logo

కాసింత ఊరట

తోతాపురి మామిడికాయల ధర బహిరంగ మార్కెట్‌లో ఎట్టకేలకు టన్ను రూ.23 వేల నుంచి రూ.25 వేలకు పుంజుకుంది. రెండ్రోజులుగా టన్ను ధర రూ.23 వేలు నిర్ణయించడంతో రైతులు కోతలు నిలిపేశారు.

Published : 20 Jun 2024 05:35 IST

పుంజుకుంటున్న తోతాపురి ధర 
టన్ను రూ.25వేలు

ర్యాంపు వద్ద లారీకి లోడ్‌ చేస్తున్న కాయలు 

బంగారుపాళ్యం: తోతాపురి మామిడికాయల ధర బహిరంగ మార్కెట్‌లో ఎట్టకేలకు టన్ను రూ.23 వేల నుంచి రూ.25 వేలకు పుంజుకుంది. రెండ్రోజులుగా టన్ను ధర రూ.23 వేలు నిర్ణయించడంతో రైతులు కోతలు నిలిపేశారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడి బుధవారం రూ.23 వేల నుంచి రూ.25 వేలకు పెరిగింది. రూ.రెండు వేలు పెరిగినా కాయలు కోసేందుకు రైతులు ఆసక్తి చూపలేదు. దీంతో 50 టన్నుల కాయలు అమ్మకానికి రాలేదు. మార్కెట్‌యార్డు, ర్యాంపులు అమ్మకాలు లేక వెలవెలబోయాయి. లారీలకు లోడు కాలేదు. ధరలు ఆశాజనకంగా ఉంటే రోజుకు 500కు పైగా టన్నులు క్రయవిక్రయాలు జరిగేవి. మూడురోజులు గడిచినా పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు, ర్యాంపుల వ్యాపారులు కలెక్టరు ఆదేశాలు అమలు చేయలేదు. కాయలకు డిమాండ్‌ ఉండటంతో స్వల్పంగా ధర పెంచారని, టన్నుకు రూ.30 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

బంగినపల్లి టన్ను రూ.90 వేలు.. 

స్థానిక మార్కెట్‌ యార్డులో బంగినపల్లి కాయలు నాణ్యత బట్టి టన్ను రూ.50 వేల నుంచి రూ.90 వేలు పలికాయి. దీంతో రైతులు ఊరట చెందారు. ఇదే తరహా ఇమామీ పసందు టన్ను రూ.లక్ష, కాదర్‌ టన్ను రూ.50 వేలకు అమ్ముడుపోయాయి. రైతులు తోతాపురి మామిడి కాయలను పండ్ల గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు టన్నుకు బహిరంగ మార్కెట్‌ కంటే అదనంగా టన్ను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తారని మండల ఉద్యానశాఖ అధికారి సాగరిక తెలిపారు. ఆమె స్థానిక మార్కెట్‌ యార్డులోని కాయలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. తోతాపురి కాయలకు టన్ను రూ.30 వేలు చెల్లించాలని కోరారు.


కాయలు ఫ్యాక్టరీలకే తరలించాలి

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: తోతాపురి మామిడి కాయలు గుజ్జు పరిశ్రమలకే తరలించాలని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి రైతులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పక్వానికి వచ్చిన కాయలు వెంటనే కోసి తరలించాలన్నారు. కాయలను ర్యాంపు (సేకరణ కేంద్రాలు)లకు తరలిస్తే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఫ్యాక్టరీలకు తరలిస్తే అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు సమకూరుతుందని చెప్పారు. మామిడి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.


కలెక్టర్‌ ఆదేశాలు అమలుకాకపోవడం ఏంటి?: ఎంపీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాలతో మామిడి దిగుబడి తగ్గిందని, ఈ తరుణంలో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తోతాపురి రకం మామిడి కాయలకు టన్నుకు రూ.30 వేలు తగ్గకుండా రైతులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. కలెక్టర్‌.. జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులకు ఆదేశాలు జారీచేసినా అమలుకు నోచుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మామిడి రైతుల విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులుగా తామూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నందున అధికారులు చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. పరిశ్రమల యజమానులు రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని