logo

ఉంటారా..? వైదొలుగుతారా..?

వైకాపా ప్రభుత్వంలో వర్సిటీలు అపహాస్యం పాలయ్యాయి. వడ్డించేవాడు మనవాడైతే చాలన్నట్లు వైకాపా నేతల, ఉన్నతాధికారుల అనుంగులు అడ్డదారుల్లో కొలువుదీరారు.

Published : 21 Jun 2024 04:03 IST

అడ్డదారిలో వేద వర్సిటీ ఉపకులపతి నియామకం
గత ఈవో ధర్మారెడ్డి అండతో ప్రవేశం

వేద విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో వర్సిటీలు అపహాస్యం పాలయ్యాయి. వడ్డించేవాడు మనవాడైతే చాలన్నట్లు వైకాపా నేతల, ఉన్నతాధికారుల అనుంగులు అడ్డదారుల్లో కొలువుదీరారు. ఇందుకు తితిదేకు అనుబంధంగా విరాజిల్లుతోన్న వేద విశ్వవిద్యాలయం అతీతం కాదు. గత ప్రభుత్వ జమానాలో అన్నీ తానై చక్రం తిప్పిన తితిదే గత ఈవో ధర్మారెడ్డి ఆశీస్సులతో అర్హతలు లేకున్నా అందలం ఎక్కారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రస్తుత ఉపకులపతి తన పదవిని వీడుతారా? లేదా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తితిదేకు అనుబంధంగా ఉన్న వేద విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రాణి సదాశివమూర్తి వ్యవహరిస్తున్నారు. ఇన్‌ఛార్జిగా అడుగుపెట్టిన ఆయనకు ఈవో ధర్మారెడ్డి అండదండలు ఉండటంతో పూర్తిస్థాయి ఉపకులపతిగా పాగావేశారు. ముందుగా తితిదే పాలక మండలి ఆమోదం పొంది ప్రభుత్వానికి నివేదించగా అక్కడి నుంచి దస్త్రం నేరుగా రాష్ట్ర గవర్నర్‌కు చేరింది. ఆయన ఆమోదంతో గత ఏడాది అక్టోబరు 10న రాణి సదాశివమూర్తిని ఉపకులపతిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అర్హత లేకున్నా అందలం: వేద విద్యాలయం ఉపకులపతిగా ఉండాలంటే పది సంవత్సరాలపాటు ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం తప్పనిసరి. అయితే రాణి సదాశివమూర్తికి ఆరు సంవత్సరాల అనుభవం మాత్రమే ఉంది. దీంతోపాటు వేదం కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఈ రెండూ లేకపోయినప్పటికీ ధర్మారెడ్డి ఆశీస్సులతో ఆయన నియామక ప్రక్రియను పూర్తిచేశారు. ఎందరు విమర్శించినా లెక్కచేయలేదు. వర్సిటీలో పది సంవత్సరాలపాటు ప్రొఫెసర్లుగా పనిచేసి వేదం కోర్సు పూర్తిచేసిన వారు ఇద్దరున్నా వారిని పరిగణలోకి తీసుకోలేదు. అర్హుల కోసం అన్వేషించ లేదు. ప్రస్తుతం తితిదేకు నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. మరి వేద వర్సిటీలో జరిగిన ఈ పొరపాటును సరిచేసి పూర్తిస్థాయి అర్హతలు ఉన్నవారిని నియమిస్తారా.. లేక రాణి సదాశివమూర్తినే కొనసాగిస్తారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు