logo

పెద్దిరెడ్డి మాటలే శాసనం.. వైకాపా వీరవిధేయ ఐపీఎస్‌ రిషాంత్‌రెడ్డి బదిలీ

అప్పటి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలే ఆ ఎస్పీకి శాసనాలు.. ఆయన ఆదేశిస్తే పోలీసు చట్టాలు, నిబంధనలు ఏమాత్రం పట్టలేదు.

Updated : 21 Jun 2024 09:57 IST

రెడ్‌బుక్‌లో మొదటి పేరు ఆయనదేనని ప్రచారం

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: అప్పటి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలే ఆ ఎస్పీకి శాసనాలు.. ఆయన ఆదేశిస్తే పోలీసు చట్టాలు, నిబంధనలు ఏమాత్రం పట్టలేదు. ప్రతిపక్ష నేతను సొంత జిల్లాలోనే కాదు సొంత నియోజకవర్గంలోనూ తిరగనీయకుండా అడ్డుపడ్డారు. యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పుంగనూరు అల్లర్ల ఘటనను సాకుగా చూపి 700 మంది ప్రధాన తెదేపా నాయకులను భయభ్రాంతులకు గురిచేసిన వైకాపా వీరవిధేయ ఎస్పీ వై.రిషాంత్‌రెడ్డిపై బదిలీ వేటుపడింది. ఎన్నికల ప్రకటనకు ముందు చిత్తూరు ఎస్పీగా పనిచేస్తున్న రిషాంత్‌ రెడ్డిని ఎన్నికల కమిషన్‌ బదిలీ చేయాలని ఆదేశించినా.. అప్పటి ప్రభుత్వ అధికారులు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా బదిలీ చేస్తూనే ఇక్కడే ఉండేలా తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 చిత్తూరు  ఎస్పీగా రిషాంత్‌రెడ్డి పనిచేసిన సమయంలో తెదేపా కార్యకర్తలు ఆందోళనలు చేసే పరిస్థితి కానీ.. విమర్శించే హక్కు కూడా లేకుండా చేసినట్లు ఆరోపణలున్నాయి. గతేడాది ఆగస్టు 4న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పుంగనూరు రానుండగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు చూసిన శ్రేణులను అడ్డుకున్నారు. తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. ఏడు ఎఫ్‌ఐఆర్‌లతో 600 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 300 మందిని జైలుకు పంపారు. సుమారు 70 మందిపై రౌడీషీట్లు తెరిచారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అణచివేయడమే లక్ష్యంగా పనిచేశారు.

కుప్పంలో చంద్రబాబుకు ఆంక్షలు

చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటన నిమిత్తం శాంతిపురం మండలానికి వస్తే జీవో 1 అమలులో ఉందంటూ  అడ్డుకున్నారు.  అరాచకంగా అడ్డగిస్తారా? అంటూ చంద్రబాబునాయుడు ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథాన్ని అడ్డుకోవడంతో కాలినడకనే గ్రామాలు తిరిగారు. ఆ సమయంలో అధినేతకు అండగా నిలిచిన 60 మంది తెదేపా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

యువగళం పాదయాత్రకు అడ్డంకులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పం నుంచి చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎస్పీ రిషాంత్‌రెడ్డి అడగడుగునా అడ్డంకులు సృష్టించారు. ప్రచార రథంతోపాటు వాహనాలకు అనుమతులు లేవంటూ సీజ్‌ చేశారు. జిల్లా దాటేవరకు నిబంధనల పేరుతో కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో ప్రజల భాగస్వామ్యం లేకుండా చేయాలని విశ్వప్రయత్నం చేశారు. దీంతో యువగళం పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టిన పోలీసు అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో నమోదు చేసుకుంటున్నానని నారా లోకేశ్‌ ఆ సమయంలో ప్రస్తావించారు. రెడ్‌బుక్‌లో మొదటి పేరు అప్పటి చిత్తూరు ఎస్పీగా పనిచేసిన రిషాంత్‌రెడ్డి ఉందనే ప్రచారం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల్లో రిషాంత్‌ రెడ్డి పేరు ఉండటంతో ఇప్పుడు రెడ్‌బుక్‌ ప్రస్తావన వినిపిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని