logo

గూడూరు టు రేణిగుంట మధ్య మూడో రైలు మార్గం

‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమంలో గూడూరు- రేణిగుంటకు మూడో లైన్‌ భాగ్యం దక్కింది. దీనిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గుర్తించి రైల్వే మంత్రిత్వ శాఖ సవివర నివేదికలు సిద్ధం చేసింది. ఇందుకు తాజాగా దిల్లీలో 72వ నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ సమావేశంలో చర్చించారు.

Published : 22 Jun 2024 03:54 IST

రూ.884 కోట్ల అంచనాతో కదలిక
ప్రయాణికులు, కార్గో పెంపు లక్ష్యం
కొత్త వంతెనలు, అండర్‌ పాస్‌ల ఏర్పాటు

‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమంలో గూడూరు- రేణిగుంటకు మూడో లైన్‌ భాగ్యం దక్కింది. దీనిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గుర్తించి రైల్వే మంత్రిత్వ శాఖ సవివర నివేదికలు సిద్ధం చేసింది. ఇందుకు తాజాగా దిల్లీలో 72వ నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ సమావేశంలో చర్చించారు. దీంతో ఈ పనులను ఎట్టకేలకు ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇది పూర్తయితే అటు తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రయాణికులు, సరకు రవాణా మరింత మెరుగుపడే అవకాశముంది.

న్యూస్‌టుడే, గూడూరు: గూడూరు రైల్వే జంక్షన్‌కు  రోజూ 80 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ-గూడూరు మధ్యలో మూడో లైన్‌ ప్రాజెక్టులు చాలా వరకు పూర్తయ్యాయి. ఇటు గూడూరు-రేణిగుంట, గూడూరు- చెన్నై మధ్య ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో గూడూరు-రేణిగుంట మూడో రైలు మార్గం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం కాగా ‘పీఎం గతిశక్తి’ కార్యక్రమంలో దీనిని తీసుకొచ్చారు. ఈ మేరకు దక్షిణ, మధ్య రైల్వే ప్రణాళిక చేయగా అధికారులు పనులు, భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

హైస్పీడ్‌ రైళ్లకు అనుసంధానం.. ఇప్పటికే గూడూరు వరకు ఉన్న మూడో రైలు మార్గం ఇటు విస్తరిస్తే రాష్ట్ర రాజధాని అమరావతికి మరింత వేగంగా రైళ్లు వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్గంలో హైస్పీడ్‌ రైళ్లు పరుగెత్తించడానికి ఏర్పాట్లు చేపట్టనున్నారు. గ్రామాల్లో అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో 36.58 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. 

మరింత వేగంగా సరకు రవాణా

కృష్ణపట్నం పోర్టుకు ఇది మరింత అనుసంధానం కానుంది. ఇక్కడి నుంచి సరకు రవాణా సులభం కానుంది. అటు కర్ణాటక, తమిళనాడుకు దగ్గర మార్గం అవుతోంది. అటు విజయవాడ, విశాఖ అనుసంధానం కానున్నాయి. పోర్టు నుంచి సరకు రవాణాతో పాటు రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రయాణికులు ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి సులభంగా రావడానికి అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని