logo

అతివల విజయ సాధన

నేడు స్వయం ఉపాధి ద్వారా పలువురు మహిళలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటున్నారు.. గతంలో పోలిస్తే వైద్యం, ఇతర ఖర్చులు అధికమవడంతో ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఉన్న వనరులతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.

Published : 21 Jun 2024 04:24 IST

 ఉపాధి.. ఆర్థికాభివృద్ధి

డ్రస్‌ మెటీరియల్‌ విక్రయిస్తున్న ఆదిలక్ష్మి

నేడు స్వయం ఉపాధి ద్వారా పలువురు మహిళలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటున్నారు.. గతంలో పోలిస్తే వైద్యం, ఇతర ఖర్చులు అధికమవడంతో ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఉన్న వనరులతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.. సాధ్యమైనంత మేర ఖర్చులు తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు.. తమ కుటుంబ పరిస్థితులకు
అనుగుణంగా పొదుపు చర్యలు పాటించి బతుకుబండి సజావుగా సాగేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.. పుత్తూరు కేంద్రంగా రాస్‌ సేవా సమితి మహిళల ఆర్థిక ప్రగతికి పునాదులు వేస్తోంది.. పుత్తూరు, నగరి, నారాయణవనం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి పొదుపు చేసిన మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించింది.. తద్వారా వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది.. ఇలా ఎందరో మహిళలు నేడు ఆర్థికంగా స్థిరపడ్డారు.

 న్యూస్‌టుడే, పుత్తూరు

డ్రస్‌ మెటీరియల్‌ విక్రయాలతో..

నారాయణవనానికి చెందిన ఆదిలక్ష్మి మరమగ్గం ద్వారా ఉపాధి పొందుతోంది. భర్త సైతం అదే రంగంలో ఉన్నారు. ఆమె గతంలో సమీప పట్టణాల్లో తయారు చేసిన డ్రస్‌ మెటీరియల్‌ విక్రయించేవారు. రాస్‌ సేవా సమితిలో సభ్యులుగా చేరాక బ్యాంకు రుణం పొంది వ్యాపారాన్ని విస్తరించారు. ఎక్కువగా భరతనాట్యం నేర్చుకునే యువతులు, మహిళలు ధరించే డ్రస్‌ మెటీరియల్‌ తయారుచేసి మదనపల్లె, కంచి, ధర్మవరం, అరక్కోణం ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. తద్వారా నెలకు రూ.30 వేల వరకు ఆదాయం ఆర్జించి భర్తకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. మరో నలుగురికి ఉపాధి కల్పించి వారి కుటుంబాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారు.

ఒకరిపై ఆధారపడకుండా..

నగరి పట్టణానికి చెందిన ద్రాక్షాయణికి ఆరు పదుల వయసు. ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఆమె బతుకు బండి సాగిస్తున్నారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు. రాస్‌ సంఘంలో చేరక ముందు ఆమె వద్ద ఐదు గొర్రెలు ఉండేవి. పొదుపు ద్వారా బ్యాంకు రుణం తీసుకున్నారు. నేడు 50 గొర్రెల వరకు ఉన్నాయి. ఏడాదికి రూ.2లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా జీవించి పదిమôదికి ఆదర్శంగా నిలిచారు.

పిండి మిషన్‌తో నాగమణి భర్తకు అండగా..

పుత్తూరు పట్టణంలోని రజక కాలనీకి చెందిన నాగమణి దంపతులు పిండి మిషన్‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు. భర్తకు వయస్సు మీరడంతో ఆ పనిని భార్య నాగమణికి నేర్పించారు. అప్పటి నుంచి ఆమె ఆ బాధ్యత తీసుకుంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకుంది. ప్రస్తుతం ఆమె ఈ మిషన్‌ ద్వారా రూ.20 వేల వరకు ఆదాయం ఆర్జిస్తోంది. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి చక్కటి ఆర్థిక సహకారం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని