logo

పర్యావరణ విధ్వంసం.. పట్టించుకోని అధికారగణం

అరణియార్‌ నిత్యం నీటితో కళకళలాడుతుంది. ఈ కాలువ నీటికి తోడు ఊట కాలువల వెంబడి రైతులు పంటలు సాగు చేస్తారు. సిరులు పండిస్తారు. గత వైకాపా ప్రభుత్వ పెద్దల కన్ను నదిలోని ఇసుకపై పడింది. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకొని రూ.వందల కోట్లు సంపాదించారు. 

Published : 22 Jun 2024 03:47 IST

కోర్టులు ఆదేశించినా కన్నెత్తి చూడని వైనం 
ప్రభుత్వ మార్పుతో అక్రమార్కుల్లో గుబులు 

ఇసుక తవ్వకాల ధాటికి కుంగిన రైతుల కంచె

నాగలాపురం, న్యూస్‌టుడే: అరణియార్‌ నిత్యం నీటితో కళకళలాడుతుంది. ఈ కాలువ నీటికి తోడు ఊట కాలువల వెంబడి రైతులు పంటలు సాగు చేస్తారు. సిరులు పండిస్తారు. గత వైకాపా ప్రభుత్వ పెద్దల కన్ను నదిలోని ఇసుకపై పడింది. ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకొని రూ.వందల కోట్లు సంపాదించారు. 

సత్యవేడు నియోజకవర్గంలో వైకాపా నేతలు గ్రావెల్, మట్టితో పాటు ఇసుక దందా కొనసాగించారు. తెదేపా ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించగా.. వైకాపా పాలనలో టన్ను రూ.475 నుంచి రూ.650 మేర ధర నిర్ణయించి విచ్చలవిడిగా అమ్మకాలు సాగించారు. లారీ ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలించి రూ.లక్ష మేరకు విక్రయించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో దందా సాగించారు. ఈ దందాపై కోర్టు కేసులు పెరగటంతో 2022 మే 18న అరణియార్‌లో ఏవిధమైన యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకుండా కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సూచించింది. ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడంతో అధికారుల వైఫల్యంపై కారణికి చెందిన దాసు మణికంఠయ్య కేసు వేయడంతో ఇసుక తవ్వకాలు చేసిన వ్యక్తులకు ఎన్జీటీ రూ.2,10,41,210 జరిమానా విధించింది. గత ఏడాది మే 18న కారణికి చెందిన న్యాయవాది హేమకుమార్‌ వేసిన కేసుతో నదిలోని 11 కి.మీ.ల దూరంలో ఇసుక తవ్వకాలను ఎన్జీటీ నిషేధించింది. ఇసుక తవ్వకాలు చేసిన నిర్వాహకులకు రూ.18 కోట్ల జరిమానా విధించింది. దీంతో నదిలోని 18 ఇసుక రేవులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు అప్పటి గనులశాఖ రాష్ట్ర సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ప్రకటించినా చర్యలకు వెనకడుగు వేశారు. 2022 మే 2వ తేదీతో జేపీ సంస్థకు ఇసుక తవ్వకాల లీజు గడువు ముగిసినా తవ్వకాలు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు మరో పేరుతో కొనసాగించారు.

]

 చెరువులా మారిన అరణియార్‌ 

అరణియార్‌ రూపురేఖలు ఛిద్రం 

పగలు రాత్రి తేడా లేకుండా  సాగిన తవ్వకాలకు అరణియార్‌ పరివాహక కాలువ ఛిద్రమైంది. నదిలో మేట వేసిన ఇసుకను మాత్రమే తవ్వాల్సి ఉండగా.. వైకాపా నేతలు మాత్రం 20 అడుగులకు పైగా తవ్వారు. ఫలితంగా జలకళతో ఉండే కాలువ పిచ్చిమొక్కలతో చిట్టడవిలా మారింది. 

చర్యలు తీసుకుంటారా?

వైకాపా నేతలు సాగించిన పర్యావరణ విధ్వంసకాండపై గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేశాయి. అధికారం అండతో నియంతృత్వ పోడకలతో వైకాపా నేతలు తమ ఆదాయానికి గండిపడకుండా కోర్టులను అధికారుల ఆసరాతో మభ్యపెట్టాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సారథ్యంలోని ప్రభుత్వం అరణియార్‌లో  విధ్వంసకాండపై కోర్టుల ఆదేశాలను ఎలా అమలు చేస్తుందోనని అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని