logo

వైకాపా నేతలకు తహసీలుదార్లు..!

వైకాపా నేతల కనుసన్నల్లో నడిచిన తహసీల్దార్లు నిబంధనలు అతిక్రమించి రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ, డీకేటీతోపాటు న్యాయస్థానాల్లో  పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములూ కట్టబెట్టారు.

Updated : 22 Jun 2024 06:10 IST

అడ్డగోలుగా భూపందేరం 
ప్రభుత్వ, డీకేటీలు ప్రైవేటు పరం 

వైకాపా నేతల కనుసన్నల్లో నడిచిన తహసీల్దార్లు నిబంధనలు అతిక్రమించి రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ, డీకేటీతోపాటు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములూ కట్టబెట్టారు. రికార్డులనే మార్చి వైకాపా నేతలు చెప్పిన వ్యక్తుల పేర్లతో ఆన్‌లైన్‌లో మార్పులు చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయి. ప్రభుత్వం మారడంతో ఇలాంటి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ అక్రమాలు తమ మెడకు బిగుసుకుంటాయని భావిస్తున్నారు. 

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (కలెక్టరేట్‌): జిల్లాలోని పలువురు తహసీల్దార్లు వైకాపా నేతలకు రబ్బరు స్టాంపుల్లా మారిపోయారు. వారు చెప్పిన వ్యక్తులకు భూములు కట్టబెట్టారు. నిబంధనలు విరుద్ధమైనా వారికి సహకరించారు. దీంతో ప్రభుత్వ భూములతో పాటు కుంటలు, వాగులు అన్నీ ఆక్రమణకు గురయ్యాయి. అప్పటి రేణిగుంట తహసీల్దారు అడ్డగోలుగా వ్యవహరించారు. తన కార్యాలయానికి సమీపంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా చూస్తూ ఊరకుండిపోయారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకున్నారు. ఆ తహసీల్దారును ప్రాధాన్యం లేని కలెక్టరేట్‌కు అప్పటి కలెక్టర్‌ బదిలీ చేస్తే ఎమ్మెల్యే తహసీల్దారుకు అనుకూలంగా లేఖ ఇచ్చి తాను చెప్పిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. 

  • తిరుపతికి కూతవేటు దూరంలోనే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వెంకటాపురం చెరువు పోరంబోకుకు సంబంధించి సుమారు రూ.100 కోట్ల విలువైన 6.50 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు వైకాపా హయాంలో అప్పటి తహసీల్దారు రాసిచ్చేశారు. కొందరు నకిలీ పట్టాలు సృష్టించి సర్వే నంబరు 261/4లో 6.50 ఎకరాలు ఇచ్చారని పేర్కొంటూ ముందుకు వచ్చారు. తుడా, అంతకుముందు పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఇది చెరవు పొరంబోకు కింద పేర్కొన్నా వైకాపా హయాంలో రెండేళ్ల క్రితం అప్పటి తహసీల్దారు వీటికి పట్టాలు మంజూరు చేశారు. అప్పటి రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ వీటిని రిజిస్ట్రేషన్‌ చేశారు.
  • రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెం అన్‌సెటిల్డ్‌ గ్రామంగా ఉంది. గ్రామంలోని సర్వే నంబర్లు 517, 538లోని 6.85 ఎకరాల భూమిని 2020లో అప్పటి తహసీల్దారు సబ్‌డివిజËన్‌ చేసి నోషనల్‌ ఖాతాలో పొందుపర్చారు. ఇందులో భారీ ఎత్తున మామూళ్లు చేతులు మారాయి. అక్రమంగా భూమిని పొందిన వ్యక్తి సమర్పించిన పట్టాలు నకిలీవని తెలిసినా తహసీల్దారు నిబంధనలు అతిక్రమించి అతని పేరుతో పట్టాలు ఇచ్చారు. 

తిరుపతి గ్రామీణ పరిధిలో..

తిరుపతి గ్రామీణ మండల పరిధిలో పనిచేసిన అధికారుల్లో ఎక్కువ మంది వైకాపాకు కొమ్ముకాశారు. రాజకీయ బదిలీల్లో భాగంగా అప్పటి ప్రజాప్రతినిధి తమకు అనుకూలమైన తహసీల్దార్లను నియమించుకున్నారు. దీంతో కొంత ప్రజాప్రతినిధి కోసం మరికొంత తమ కోసం అన్నట్లుగా తహసీల్దార్లు నిబంధనలు అతిక్రమించారు. తిరుపతిని ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతంలో వైకాపా నేతలు భూ కబ్జాలకు పాల్పడినా వారికి అనుకూలంగా నివేదికలు ఇస్తూ వచ్చారు. అసలు ఇప్పుడు తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. తిరుచానూరు పరిధిలోని వసుంధరనగర్‌ ప్రాంతంలోని 442 సర్వే నంబరులో 3.46 ఎకరాల కాలువ పోరంబోకు స్థలం ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీని విలువ రూ.17 కోట్ల వరకు ఉంటుంది. ఆక్రమణకు గురవుతుందని తహసీల్దారు దృష్టికి తీసుకొచ్చినా చర్యలు చేపట్టలేదు. పాడిపేట పరిధిలో సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయించినా  నాటి తహసీల్దారు వైకాపా నేతలకు సహకరించారు. 

ఎక్కడికక్కడే..

నియోజకవరాల్లో పలువురు తహసీల్దార్లు ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరించారు. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక ప్రాధాన్యం లేని పోస్టుల్లోనే ఉండిపోయేందుకు మొగ్గు చూపించారు. అయితే కొందరు వీరభక్త వైకాపా అధికారులు మాత్రం రాజకీయ పోస్టింగులు తెచ్చుకుని భారీ ఎత్తున అక్రమాలకు తెగబడ్డారు.

తుడాకు ఇచ్చినా  ష్‌.. గప్‌చుప్‌

తిరుపతి -కడప ప్రధాన మార్గంలోని కరకంబాడిలో సర్వే నంబరు 153/1లో తుడాకు సుమారు 70.70 ఎకరాలు కేటాయించారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు తుడాకు భూమిని అప్పగించలేదు. ఇందులో 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. భూమిని రక్షించేందుకు తుడా అధికారులు చుట్టూ కంచె నిర్మించేందుకు రెండేళ్ల కిందట యత్నించారు. అయితే అక్కడ స్థానిక వైకాపా నేతలు దీన్ని అడ్డుకున్నారు. నాడు తహసీల్దారు కనీసం జోక్యం చేసుకుని ఇది తుడాకు ఇచ్చిన విషయాన్ని చెప్పలేదు. ఆ తర్వాత కొండను తొలచి వైకాపా నేతలు ఆక్రమిస్తున్నా అప్పటి తహసీల్దారు చర్యలు తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని