logo

దేహానికి ఆసనం.. ఆరోగ్యానికి సింహాసనం

యోగా ఆరోగ్యానికి దివ్యౌషధం. అన్ని వర్గాలవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, మానసిక ఒత్తిడి జయించేందుకు యోగాసనాలు వేస్తున్నారు. నిరంతర యోగాభ్యసన ద్వారా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు లభిస్తాయి.

Published : 21 Jun 2024 04:42 IST

నిరంతర సాధనతో సత్ఫలితాలు
శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం
నేడు అంతర్జాతీయ యోగా  దినోత్సవం

యోగా ఆరోగ్యానికి దివ్యౌషధం. అన్ని వర్గాలవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, మానసిక ఒత్తిడి జయించేందుకు యోగాసనాలు వేస్తున్నారు. నిరంతర యోగాభ్యసన ద్వారా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు లభిస్తాయి. సాధనతో పలువురు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందారు. యోగా ఆవశ్యకతను తమ కుటుంబ సభ్యులకు సహా ఇతరులకు తెలియజేసి అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. జీవితంలో యోగాని భాగం చేసుకున్నాక వారిలో ఎలాంటి మార్పు వచ్చింది.. మానసిక ఆరోగ్య సమస్యలు ఎలా దూరమైంది వెల్లడించారు.

ఈనాడు డిజిటల్, తిరుపతి - న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌

ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడ్డా

నా పేరు మురళి. జీడీనెల్లూరు మండలం ముక్కళతూరు మా స్వగ్రామం. నేను ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. వృత్తి రీత్యా అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తుంటా. దుమ్మూ, ధూళి కారణంగా శ్వాసకోశ సమస్యతో మూడేళ్లుగా ఇబ్బంది పడ్డా. ఆసుపత్రుల్లో చికిత్స కోసం చాలా ఖర్చు చేశా. మందులు వాడుతున్నప్పుడు బాగుంటున్నా.. మళ్లీ సమస్య యథాతథంగా కొనసాగింది. యోగా ద్వారా నయం అవుతుందని తెలిసింది. మా ఊరిలో యోగా నేర్పేవారు ఎవరూ లేరు. దీంతో రోజూ ఉదయం 5 గంటలకు బయల్దేరి 6 గంటలకల్లా చిత్తూరుకు వచ్చి సాధన చేశా. ఏడాది కాలంలో 60కి పైగా ఆసనాలు వేయడం నేర్చుకున్నా. ఊపిరితిత్తుల బాధ నుంచి బయటపడ్డా. ప్రస్తుతం నేను ఎలాంటి ఔషధాల్ని వాడటం లేదు. దీంతోపాటు యోగా సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేశా. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు, రోగులకు యోగా నేర్పిస్తున్నా.


ప్రశాంతంగా ఉంటున్నా

మాది తిరుపతి. 2015లో ఆస్తమా సమస్య ఎదురుకావడంతో చాలా ఇబ్బంది పడ్డా. యోగా గురించి తెలుసుకుని నిత్యం యోగా తరగతులకు వెళ్లడం ప్రారంభించా. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేకుండా ఆనందంగా ఉన్నా. నిత్యం ఎక్కువసేపు యోగాసనాల్లో నిమగ్నమవుతున్నా. చదువులోనూ ఒత్తిడిని అధిగమించా. ప్రశాంతమైన నిద్ర పడుతోంది.

 కోటేశ్వరరావు, బీటెక్‌ చివరి సంవత్సరం


మైగ్రేన్‌ నుంచి ఉపశమనం

భర్త సునీల్‌కుమార్, పిల్లలు  షణ్ముగభార్గవ్, ఈశ్వర్‌ ప్రతాప్‌తో కరుణ

నా పేరు కరుణ. నేను గృహిణిని. చిత్తూరులో ఉంటున్నా. నా భర్త సునీల్‌కుమార్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి చిన్న పనులు చేసినా శ్రమగా ఉండేది. అసహనం ఏర్పడేది. మైగ్రేన్‌ తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడ్డా. అప్పుడు యోగా సాధన ప్రారంభించి రెండేళ్లుగా చేస్తున్నా. మొదట కష్టమనిపించినా అలవాటు చేసుకున్నా. సూర్య నమస్కారాలు, కపాలాబాతి, నాడీ శోధన, ప్రాణాయామం చేయడం ప్రారంభించాక ఆరోగ్యపరంగా  మార్పులు కనిపించాయి. నెమ్మదిగా అనారోగ్యం నుంచి విముక్తి పొందా. మైగ్రేన్‌ బాధ ఇప్పుడు లేదు. నా స్ఫూర్తితో నా భర్త సునీల్‌కుమార్, పిల్లలు షణ్ముగభార్గవ్, ఈశ్వర్‌ప్రతాప్‌ సైతం యోగా సాధన వైపు మొగ్గుచూపారు. పిల్లలు 60కి పైగా ఆసనాలు ఎంతో చక్కగా వేస్తున్నారు. బాలికలకు యోగా విశిష్టత గురించి అవగాహన కల్పిస్తున్నా.

నడుము నొప్పి తగ్గింది

నా వయస్సులో ఉన్నవారందరికీ నడుం నొప్పి రావడం సాధారణం. కానీ ఆ నొప్పిని తగ్గించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నాలో రావడంతో యోగా గురించి తెలుసుకున్నా. వజ్రాసనం వంటి ఆసనాలు వేసి అతికొద్ది రోజుల్లోనే నా శరీరాన్ని, మనసును నియంత్రణలోకి తెచ్చుకున్నా. యోగా ఉత్తమ జీవన గమనానికి ఓ అవకాశంగా భావిస్తా.  - బాబు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని