితంగా కాలయాపన జరిగే అవకాశం ఉంది. ఈ కేంద్రంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి ఇద్దరు చొప్పున, అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఒక రిసోర్స్‌ పర్సన్, జిల్లా కో-ఆర్డినేటర్‌తో కలిపి మరో ఆరుగురు పనిచేస్తున్నారు. మరోవైపున కనీసం సీఈవో, డీపీవోల దృష్టికి భవనం తరలింపు విషయాన్ని తీసుకెళ్లకుండా నేరుగా కలెక్టర్‌ను కలిసి విన్నవించడంపై జడ్పీ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డి అనుచరుడనే ముద్రపడిన షణ్ముగం.. తాజాగా ఇలాంటి ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఉన్నతాధికారులకు గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడమేంటని జడ్పీ కార్యాలయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


కలెక్టర్‌ ఆగ్రహం 

కలెక్టరేట్‌లోని జ్యోతిబా ఫులే భవన సమీపంలోని భవనాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇందుకు కలెక్టర్‌ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీపీఆర్సీ కార్యాలయాన్ని ఒకవేళ మార్పు చేయాలంటే.. జడ్పీ సీఈవో అనుమతి తీసుకోవాలి. ఆపై తరలింపు ప్రక్రియకు సంబంధించిన లేఖను సైతం జడ్పీ ద్వారా కలెక్టరేట్‌కు పంపాలి. పాలనాపరంగా ఇంతటి నిబంధనలు ఉన్నా కోఆర్డినేటర్‌ షణ్ముగం ఇవేమీ పట్టించుకోలేదు. దీనిపై ఇప్పటివరకు పక్కనే ఉన్న జడ్పీ అధికారులకు అతడు కనీస సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపున.. జడ్పీ మున్ముందు ప్రస్తుత అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్తే వచ్చి వెళ్లే పార్టీ నేతలు.. ఎక్కడ డీపీఆర్సీకి వస్తారో.. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలతో అంటకాగిన తనను ఎక్కడ ఏమంటారో.. అందుకే ఏగొడవ లేకుండా కలెక్టరేట్‌లో ఏదోఒక భవనంలో ఒక గదికి డీపీఆర్సీని తరలిస్తే ఏ బాధా ఉండదనే ఆలోచనతోనే.. ఇలా తరలింపు వ్యవహారాన్ని షణ్ముగం ఏకపక్షంగా తెరపైకి తెచ్చాడని, ఈ వ్యవహారం వెనుక తన గురువు పూర్వ సీఈవో పాత్ర ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని జడ్పీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని