logo

అన్నం ప్లేటులో విషపు జెర్రి.. ఆరా తీసిన ఏపీ సీఎంవో

తిరుపతిలోని ఓ హోటల్‌లో వడ్డించిన భోజనంలో విషపు జెర్రి వెలుగు చూసింది. ప్రశ్నించిన యువకుడిపై హోటల్‌ సిబ్బంది దాడికి దిగడంతో వివాదం సీఎంవో ఆరాతీసే వరకు వెళ్లింది.

Published : 21 Jun 2024 05:09 IST

ప్రశ్నించిన యువకుడిపై సిబ్బంది దాడి
హోటల్‌ మూయించిన తిరుపతి నగరపాలక అధికారులు

అన్నం ప్లేటులోని జెర్రి

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతిలోని ఓ హోటల్‌లో వడ్డించిన భోజనంలో విషపు జెర్రి వెలుగు చూసింది. ప్రశ్నించిన యువకుడిపై హోటల్‌ సిబ్బంది దాడికి దిగడంతో వివాదం సీఎంవో ఆరాతీసే వరకు వెళ్లింది. పుత్తూరు నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చిన వాసు, అతని స్నేహితులు తిరుమల బైపాస్‌ మార్గంలోని పీఎస్‌4 హోటల్‌కు గురువారం వెళ్లారు. భోజనం వడ్డించగా వేపుడులో గుర్తించలేని విధంగా ఉన్న విషపు జర్రిని చూసి వాసు హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించాడు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది మీడియాను అడ్డుకోవడంతోపాటు యువకుడిపై దురుసుగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న నగరపాలిక వైద్యాధికారి అన్వేష్‌రెడ్డి అక్కడికి చేరుకుని వంటశాలను పరిశీలించారు. కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన సరకులతోపాటు నిబంధనలకు విరుద్ధంగా వంటశాలను ఆపరిశుభ్రత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రతాధికారులు నమూనాలు సేకరించారు. నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించినట్లు కమిషనర్‌కు ప్రాథమిక నివేదిక అందజేశారు. గురువారం రాత్రి హోటల్‌ను మూసివేసి నోటీసులు అతికించారు.

హోటల్‌ను తనిఖీ చేస్తున్న నగరపాలిక వైద్యాధికారి అన్వేష్‌రెడ్డి

సీఎంవో నుంచి ఆరా

హోటల్‌లో జరిగిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వెంటనే స్పందించారు. నగరపాలిక కమిషనర్‌ అదితిసింగ్‌ను వివరణ కోరారు. తిరుపతిలోని హోటల్‌లో జరిగిన ఘటన, తీసుకున్న చర్యలపై ఆమె నివేదిక ఇచ్చారు. తితిదే సైతం అప్రమత్తమై తిరుమలలో ఎక్కడా ఇటువంటి ఘటన జరగలేదని వివరణ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని