logo

ప్రజల పథకంపై నిర్దయ

పురపాలక సంఘాల్లోని ప్రజలందరికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలన్న బృహత్తర లక్ష్యం.. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నిధులతో చేపట్టిన పనులు అటకెక్కాయి.

Published : 21 Jun 2024 04:16 IST

రూ.559 కోట్ల పనులపై గత ప్రభుత్వం తాత్సారం
పురపాలికల్లో గుక్కెడు నీటికి వెతలు

మంగళంపాడు చెరువులో అసంపూర్తిగా సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు పనులు

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: పురపాలక సంఘాల్లోని ప్రజలందరికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలన్న బృహత్తర లక్ష్యం.. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నిధులతో చేపట్టిన పనులు అటకెక్కాయి. గత ప్రభుత్వం తాగునీటి పనుల్లోనూ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. బిల్లు చెల్లింపులు అడ్డుకోవడంతో గుత్తేదారు పనులు ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రస్తుతం గుక్కెడు నీటికి పట్నంవాసులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అసంపూర్తిగా ఉన్న తాగునీటి పథకాల పనులను రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో ఏఐఐబీ బృంద సభ్యులు పరిశీలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో పనుల పూర్తిపై ఆశలు చిగురించాయి.

నెల్లూరు ప్రజారోగ్యశాఖ సర్కిల్‌ పరిధిలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, అద్దంకి, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు పురపాలక సంఘాలతోపాటు చిత్తూరు నగరపాలక సంస్థలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత తాగునీటి ఎద్దడి పరిష్కారానికి 2018లో ఏఐఐబీ రూ.559 కోట్లు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. అప్పటి తెదేపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీపేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు ఫేస్‌-1 కింద రూ.559 కోట్లను కేటాయించారు. 2018 సెప్టెంబరులో సాంకేతిక అనుమతులు వచ్చాయి. టెండర్లను ఎన్‌సీసీ దక్కించుకుంది. 2019 ఫిబ్రవరిలో ఒప్పందం కుదరగా రెండేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉంది. తదనంతరం వైకాపా ప్రభుత్వం రావడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. తదనంతరం గతేడాది ఫిబ్రవరి వరకు గడువు పొడిగించారు. కొవిడ్‌ తర్వాత గుత్తేదారు అన్నిచోట్లా చురుగ్గా పనులు ప్రారంభించారు. ట్యాంకుల నిర్మాణం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల నుంచి గొట్టాల వేయడం, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు వీధుల్లోనూ వీలుగా పైపులైన్లు సైతం చేపట్టారు. అయితే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా గుత్తేదారులు పనులు చేయడం ఆపేసి, సామగ్రిని సైతం తీసుకెళ్లిపోయారు. 

 పుత్తూరులో పనులు జరగక రహదారి పక్కనే గొట్టాలు 

పనుల విషయానికి వస్తే..

  •  సూళ్లూరుపేట, నాయుడుపేట పురపాలక సంఘాల్లో శాశ్వత తాగునీటి ఎద్దడి నిర్మూలనకుగాను 2018లో ఏఐఐబీ రూ.237.63 కోట్లు మంజూరు చేసింది. సూళ్లూరుపేటకు రూ.112.19 కోట్లు, నాయుడుపేటకు రూ.125.44 కోట్లు కేటాయించారు. ఏఐఐబీ వాటా రూ.166.34 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.71.29 కోట్లు. ఇప్పటివరకు పనులు చేసినందుకుగాను ఏఐఐబీ రూ.56.83 కోట్లు విడుదల చేయగా ఆ మేరకు సూళ్లూరుపేట, నాయుడుపేటలో ఇప్పటిదాకా 35 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
  •  సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు చెరువులో రెండువేల ఎంఎల్‌ సామర్థ్యంతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నాయుడుపేట వద్ద 1,417 ఎంఎల్‌ సామర్థ్యంతో ఏర్పాటు చేయాల్సిన ఎస్‌ఎస్‌ట్యాంకు పనులు కొద్దిమేర జరిగాయి.  
  •  పుత్తూరు పురపాలక సంఘానికి తాగునీటి అందించేందుకు శ్రీకాళహస్తి సమీపాన కండలేరు-పూండి కాల్వ నుంచి 55 కి.మీ. పైపులైన్‌ వేయాల్సి ఉండగా 35 కి.మీ. మాత్రమే జరిగాయి. రాయపేడు, లక్ష్మీపురం వద్ద సంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల్లో ఎలాంటి కదలిక లేదు.
  •  పురపాలక సంఘాల్లో తాగునీటి పథకాల పనులు గురించి తెలుసుకునేందుకు నెల్లూరు సర్కిల్‌ ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

వాటా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

పురపాలికల్లో తాగునీటి పథకాల కోసం ఏఐఐబీ 70 శాతం నిధులిస్తే.. 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నది ఒప్పందం. ఏఐఐబీ నుంచి నిధులు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఇది తెలుసుకున్న ఏఐఐబీ గుత్తేదారుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి అందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏఐఐబీ నిధుల విడుదలను ఆపేసింది. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో వారు ఎక్కడి పనులు అక్కడ ఆపేసి, సామగ్రిని తీసుకెళ్లారు.

ఈనెల 25న సమావేశం

రాష్ట్రంలో ఏఐఐబీ నిధులతో జరుగుతున్న పనులపై సమీక్షించేందుకు చైనా నుంచి బ్యాంకు ప్రతినిధుల బృందం రానుంది. వారు ఈనెల 25న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తాగునీటి పథకాల పనులతోపాటు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపులు, ప్రగతి, తదితర వాటిపై చర్చించనున్నారు. ఇందులో పథకాల పురోగతిని తెలుసుకోనున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల గురించి చర్చించనున్నారు. తదనంతరమే ఎనిమిది పురపాలక సంఘాల్లో జరుగుతున్న పనుల్లో కదలిక రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని