logo

అన్నార్తులకు ఆసరా..

అన్న క్యాంటీన్‌కు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది.. రుచి, శుచికరమైన ఆహారాన్ని కేవలం రూ.5కే అందిస్తుండటం ఇందుకు కారణం.

Published : 21 Jun 2024 04:27 IST

అన్న క్యాంటీన్‌లో భోజనం భేష్‌
కితాబిస్తున్న ప్రజలు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరిట స్థానిక ఎస్టేట్‌ సమీపంలో పునఃప్రారంభించిన అన్న క్యాంటీన్‌కు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది.. రుచి, శుచికరమైన ఆహారాన్ని కేవలం రూ.5కే అందిస్తుండటం ఇందుకు కారణం. రూ.5కు తేనీరు (టీ) కూడా దుకాణంలో కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కడుపు నిండా అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం
అన్న క్యాంటీన్‌లో లభిస్తుండటంతో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

స్థానిక జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయ ఆవరణలో 2018లో తెదేపా ప్రభుత్వం రూ.48లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత మూసివేసింది. అప్పటివరకు రూ.5 చెల్లించి భోజనం చేసిన కార్మికులు, రోజువారీ కూలీలు, పేదలు భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చిన వెనువెంటనే క్యాంటీన్‌ను పునఃప్రారంభించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించారు. క్యాంటీన్‌లో ఉదయం అల్పాహారంగా ఇడ్లీలు, పూరీ, ఉప్మా, పొంగల్‌ అందిస్తుండగా.. మధ్యాహ్నం, రాత్రి తెల్ల అన్నం, సాంబార్, కూర, పప్పు, పెరుగు, పచ్చడి సరఫరా చేస్తున్నారు. అల్పాహారం ఉదయం 7.30గంటల నుంచి 10.00, మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3.00, రాత్రి భోజనం 7.30గంటల నుంచి 9.00 వరకు అందిస్తున్నారు. ప్రస్తుతం క్యాంటీన్‌లో ఉదయం 350 మంది, మధ్యాహ్నం 500, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్యాంటీన్‌ ప్రారంభించిన గంట వ్యవధిలోనే భోజనం నిల్వ ఖాళీ అయిపోతున్నాయంటే.. తక్కువ ధరకు భోజనంపై ప్రజలు చూపుతున్న ఆసక్తి చెప్పనలవికాదు.

క్యాంటీన్‌ ఆవరణలో భోజనం చేస్తున్న కార్మికులు

చాలా బాగుంది..

ఇక్కడ సమీపంలో చిన్నచిన్న పనులు చేస్తూంటా. అన్న క్యాంటీన్‌ ప్రారంభించినప్పటి నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అల్పాహారంతో పాటు భోజనం రుచి చూస్తున్నా. ముఖ్యంగా అల్పాహారం చాలా బాగుంది. నిర్వహణ చక్కగా ఉంది. పేదలకు ఎంతో ఉపయోగం ఈ అన్న క్యాంటీన్‌.

 సోమశేఖర్, కార్మికుడు

పేదలకు గిట్టుబాటు..

అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. ఆకలితో అలమటించే పేదలు క్యాంటీన్‌కు వస్తే కడుపునిండా అన్నం పెడుతున్నారు. పేదలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తున్న తెదేపా ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

వినోద్‌ కుమార్, కార్మికుడు

బయట రూ.30 అవుతోంది..

అల్పాహారం తినాలంటే బయట సాధారణ హోటళ్లలో రూ.30 పెట్టాలి. అయితే అన్న క్యాంటీన్‌లో కేవలం రూ.5కే నాణ్యమైన, రుచికర అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి పేదల సంక్షేమ పథకాన్ని గతంలో ఎన్నడూ నేను చూడలేదు.

వినాయకం, స్థానికుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని