logo

వీధినపడ్డ ఎస్పీవోలు

వారంతా రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వహించారు. కరోనా సమయంలో కనీసం ఇళ్లకు వెళ్లకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గస్తీ కాశారు.

Published : 21 Jun 2024 04:04 IST

అర్ధాంతరంగా తొలగించిన వైకాపా ప్రభుత్వం

ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న ఎస్పీవోలు (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్, తిరుపతి: వారంతా రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వహించారు. కరోనా సమయంలో కనీసం ఇళ్లకు వెళ్లకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గస్తీ కాశారు. అయినా వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా విధుల్లోంచి తీసేయడంతో దిక్కుతోచని స్థితిలోపడ్డారు. వారే ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీవో). 2020లో వైకాపా ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెకుపోస్టుల వద్ద ఎస్పీవోల నియామకం చేపట్టింది. ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో విధుల్లోకి తీసుకున్న వారిని 2022లో ఎలాంటి కారణాలు లేకుండా విధుల్లో నుంచి తొలగించి వీధిన పడేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రవాణా, అక్రమ మద్యం, ఇసుక రవాణాను అడ్డుకునేందుకు అప్పటి వైకాపా ప్రభుత్వం ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,156 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన తీసుకునేందుకు మార్గదర్శకాలు జారీచేసి, పారా మిలిటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు, సైన్యంలో పనిచేసిన వారు, హోమ్‌గార్డుగా గతంలో విధులు నిర్వహించిన వారికి  ప్రాధాన్యమిచ్చారు. వారితోపాటు శారీరక దారుఢ్యం, మానసికస్థితి సరిగ్గా ఉన్న యువకులను తీసుకుంది. ఈవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 500 మంది యువకులు విధుల్లో చేరారు. ఒక్కో పోలీసు స్టేషనులో ఐదుగురు చొప్పున ఆ స్టేషన్‌ పరిధిలో ఉండే చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించగా నెలకు రూ.15,000 చొప్పున వేతనం చెల్లించారు.

యువతకు మోసం: రెండేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటూ విధులు నిర్వహించారు. అనేకమంది అక్రమ రవాణాలో నిందితులను పట్టించారు. చూసీచూడనట్లు వదిలేయండని పలువురు అధికార పార్టీ నేతలు ఫోన్లుచేసి మందలించినా భయపడలేదు. రెండేళ్లపాటు నిజాయతీగా పనిచేసిన వారిని ప్రభుత్వం ఉన్నఫళంగా తొలగించింది. జిల్లాలో చాలామంది యువకులు ఉద్యోగం వచ్చిందని అప్పుడప్పుడే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఉద్యోగం కాస్త పోవడంతో కొందరి నుంచి విడాకులు తీసుకున్న ఘటనలున్నాయి. కార్వేటినగరంలోని సందీప్‌ అనే యువకుడు మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు. 2022 నుంచి అధికారులను కలిసి తమ గోడును విన్నవించుకున్నా ఫలితం శూన్యం. వైకాపా ప్రభుత్వం తమ స్వార్థానికి వాడుకొని యువకులను మోసం చేసిందని, తెదేపా ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని వారు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని