logo

గజేంద్ర మోక్షమేదీ?

గజరాజులు ఘీంకరిస్తున్నాయి. ఉనికి కోసం నిత్య పోరాటం చేస్తున్నాయి. అటవీ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతుండటం వాటి పాలిట శాపంగా మారింది. దీంతో  జనవాసాల్లోకి వస్తూ ఓవైపు మృత్యువాత పడుతుండగా మరోవైపు వాటి బారినపడి రైతులు,

Updated : 20 Jun 2024 06:02 IST

మనుగడ కోసం జీవన్మరణ పోరాటం
రైతులకూ తప్పని ప్రాణ, ఆస్తినష్టం 
వనరుల కల్పనలో వైకాపా ప్రభుత్వం విఫలం
న్యూస్‌టుడే, పలమనేరు

గజరాజులు ఘీంకరిస్తున్నాయి. ఉనికి కోసం నిత్య పోరాటం చేస్తున్నాయి. అటవీ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతుండటం వాటి పాలిట శాపంగా మారింది. దీంతో  జనవాసాల్లోకి వస్తూ ఓవైపు మృత్యువాత పడుతుండగా మరోవైపు వాటి బారినపడి రైతులు, సాధారణ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వన్యప్రాణి సంరక్షణకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిస్థితి ఈ ఐదేళ్లలో మరింత దిగజారింది. ఆహారం కోసం గ్రామాల్లోకి చొరబడుతుండటంతో పెద్దఎత్తున పంట ఉత్పత్తులు నష్టపోవాల్సి వస్తోంది.

ఆగిన కంచె నిర్మాణం

పలమనేరు అటవీశాఖ పరిధిలో సోలార్‌ కంచె నిర్మాణం, కందకాల తవ్వకం అర్ధాంతరంగా నిలిచిపోయి ఏనుగులు సులువుగా గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. సోలార్‌ కంచెను ధ్వంసం చేస్తున్నాయి. 

పెరిగిన  సంఖ్య

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 29 వేల వరకు ఏనుగులు ఉన్నాయని సంబంధిత విభాగం 2017లో గణాంకాలతో ప్రకటించింది. ఇందులో కర్ణాటకలో ఆరువేలు, అసోంలో ఐదు వేలు, కేరళ మూడువేల వరకు ఉన్నాయి. పర్యావరణ మార్పులు, వనరుల విధ్వంసంతో దేశంలో ఏటా ఏనుగుల సంఖ్య తగ్గుతూ వస్తుండగా పలమనేరు అడవిలో మాత్రం వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 1982లో 42 ఏనుగులు మధుమలై నుంచి ఇక్కడికి చేరుకోగా ప్రస్తుతం వాటి సంఖ్య వందకు పెరిగింది.

అడవిలో అసంపూర్తిగా కందకం

విద్యుదాఘాతంతోనే.. 

పదేళ్లలో 20 ఏనుగులు వివిధ కారణాలతో మత్యువాత పడ్డాయి. విద్యుదాఘాతంతోనే ఎక్కువగా చనిపోతున్నాయి. నాలుగేళ్లలో.. బైరెడ్డిపల్లె మండలం నెల్లిపట్ల సమీపంలో విద్యుత్తు స్తంభాన్ని ఏనుగు ఢీకొనడంతో తీగలు పైనపడి మృతి చెందింది. పట్టణంలోని కంపోస్టు యార్డు వద్ద నియంత్రికను ఢీకొని మరోటి చనిపోయింది. మున్సిపాలిటీకి సమీపంలోని బేరుపల్లెలో మరో ఏనుగు ఇలాగే ప్రాణాలు విడిచింది. పలమనేరు, మొగిలి, రామకుప్పం ప్రాంతాల్లో ఐదు ఏనుగులు చనిపోయాయి. చంద్రగిరి పరిధిలో ఇటీవల ఒకటి మృత్యువాత పడింది.

ప్రాణాలకు రక్షణేదీ?

ఏనుగులు ఎలా చనిపోతున్నాయో మనుషులు కూడా వాటి బారినపడి చనిపోతున్నారు. పొలాలకు కాపలా ఉన్న రైతులపై దాడి చేస్తున్నాయి. పదేళ్లలో మొత్తం 20 మంది వరకు చనిపోయారు. 2018లో నలుగురు ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ ఏనుగుల దాడిలో గాయపడ్డారు. రామకుప్పం మండలంలోని పీఎంతండాలో ఈ శనివారం రాత్రి కన్నానాయక్‌ (65) పశువులను కట్టేసేందుకు కొట్టంలోకి వెళ్లగా పొలంలో ఉన్న ఒంటరి ఏనుగు ఒక్కసారి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

కంచెను ధ్వంసం చేస్తున్న ఏనుగు 

సంరక్షణ చర్యలు అవసరం

అడవిలో వన్యప్రాణులకు అవసరమైన వనరులను అభివృద్ధి చేయాల్సి ఉంది. నీటికుంటల తవ్వకం, చెక్‌డ్యాంలు, ఉప్పు దిబ్బలు ఏర్పాటుతోపాటు వాటికి అవసరమైన ఆహారం సమృద్ధిగా ఉండేలా చూడాలి. ఉసిరి, చిగర, వెదురు, రావి, ఉల్లింద, నల్లబలస, తపసి, నేరేడు, మామిడి, సీతాఫలం వంటి మొక్కల పెంపకం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఎలిఫెంట్‌ ప్రాజెక్టు నిధులు తెప్పించి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఐదేళ్లలో.. చేసింది శూన్యం  

వైకాపా ప్రభుత్వం ఏనుగుల సంరక్షణ కోసం, వాటి నుంచి రైతులను, పంటలను కాపాడటం కోసం ఐదేళ్లలో ఎలాంటి నిధులు ఖర్చుపెట్టకపోవడం గమనార్హం. పంటనష్ట పరిహారం పెంపులేకపోగా అరకొరగా ఇస్తున్న నిధులకు ఎదురు చూపులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. 


ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం
- చైతన్యకుమార్‌రెడ్డి డీఎఫ్‌వో, చిత్తూరు

ఏనుగుల సంరక్షణతోపాటు వాటికి సరైన ఆహారం కల్పించడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపాదనలను సిద్ధం చేశాం. ప్రభుత్వానికి పంపి ఏనుగులను కాపాడటమే కాకుండా అడవులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని