logo

పూర్వ సీఈవో మెడకు బిగుస్తున్న ఉచ్చు

జడ్పీ పూర్వపు సీఈవో ప్రభాకరరెడ్డి మాటకు ఎవరూ అడ్డు చెప్పకూడదు.. చెబితే వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేయడం.. ఆనక సస్పెండ్‌ చేయడం పరిపాటి.. ఇలా అతడి వేధింపులు భరించలేక పలువురు అధికారులు, ఉద్యోగులు అనారోగ్యానికి గురై మృతిచెందారని జడ్పీ ఉద్యోగ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వాదన.

Updated : 21 Jun 2024 04:20 IST

వేధింపులు భరించలేక పలువురి దుర్మరణం?
విచారణలో విస్తుపోయే వాస్తవాలు
న్యూస్‌టుడే, చిత్తూరు జడ్పీ

జడ్పీ పూర్వపు సీఈవో ప్రభాకరరెడ్డి మాటకు ఎవరూ అడ్డు చెప్పకూడదు.. చెబితే వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేయడం.. ఆనక సస్పెండ్‌ చేయడం పరిపాటి.. ఇలా అతడి వేధింపులు భరించలేక పలువురు అధికారులు, ఉద్యోగులు అనారోగ్యానికి గురై మృతిచెందారని జడ్పీ ఉద్యోగ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వాదన.. ఉద్దేశపూర్వకంగా ఆయనపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేశారని ఇంతకాలం భావించినా తీరా కలెక్టర్‌ తాజాగా నిర్వహించిన రహస్య విచారణలో ఇవన్నీ వాస్తవాలేనని తేలడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. బాధిత కుటుంబాల నుంచి వివరాల సేకరణ నేపథ్యంలో ప్రాథమిక నివేదికను కలెక్టర్‌ పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపినట్లు కలెక్టరేట్, జడ్పీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని..: వైకాపా ప్రభుత్వ హయాంలో మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో నాటి జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి సాగించిన అక్రమాలు ఇటీవల ఒక్కోటిగా వెలుగుచూడటంతో జిల్లా ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. నిన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న జడ్పీలో వరుస అక్రమాలు.. కీలక పరిణామాలు.. గత ప్రభుత్వ హయాంలో పలువురు ఉద్యోగుల(ఆ నలుగురు) అక్రమాలు బయటికొస్తున్నాయి. ఇన్ని అక్రమాలకు పాల్పడిన అధికారి.. ఇంతకాలం తమ పక్కనే ఉన్నాడా.. ఆయన్నా..మనం వెనకేసుకొచ్చిందని ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ప్రత్యేకించి ఆయన సహాయకుడు చెప్పిందే వేదంగా నడుచుకుని స్వామిభక్తి చాటుకున్నారు. అదేమిటని తమను ప్రశ్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్‌ చేయడం.. లేదా వారి కుటుంబాలకు దూరంగా జిల్లా సరిహద్దు మండలాలకు బదిలీ చేసి జడ్పీపై తన ‘ప్రభ’ చూపారు.

ఆ ఐదుగురు..?: తన అనుమతి లేకుండా సెలవులో వెళ్లిన అధికారులు, సిబ్బందినే కాక.. తనకు నమస్కరించ లేదని కొందరిని, సకాలంలో ఫోన్‌ తీసి మాట్లాడలేదని మరికొందరిని.. తనకు చెప్పకుండా ఆస్పత్రికి వెళ్లినందుకు ఇంకొందరికి మెమోలు ఇవ్వడం, సస్పెండ్‌ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలు దాటినా జడ్పీ కార్యాలయంలో పనులు చేయిస్తూ తమను ఇబ్బంది పెట్టాడని, ఫలితంగా తాము కుటుంబాలకు దూరమై కుంగిపోయి అనారోగ్యం బారిన పడ్డామంటూ గతేడాది పలువురు ఉద్యోగులు సీఎం పేషీ, పీఆర్‌ మంత్రి, కమిషనర్‌ సహా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తునే ఉన్నారు. ఆయనకున్న అండదండలు చూసి కలెక్టర్లు సైతం నోరు మెదప లేదంటే వ్యవస్థలను ఎలా ‘ప్రభా’వితం చేశాడో వేరే చెప్పనక్కర్లేదు. పూర్వ సీఈవో ఒత్తిళ్లతో తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందిన వారిలో గుడుపల్లె, నాగలాపురం ఎంపీడీవోలు శ్రీనివాసులు, బాలగణేష్, జడ్పీ కార్యాలయంలోని ఎగువశ్రేణి సహాయకుడు పురుషోత్తంరెడ్డి, ముద్రలేఖికుడు కెనడీబాబు, కార్యాలయ సహాయకుడు యుగంధర్‌ ఉన్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 

కలెక్టర్‌ విచారణతో వెలుగులోకి..: గతేడాది కమిషనరేట్‌ నుంచి విచారణకు ఆదేశించి చర్యలు తీసుకునే సమయానికి తీరా ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. దీంతో ఆయనపై ఉన్న ఫిర్యాదులు, వాటి నివేదిక దస్త్రాన్ని కమిషనరేట్‌ పెండింగ్‌లో పెట్టింది. తాజాగా.. తెదేపా నేత కాండ్ర రమేష్‌నాయుడు సహా జిల్లా నేతలు పలువురు ఇటీవల పీఆర్‌ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పూర్వ సీఈవో ఒత్తిడి, ఇబ్బంది పెట్టిన విషయమై వచ్చిన ఫిర్యాదులో ఆరోపణలు నిజమేనని పలువురు మృతుల కుటుంబీకులతో మాట్లాడాక ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో విచారణాధికారులు ఖిన్నులైనట్లు తెలిసింది. తుది నివేదికను కలెక్టర్‌.. పీఆర్‌ కమిషనరేట్‌కు నివేదించగా వారు దాన్ని సీరియస్‌గా పరిగణించి అతడిపై చర్యలకు ఒకట్రెండ్రోజుల్లో ఉతర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. జడ్పీలో గత ఐదేళ్లలో సాగిన పాలనపై ప్రత్యేక అధికారితో విచారణ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని