logo

వైకాపా నేతల.. ఆక్రమణ లీలలు

వైకాపా నేతలు ఎన్నికల ముంగిట రెచ్చిపోయారు. జగనన్న లేఅవుట్లతో పాటు ఇటు ప్రభుత్వ భూములు మాయం చేశారు. కార్యకర్తల కోసమంటూ మరికొన్ని చోట్ల పట్టాలు అందజేశారు.

Published : 20 Jun 2024 05:38 IST

రూ.కోట్ల భూములపై కన్ను

గూడూరు, న్యూస్‌టుడే: వైకాపా నేతలు ఎన్నికల ముంగిట రెచ్చిపోయారు. జగనన్న లేఅవుట్లతో పాటు ఇటు ప్రభుత్వ భూములు మాయం చేశారు. కార్యకర్తల కోసమంటూ మరికొన్ని చోట్ల పట్టాలు అందజేశారు. వీరికి స్థలాలు చూపించకుండా పట్టాలిచ్చేశారు. ఉదాహరణకు నాయుడుపేట పట్టణం సమీపంలో బిరదవాడ టిడ్కో ఇళ్ల స్థలాల సమీపంలో 70 మందికి పట్టాలిచ్చారు. ఇవన్నీ పట్టుకున్న కార్యకర్తలు నేతల చుట్టూ తిరుగుతున్నారు.

  • నాయుడుపేట పట్టణం పొగగొట్టం కాలనీలో పెత్తనం చేసి ప్లాట్‌ కాజేసిన నేతలు ఇదే తీరుగా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి అధికారుల ద్వారా వాటిని స్వాహా చేశారు. ఇందుకు ప్రజాప్రతినిధి కాస్త సహకారం ఇవ్వడంతో అధికారులను బుట్టలో వేసుకుని వాటిని ఆధీనంలోకి తీసుకుని కొందరికి క్రయవిక్రయాలు చేపట్టారు. ఇదే పట్టణంలో ఎల్‌ఐసీ ఆనుకుని ఓ నేత ప్రభుత్వ భూమిని వదిలి ప్రహరీ నిర్మాణానికి సహకరించారు. 

నాడు: ఈ చిత్రంలోని తూమ్మూరు రెవెన్యూలోని జగనన్న లేఅవుట్‌లో రూ.2.70 కోట్లు ఖర్చు చేసి 4.50 ఎకరాలు చదును చేసి 140 ప్లాట్లు వేశారు. ఇందులో నాయుడుపేట-కోట రోడ్డు మార్గం వైపున మూడు రహదారులు నిర్మించారు. 80 మంది వరకు ప్లాట్లు ఇచ్చారు. వారంతా ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. విద్యుత్తు వసతి, తాగునీటి కోసం బోర్లు వేయించారు. ఇళ్ల నిర్మాణాలు పేరుతో హడావుడి చేయగా కొందరు పునాది వరకు నిర్మాణాలు చేపట్టారు. ఇంతలో ఇక్కడ వేసిన బోరును అధికారులే దగ్గరుండి తీయించేశారు. ఇవి నిర్మాణాలకు అనువుకాని భూములని అధికారులు తెలిపినా అధికార పార్టీ నేతల కోసం అన్నట్లు పనులు చేశారు. 


నేడు: ఇక్కడ రోడ్డు అంచున ఎకరం స్థలం ఆక్రమించడానికి ఇదే ప్రాంతంలో పెత్తనం చేస్తున్న వైకాపా నేత ప్రయత్నించారు. ముందుగా యంత్రాలతో చదును చేసి రోడ్లు ధ్వంసం చేశారు. తాజాగా జేసీబీలతో గుంతలు తీసి ఆక్రమించే క్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంలో ఆపేశారు. ఈ భూమి విలువ సుమారుగా రూ.50 లక్షల మేర ఉంటోందని అంచనా.


నాయుడుపేట ఎల్‌ఏ సాగరంలో ప్రభుత్వ భూమిగా బోర్డు

నాడు : ఈ చిత్రంలోని సర్వే నంబర్‌ 65-1, 37 సెంట్లు, 66-1లో 19 సెంట్ల భూమి ఉంది. గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సుమారుగా 56 సెంట్ల స్థలం కాగా కొందరు కొద్దిగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండగా ఆపేశారు. కానీ వీటికి కంచె ఏర్పాటు చేపట్టలేదు. ఈ భూమి విలువ సుమారుగా రూ.10 కోట్లు ఉంటుంది. అంకణం రూ.3లక్షలు కాగా విలువైన స్థలంపై వైకాపా నేతలు కన్నేశారు.


ఎల్‌ఏ సాగరంలో ఆక్రమించి నిర్మిస్తున్న భవనం 

నేడు : సరిగ్గా ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఇదే పట్టణంలో కౌన్సిలర్‌గా, వైకాపా నేతగా చెలామణి అవుతూ పలుకుబడి కలిగిన నేత నిర్మాణాలకు పూనుకున్నారు. ఇక్కడ అంకణం రూ.3 లక్షలు కాగా 13 అంకణాల్లో భవనం నిర్మిస్తున్నారు. ఆక్రమిత స్థలం విలువ సుమారుగా రూ.40 లక్షలు ఉంటోంది. ఇక్కడే మరి కొన్ని చోట్ల భవనాలు నిర్మించినా పాలకవర్గం కన్నెత్తి చూడలేదు. దీంతో కొద్దికొద్దిగా గుట్టుచప్పుడుగా ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని