logo

తెలుగు అకాడమీ.. ఉన్నట్లా.. లేనట్లా..?

వైకాపా పాలనలో తెలుగు అకాడమీ చిరునామా గల్లంతైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడికి తరలించారు. తదనంతరం కాగితాలకే పరిమితమై కేవలం ప్రాంతీయ తెలుగు అకాడమీ కేంద్రం కార్యకలాపాలకు పరిమితమైంది.

Updated : 20 Jun 2024 06:03 IST

జీవోకే పరిమితమైన కార్యకలాపాలు

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే:  వైకాపా పాలనలో తెలుగు అకాడమీ చిరునామా గల్లంతైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడికి తరలించారు. తదనంతరం కాగితాలకే పరిమితమై కేవలం ప్రాంతీయ తెలుగు అకాడమీ కేంద్రం కార్యకలాపాలకు పరిమితమైంది. తితిదేకు చెందిన గోశాల ఆవరణలో తుమ్మలగుంట మార్గంలోని ప్రవేశద్వారం ఉన్న ప్రాంతంలో మాసిపోయిన తెలుగు- సంస్కృత అకాడమీ బోర్డు తప్ప ఇతర జాడ కనిపించదు. కనీస మౌలిక వసతులు లేని భవనంలో నామమాత్రపు ఇంటర్‌ పాఠ్య పుస్తకాలతో భవనం దర్శనమిస్తుండటంపై భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీపార్వతి హంగామా చేసినా..

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2020 జూన్‌ 16న తిరుపతిలో అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2022 జూన్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. లక్ష్మీపార్వతి అప్పుడప్పుడు తిరుపతికి వచ్చి తాను ఛైర్‌పర్సన్‌ అనే ఉనికిని చాటుకోవడం మినహా ఎటువంటి ముద్ర వేయలేకపోయారు. భవన నిర్మాణం కోసం ఆమె చేసిన హంగామా అంతాఇంతా కాదు. అదిగో.. ఇదిగో అంటూనే ఐదేళ్లు కరిగిపోయాయి. 

కార్యాలయం ఇక్కడ.. ఉద్యోగులు విజయవాడలో..

అకాడమీ కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే నిర్వహిస్తున్నారు. పలు సెక్షన్లలోని 14 మంది ఉద్యోగులు ఇక్కడ కార్యాలయం ఉందనే విషయాన్ని మరిచిపోయారు. అక్కడే పుస్తకాలు ముద్రించి వాటిని అనంతపురం, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులోని ప్రాంతీయ కేంద్రాలకు చేరవేసి విక్రయాలు సాగిస్తున్నారు. తిరుపతిలో ప్రింటింగ్‌ ప్రెస్‌లు అందుబాటులో లేవని, అకాడమీకి అవసరమైన రూ.కోట్ల విలువైన పాఠ్యపుస్తకాలను ముద్రించేందుకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే అక్కడకు వస్తారనే సాకుతో విజయవాడ నుంచే నిర్వహిస్తున్నారు. 

జనసేనాని విమర్శలు..

తెలుగు- సంస్కృత అకాడమీ ఊసే లేకుండా నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వ పాలనతో తెలుగు భాషాభిమానులు విరక్తి చెందారు. అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం అకాడమీని తప్పుదారి పట్టిస్తోందని అప్పట్లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. 

ఆవిర్భావం వెనుక...

తెలుగును రాష్ట్ర అధికార భాషగా ప్రకటించేందుకు 1955 నుంచి సాగిన ప్రయత్నాలు 1966లో  సఫలం అయ్యాయి. అధికార భాషా చట్టం అమలులోకి రాగానే భాషను ఆధునికీకరించడం, తెలుగును బోధనా మాధ్యమంగా మార్చడం లక్ష్యంగా 1968 జూన్‌ 12న హైదరాబాద్‌ కేంద్రంగా అకాడమీ ఆవిర్భవించింది. 1969-70 నుంచి ముద్రణ బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయానికి 158 ప్రచురణలను ముద్రించే స్థాయికి ఎదిగింది. 

ఇంటర్‌ పాఠ్యపుస్తకాలే దిక్కు

అకాడమీ ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఎడ్, ఆధునిక తెలుగు బోధన, ఎంసెట్‌ పుస్తకాలతోపాటు వివిధ అనువాదాలు, మోనోగ్రాఫులు, జనరంజక గ్రంథాలు, వ్యాసావళి, పోటీ పరీక్షల పుస్తకాలతోపాటు నిఘంటువులు, పరిపాలన న్యాయ పదకోశం వంటి ప్రచురణలు ముద్రించేది. ఆదాయపరంగా విభజనకు ముందు రూ.250 కోట్లకు పైగా నిధులతో వర్ధిల్లిన అకాడమీ ఇప్పుడు నిర్వహణకు కష్టాలు పడుతోంది. ప్రస్తుతం ఇంటర్‌ పుస్తకాలే ముద్రిస్తుండటంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2022కు ముందు రూ.లక్ష, తదనంతరం రూ.24 లక్షల విలువైన పుస్తకాలు మాత్రమే విక్రయించగా.. 2023-24లో కాస్త ఆశాజనకంగా రూ.10 కోట్ల విలువైన పుస్తకాలు ముద్రించినట్లు చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని